క్యాటరింగ్‌ కుదేలు

ABN , First Publish Date - 2021-05-08T06:43:03+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ అన్ని రంగాలను దెబ్బతీస్తోంది. మే, జూన్‌లో వరుసగా ముహూర్తాలు ఉండడం.. కరోనా కారణంగా అవి వాయిదా పడడంతో క్యాటరింగ్‌ పరిశ్రమ కుదేలైంది.

క్యాటరింగ్‌ కుదేలు
పెళ్లి మండపం

కరోనా విజృంభణతో..

పెళ్లిళ్ల ఆర్డర్లు రద్దు

ఇబ్బందులు పడుతున్న నిర్వాహకులు

బౌద్ధనగర్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ అన్ని రంగాలను దెబ్బతీస్తోంది. మే, జూన్‌లో వరుసగా ముహూర్తాలు ఉండడం.. కరోనా కారణంగా అవి వాయిదా పడడంతో క్యాటరింగ్‌ పరిశ్రమ కుదేలైంది. దీంతో నిర్వాహకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. గత ఏడాది నుంచి కేటరింగ్‌ నిర్వాహకులు భారీగా నష్టపోతున్నారు. ఒక పెళ్లి రద్దుతో క్యాటరింగ్‌తోపాటు డెకొరేషన్‌, బ్యాండ్‌మేళం, సన్నాయి వాయిద్యం తదితర ఆర్డర్లు రద్దుకావటంతో వారు రోడ్డుమీదకి వస్తున్నారు. వంటమనుషులు, వర్కర్లు, సర్వీస్‌ చేసేవారికి ఉపాధి కరువుతోంది. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో క్యాటరింగ్‌ పరిశ్రమ ద్వారా సుమారు ఐదువేలమంది ఉపాధి పొందుతున్నారు. కొవిడ్‌తో వీరందరికీ ఉపాధి కరువైంది. 

 సికింద్రాబాద్‌లో 220.. 

సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో 220 క్యాటరింగ్‌ సంస్థలు ఉన్నాయి. వీటిలో అధికంగా వారాసిగూడ, బౌద్ధనగర్‌, సీతాఫల్‌మండి, చిలకలగూడలో ఉన్నాయి. నగరంలో క్యాటరింగ్‌కు పెట్టింది పేరుగా వారాసిగూడ చెబుతారు. వేలాది కుటుంబాలు క్యాటరింగ్‌పై ఆధారపడి బతుకున్నాయి. 10 నుంచి లక్షమందికి ఆర్డర్లు తీసుకుని క్యాటరింగ్‌ చేసేవారు. కరోనా నేపథ్యంలో పెళ్లిళ్లతోపాటు ఇతర కార్యాలు లేకపోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది మార్చి నుంచి క్యాటరింగ్‌ నిర్వాహకుల కష్టాలు ప్రారంభమయ్యాయి. లాక్‌డౌన్‌ సడలించిన తర్వాత గత ఏడాది డిసెంబర్‌ నుంచి ఆర్డర్లు పెరుగుతుండడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు. సెకండ్‌వేవ్‌లో కరోనా విజృంభిస్తుండడంతో ఆర్డర్లు రద్దవుతున్నాయి. 

మూతపడిన చిన్న సంస్థలు

కరోనాతో చిన్న క్యాటరింగ్‌ సంస్థలు మూతపడ్డాయి. ఆర్డర్లు లేకపోవడంతో కొంతమంది నిర్వాహకులు గ్రామాలకు వెళ్లిపోతుండగా.. మరికొంతమంది ప్రైవేట్‌ ఉద్యోగాలు, ఇంకొంతమంది చిన్నా చితక పనులు చేసుకుంటున్నారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో సుమారు 50 చిన్న క్యాటరింగ్‌ సంస్థలు మూతపడినట్లు సమాచారం.

అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వాలని ఒత్తిడి

పెళ్లిళ్లు, ఇతర కార్యాలకు వంట చేయటానికి క్యాటరింగ్‌ నిర్వాహకులకు ఇచ్చిన అడ్వాన్స్‌లు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. అడ్వాన్స్‌ను వర్కర్లకు ఇచ్చామని, తర్వాత ఇస్తామని నిర్వాహకులు చెబుతున్నా అడ్వాన్స్‌ ఇచ్చిన వారు వినిపించుకోవడం లేదని, దీంతో అప్పుచేసి అడ్వాన్స్‌ తిరిగి ఇచ్చేస్తున్నామని వాపోతున్నారు. 

పలు రాష్ట్రాల కార్మికులకు ఉపాధి 

రాష్ట్రంలోని వారికే కాకుండా పలు రాష్ట్రాల కార్మికులకు క్యాటరింగ్‌ ఉపాధి కల్పిస్తోంది. ఒకపెళ్లిలో ఐదువందల మందికి ఆర్డరు తీసుకుంటే 60 మంది, వెయ్యిమందికైతే 150 మంది కార్మికులు పనిచేస్తారు. పశ్చిమబెంగాల్‌, ఒడిశా నుంచి స్టేజ్‌ డెకొరేషన్‌ చేయటానికి లేబర్‌ సంవత్సరం కాంట్రాక్ట్‌పై క్యాటరింగ్‌ నిర్వాహకులు వద్ద చేరతారు. వీరికి ఆర్డర్లు ఉన్నా లేకున్నా సంవత్సరానికి రెండులక్షల పైనే చెల్లించాల్సిందే. కొవిడ్‌ పుణ్యమా అని గత ఏడాది పెళ్లిళ్లు, వివిధ కార్యాల ఆర్డర్లు లేకపోవడంతో నష్టాల బారిన పడుతున్నామని కేటరింగ్‌ నిర్వాహకులు అంటున్నారు. 

ప్రభుత్వం ఆదుకోవాలి

మే నెలలో 28 పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తుండడంతో చాలామంది పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నామని, తేదీ మరలా చెబుతామని అడ్వాన్స్‌ తిరిగి ఇచ్చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. కొంతమంది పది, ఇరవైమంది సమక్షంలో సింపుల్‌గా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం కేటరింగ్‌ నిర్వాహకులను ఆదుకోవాలి.

- మల్లేష్‌, వైకుంఠ క్యాటరర్స్‌, వారాసిగూడ 

Updated Date - 2021-05-08T06:43:03+05:30 IST