నిర్లక్ష్యపు నీడలో ‘కోట’

ABN , First Publish Date - 2021-11-29T05:56:39+05:30 IST

నిర్లక్ష్యపు నీడలో ‘కోట’

నిర్లక్ష్యపు నీడలో ‘కోట’
మధ్యకోటలో ఓపెన్‌కాని కేంద్రం నిర్మించిన టికెట్‌ కౌంటర్‌లు

ప్రారంభానికి నోచుకోని మరుగుదొడ్లు, టికెట్‌ కౌంటర్‌

అందుబాటులోకి రాని పార్కింగ్‌

పోకిరీల అడ్డాగా పర్యాటక ప్రాంతం

పెరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు

ఖిలావరంగల్‌ కోటను పట్టించుకోని ప్రభుత్వాలు

మండిపడుతున్న పర్యాటకులు


ఖిలావరంగల్‌, నవంబరు 27: పర్యాటక ప్రాంతమైన ఖిలావరంగల్‌ కోటలో పర్యాటకులకు మౌలిక వసతులను కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని పర్యాటకులు వాపోతున్నారు. మధ్యకోటలో రెండేళ్ల క్రితం స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ వరంగల్‌లో భాగంగా కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో ఆధునిక టాయిలెట్స్‌ నిర్మించారు. పార్కింగ్‌ స్థలం, శిల్పాల ఆవరణలో టికెట్‌ కౌంటర్లతోపాటు టాయిలెట్స్‌ ఇంకా ప్రారంభానికి నోచుకోక నిరుపయోగంగా మారాయి. 


రూ.10లక్షలతో నిర్మించిన టాయిలెట్స్‌, రూ.30లక్షలతో వాహనాల పార్కింగ్‌ కోసం నిర్మించిన ప్రాంతాలు పర్యాటకులకు అందుబాటులోకి రాకముందే శిథిలమైపోతున్నాయి. కేంద్ర పురావస్తుశాఖ ఆధీనంలో ఉన్న కోటలో కాకతీయుల కాలంనాటి అద్భుత కళాఖండాలు, దేవాలయాలు, శిల్ప సంపదతోపాటు రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో లైట్‌ అండ్‌ సౌండ్‌ షో, ఏకశిల పిల్లల పార్కు, కీర్తి తోరణాలు, ఖుష్‌మహల్‌, సింగారపుబావి, గుండు చెరువు, మ్యూజియం తదితర దర్శనీయ ప్రాంతాలున్నాయి. 


వీటిని తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు మరుగుదొడ్లు లేక నానా అవస్థలు పడుతున్నారు. ఏకశిల పిల్ల్లల పార్కులో ఉన్న టాయిలెట్స్‌ పనిచేయడం లేదు. నీటి సౌకర్యం కూడా లేదు. కేంద్ర పురావస్తుశాఖ, ‘కుడా’ ఆధ్వర్యంలో ఇటీవల నిర్మించిన టాయిలెట్లను ప్రారంభించకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. 


పని చేయని సీసీ కెమెరాలు..

ఖిలావరంగల్‌ పడమర, మధ్యకోటలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు మూణ్నాళ్ల ముచ్చటగా మారాయి. గతేడాది ఖిలావరంగల్‌ పడమర, మధ్యకోటలో వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ ప్రారంభించిన సీసీ కెమెరాలు ప్రస్తుతం పనిచేయడం లేదు. దీంతో రాత్రి వేళ అసాంఘిక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరాలకు మరమ్మతు చేసి, పోలీసుల గస్తీని ముమ్మరం చేయాలని కోరుతున్నారు. 


అసాంఘిక కార్యకలాపాలు.. 

మధ్యకోటలోని ‘కుడా’ పార్కింగ్‌ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఇటీవల నిర్మించిన పార్కింగ్‌ స్థలంలో రాత్రులు జులాయిలు మద్యం తాగి బాటిళ్లను అక్కడే పగులగొడుతున్నారు. చుట్టూ ప్రహరీ, ఫెన్సింగ్‌ ఏర్పాటుచేసిన స్థలంలో మద్యం బాటిళ్లు, గ్లాసులు దర్శనమిస్తున్నాయి. లక్షల రూపాయలతో నిర్మించిన పార్కింగ్‌, ఆధునిక టాయిలెట్స్‌ విశ్రాంతి గదులను ప్రారంభించి పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని పర్యాటకులు కోరుతున్నారు. 








Updated Date - 2021-11-29T05:56:39+05:30 IST