కారణజన్ముడు మన నరేంద్రుడు

ABN , First Publish Date - 2020-09-15T06:11:32+05:30 IST

మన దేశ చరిత్రలో 1950కు కీలకమైన ప్రాధాన్యం ఉన్నది. 1950 జనవరి 16న మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారతదేశం తొలి కామన్‌వెల్త్ రిపబ్లిక్‌గా గుర్తింపు పొందింది...

కారణజన్ముడు మన నరేంద్రుడు

దేశ రాజకీయాల్లో ప్రజా ప్రతినిధులంటే ప్రజా సేవకులు. ఇప్పటివరకూ రాజకీయాల్లో ప్రవేశించడం అంటే తమను దోపిడీ చేసేందుకే అని జనం భావించేవారు. మోదీ నాయకత్వంలో రాజకీయాల నిర్వచనమే మారిపోయింది. దోపిడీదారుల వెంటపడడం, అవినీతిని నిర్మూలించడం, పారదర్శకమైన పాలనను అందించడం, ప్రజలకు సేవ చేయడం రాజకీయాల పరమార్థంగా ఆయన నిర్దేశించారు. కుంభమేళాలో అద్భుతంగా సేవలందించిన మునిసిపల్ కార్మికుల పాదాలు ఆయన కడిగారంటేనే మోదీ ఆలోచనా విధానం మనకు అర్థమవుతుంది.


మన దేశ చరిత్రలో 1950కు కీలకమైన ప్రాధాన్యం ఉన్నది. 1950 జనవరి 16న మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారతదేశం తొలి కామన్‌వెల్త్ రిపబ్లిక్‌గా గుర్తింపు పొందింది. దేశంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పడింది. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆవిర్భవించింది. డాక్టర్ రాజేంద్రప్రసాద్ భారత దేశ తొలి రాష్ట్రపతిగా రాష్ట్రపతి భవన్‌లో అడుగుపెట్టారు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే జమ్ము కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమైనప్పటికీ దానికి స్వతంత్రప్రతిపత్తి కల్పించారు. ఇదే సంవత్సరం జాతీయవాద విప్లవకారుడు, ఆధ్యాత్మికవేత్త అరబిందో మరణించారు. 562 సంస్థానాలను విలీనం చేసి దేశ సమగ్రతను సాధించిన సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ గుండెపోటుతో మరణించారు. ఆ సంస్థానాల్లో ఒకటైన తెలంగాణ విమోచన జరిగిన సెప్టెంబర్ 17, 1950న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మించారు.


1950లోనే అయోధ్యలో శ్రీరాముడి విగ్రహానికి పూజలు చేసేందుకు అనుమతించాలంటూ ఫైజాబాద్ కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. దేశంలో జరిగిన అనేక ఘోరాలకు, అవినీతి, అరాచకాలకు, అస్తిత్వం కోల్పోవడానికి 1950లో జరిగిన పరిణామాలు పునాది వేశాయి. ఈ రుగ్మతల నుంచి దేశాన్ని కాపాడేందుకే అదే సంవత్సరంలో నరేంద్రమోదీ కారణజన్ముడిలా జన్మించాడనడం అతిశయోక్తి కాదు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాతే కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడం, అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రారంభం కావడం జరిగాయంటేనే ఏడు దశాబ్దాల క్రితం నాటి ఘటనలు ఆయనను ఎంత బలంగా ప్రభావితం చేశాయో, కర్తవ్య నిర్వహణ దిశగా ఆయనను ఎంతగా ప్రేరేపించాయో అర్థమవుతుంది. సింధూ నాగరికత పరిఢవిల్లిన గుజరాత్‌లోని మెహసానా జిల్లాలో వెనుకబడిన ఘాంచీ కులంలో జన్మించిన మోదీది అత్యంత నిరుపేద కుటుంబం. ఆయన తండ్రి దామోదర్ దాస్ వడ్‌నగర్ రైల్వేస్టేషన్ ప్రవేశద్వారం వద్ద చిన్న టీ దుకాణం నడిపేవారు. పేడతో అలికిన నేల ఉన్న చిన్నరైలు కంపార్ట్‌మెంట్ లాంటి ఇంట్లో వారి కుటుంబం నివసించేది. తల్లి హీరాబాయ్ చాలా ఇళ్లలో పనిమనిషిగా పని చేసేవారు. అంట్లు తోమేవారు. నీళ్లు తోడేవారు.


