Abn logo
May 14 2021 @ 18:22PM

పునర్వివాహం చేసుకున్న మహిళ.. ఉమ్మి నాకమన్న పెద్దలు!

ముంబై: మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో జరిగిన అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విడాకుల అనంతరం పునర్వివాహం చేసుకున్న ఓ యువతిపై పంచాయతీ పెద్దలు దారుణంగా వ్యవహరించారు. మళ్లీ పెళ్లి చేసుకున్నందుకు శిక్షగా తన సామాజికవర్గానికే చెందిన వ్యక్తుల ఉమ్మిని నాకాలని ఆదేశించారు. అంతేకాదు, లక్ష రూపాయల జరిమానా కూడా విధించారు. అయితే, పెద్ద తీర్పును ధైర్యంగా ఎదిరించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత నెలలో ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది. పంచాయతీ పెద్దలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 


జలగాం జిల్లాకు చెందిన బాధిత మహిళ ఫిర్యాదుపై చోప్డా సిటీ పోలీసులు నిన్న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, ఘటన అకోలా ప్రాంతంలో జరగడంతో కేసును పింజార్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈ ఘటన గత నెల 9న అకోలాలోని వాద్గాంలో జరిగింది. 2011లో తొలి వివాహం చేసుకున్న ‘నాత్ జోగి’ సామాజిక వర్గానికి చెందిన బాధిత మహిళ 2015లో భర్త నుంచి విడాకులు తీసుకుంది. 2019లో రెండో వివాహం చేసుకుంది.

విషయం తెలిసిన కుల పెద్దలు సమావేశమై ఆమె రెండో వివాహంపై చర్చించారు. అనంతరం ఆమె సోదరి, బంధువులను పిలిపించారు. రెండో పెళ్లి చేసుకున్నందుకు ఆమె తన కులానికి చెందిన వ్యక్తుల ఉమ్మిని నాకడంతో పాటు లక్ష రూపాయల జరిమానా చెల్లించాలని తీర్పుచెప్పారు.


తీర్పు చెప్పిన సమయంలో బాధితురాలు అక్కడ లేదని పోలీసులు తెలిపారు. తీర్పు ప్రకారం కుల పంచాయతీ పెద్దలు అరటి ఆకుపై ఉమ్మి వేస్తే దానిని బాధితురాలు నాకాలి. ఈ శిక్షతోపాటు లక్ష రూపాయల జరిమానా కూడా ఆమెకు విధించారని పోలీసులు పేర్కొన్నారు. ఈ శిక్షను పూర్తి చేస్తేనే ఆమెను గ్రామంలోకి అనుమతిస్తామని పెద్దలు తేల్చి చెప్పారు. ఈ తీర్పును కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న బాధితురాలు దిగ్భ్రాంతికి గురైంది. ఆ వెంటనే చోప్డా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement