ఆకలి తీర్చండి

ABN , First Publish Date - 2020-04-17T06:32:59+05:30 IST

కరోనా వ్యాప్తి వేగాన్ని లాక్‌డౌన్ కొంతమేరకు నియంత్రించగలుగుతున్నా, అది పేదలకు, మరీ ముఖ్యంగా వలసకూలీలకు తెస్తున్న కష్టాలు సామాన్యమైనవి కావు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మలివిడత లాక్‌డౌన్‌ ఊసెత్తగానే వేలాదిమంది వలస కార్మికులు...

ఆకలి తీర్చండి

కరోనా వ్యాప్తి వేగాన్ని లాక్‌డౌన్ కొంతమేరకు నియంత్రించగలుగుతున్నా, అది పేదలకు, మరీ ముఖ్యంగా వలసకూలీలకు తెస్తున్న కష్టాలు సామాన్యమైనవి కావు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మలివిడత లాక్‌డౌన్‌ ఊసెత్తగానే వేలాదిమంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు పోయేందుకు ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్‌ వద్ద గుమిగూడిన దృశ్యం దేశం ఎదుర్కొంటున్న ఓ తీవ్ర సంక్షోభానికి ఒక చిన్న ఉదాహరణ. ఉన్నచోట ఉపాధినీ, ఆదాయాన్నీ కోల్పోయి, అటు స్వస్థలాలకు పోలేక సహాయక శిబిరాల్లోను, పనిస్థలాల్లోనూ, అద్దె గదుల్లోనూ మిగిలిపోయి వలసకార్మికులు ఆహారం దొరక్క అష్టకష్టాలు పడుతున్నారు. ఇక, నకిలీ కార్డుల ఏరివేత ముసుగులో ప్రభుత్వాలు రేషన్‌కార్డులే లేకుండా చేసిన పేద కుటుంబాలకు ఈ దేశంలో కొదవేలేదు. ఆధార్‌ అనుసంధానం జరగనందున రేషన్‌ దక్కక ఆకలిచావులకు గురైన పేదల గురించి అంతాబాగున్న రోజుల్లోనే మనం ఎంతో విన్నాం. ఈ లాక్‌డౌన్‌ కాలంలో చాలా కుటుంబాలు ఆకలికి అల్లాడుతున్నట్టు, సరుకురవాణా చేస్తున్న వాహనాలపై దాడులు జరుగుతున్నట్టు, దేశంలో ఆకలిదాడులు హెచ్చినట్టు వార్తలు వినబడటంలో ఆశ్చర్యం ఏముంది? ఒకపక్క ప్రభుత్వ గిడ్డంగుల్లో కోట్లాది టన్నుల ఆహారధాన్యాల నిల్వలున్నా, వలసకార్మికుల కడుపునింపలేక ప్రభుత్వాలు ఆపసోపాలు పడుతూండటం విచిత్రంగా ఉంది.


భారత ఆహార సంస్థ గిడ్డంగుల్లో ఏడున్నరకోట్ల టన్నులకు మించి ఆహారధాన్యాల నిల్వలున్నట్టు ప్రభుత్వమే చెబుతోంది. ప్రభుత్వం నిర్థారించిన బఫర్‌స్టాక్‌ కంటే ఇది మూడురెట్లు అధికం. అవసరానికి మించి రెట్టింపు నిల్వలున్నాయని కేంద్రమంత్రులే గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ ఏడాది పదికోట్ల టన్నులకు పైగా గోధుమ, అంతకంటే ఎక్కువ పప్పుధాన్యాలు చేతికిరాబోతున్నట్టు కూడా ప్రభుత్వం లెక్కగట్టింది. ఈ స్థాయి ఉత్పత్తిని నిల్వచేయగలిగే సామర్థ్యం మన దగ్గరున్నదా అన్న అనుమానాలను అటుంచితే, కరోనా ప్రవేశానికి ముందే అది సృష్టించబోయే సంక్షోభాన్ని సంపూర్ణంగా ఎదుర్కోవడానికి సరిపడా ఆహారనిల్వలు మన దగ్గర సిద్ధంగా ఉన్నాయని అర్థం. ఇతరదేశాలనుంచి ఆహారధాన్యాల దిగుమతులు ఏమాత్రం లేకున్నా, ఏడాదిపాటు దేశప్రజల ఆకలిని చల్లార్చడానికి ఇవి పూర్తిగా సరిపోతాయి. అవేగనుక లేకుంటే కరోనాతోపాటు ఆకలితోకూడా ప్రజలు యుద్ధం చేయాల్సి వచ్చేదేమో. నిల్వలు అన్ని ఉన్నా ఇప్పుడూ అదే జరుగుతూండటం విషాదం. సంక్షోభకాలంలోనే పాలకుల సమర్థత ప్రజలకు అర్థమవుతుంది. చురుకైన నిర్ణయాలు తీసుకొని, గిడ్డంగులనుంచి పెద్దమొత్తంలో దేశం నలుమూలలకూ ఆహారధాన్యాలు తరలించి ప్రజల కడుపు నింపాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.


దేశంలో అత్యధికులకు రేషన్‌కార్డులు లేకపోవడం, మరీ ముఖ్యంగా ఎక్కడికక్కడ నిలిచిపోయిన వలసకార్మికుల దగ్గర తమ ఉనికిని నిర్థారించుకోగలిగే ఆధారాలు ఉండకపోవడం పాలకుల వితరణకు అడ్డుపడుతున్నట్టు ఉంది. వలస కూలీలకు అటు నగరాల్లో రేషన్‌కార్డులు ఇవ్వరు, స్వగ్రామాల్లో నివాసం ఉండరు కనుక ఉన్నవి కూడా ఏరివేతలో పోతాయి. తమ దగ్గర చిక్కుబడిపోయిన వలసకార్మికులకు కొన్ని రాష్ట్రాలు ఆహారధాన్యాలు పంచుతున్నా, అది కేవలం దయతో జరుగుతున్నదే. వీరి విషయంలో ఒక విధానపరమైన, వ్యవస్థీకృత ప్రక్రియంటూ ఏర్పడనందున ఇలా కడుపునింపుకుంటున్నవారి సంఖ్య కూడా స్వల్పమే. ఈ నేపథ్యంలో, కనీసం ఏడాదిపాటు వినియోగంలో ఉండే ఎమర్జెన్సీ రేషన్‌ కార్డులను గ్రామీణ, పట్టణ తేడాలేకుండా పేదలందరికీ జారీ చేసి, ప్రజా పంపిణీ వ్యవస్థను దేశం మొత్తం వర్తించేలా సార్వత్రికం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మార్గంలో ఇప్పుడు జరుగుతున్న కేటాయింపులకంటే కాస్తంత ఎక్కువ ఆహారధాన్యాలు అవసరపడవచ్చు కానీ, ఈ సంక్షోభకాలంలో ఆకలి తీర్చడమన్న ప్రధాన లక్ష్యం కచ్చితంగా నెరవేరుతుంది. రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియలో ప్రభుత్వాలు సర్వసాధారణంగా అనుసరించే కఠినాతికఠినమైన నిబంధనలన్నీ పక్కనబెట్టి, ఈ ఎమర్జెన్సీ కార్డులను ఉదారంగా ఇవ్వగలిగితే ఆకలితో ఉన్న ప్రతీవారికీ అన్నంపెట్టడం సాధ్యపడుతుంది. నగదు బదిలీకంటే ఆహారం అందడం పేదలకు ఇప్పుడు అవసరం. అందరి కడుపూ నింపడం ప్రభుత్వ బాధ్యత.

Updated Date - 2020-04-17T06:32:59+05:30 IST