పేదకుటుంబమైనా మోదీకి చిన్నతనంలోనే రాజకీయ చైతన్యం ఉండేదనడానికి అనేక ఉదంతాలున్నాయి. బాల్యం నుంచే ఆయనకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. స్థానిక విష్ణుపురి ఆలయ సముదాయంలో బాలశాఖలో ఆయన చేరారు. రసిక్‌భాయ్ భావే అనే నేత ఉధృతం చేసిన మహాగుజరాత్ ఉద్యమం ప్రభావం ఆయనపై పడింది. ఈ ఉద్యమ కరపత్రాలను, బాడ్జీలను ఆయన చిన్నప్పుడే వీధుల్లో పంచిపెట్టేవారు. ఏమీ తెలియని వయస్సులో మహా గుజరాత్ ఉద్యమం తనపై ప్రగాఢ ప్రభావం ఏర్పర్చిందని మోదీ ఒక సందర్భంలో చెప్పారు.. ‘‘ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ద్వేషభావం ఏర్పడినట్లు నాకు ఆనాడే అర్థమైంది. కాంగ్రెస్‌ను ప్రజలు దూషించడం, కాంగ్రెస్ నేతల దిష్టిబొమ్మలు తగులబెట్టడం వంటి దృశ్యాలు తన మనోఫలకం నుంచి ఇంకా చెరిగిపోలేదు’’ అని ఆయన చెప్పారు. అదే కాదు, తన 12 ఏళ్ల వయస్సులో జరిగిన భారత చైనా యుద్ధం ప్రభావం కూడా మోదీపై పడింది. తన సోదరుడు సోంభాయ్ మెహసానాలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్లిన మోదీకి భారత సైనికులకు టీ సరఫరా చేస్తున్నప్పుడు వారిని చూసి భావోద్వేగానికి లోనయ్యేవారు. తాను కూడా సైన్యంలో చేరాలని అనుకుని జామ్‌నగర్‌లోని సైనిక్ స్కూలులో చేరేందుకు దరఖాస్తు పెట్టుకున్నారు. కాని అక్కడ చదివించేంత డబ్బులు తనకు లేవని తండ్రి నిస్సహాయత వ్యక్తం చేశారు. అయితేనేం బిఎన్ హైస్కూల్‌లో ఉండగా ఆయన జూనియన్ ఎన్‌సిసిలో చేరారు. స్కూలులోనే ఆయనలో నాయకత్వ లక్షణాలు వ్యక్తమయ్యాయి. కూలిపోయిన స్కూలు గోడ కట్టించేందుకు ఆయన విద్యార్థిగానే నాటకాల ప్రదర్శనల ద్వారా చందాలు పోగు చేశారు. తరగతి రిప్రజెంటెటివ్‌గా ఎన్నికయ్యారు.


చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక చింతనలో పడిన మోదీ అన్ని భవబంధాలు తెంచుకుని 18వ ఏటే ఇంటి నుంచి వెళ్లిపోయారు. చిన్నతనంలోనే సంసారాన్ని వదిలివేసిన బుద్ధుడు ఆయనను ప్రభావితం చేశారు. తాను అందరిలా జీవించలేనని కుటుంబ సభ్యులకు చెప్పారు. దాదాపు రెండేళ్లు ఆయన ఎక్కడెక్కడ తిరిగారో ఎవరికీ తెలియదు. కోల్‌కతా సమీపంలోని బేలూరుమఠ్ లోని రామకృష్ణ మిషన్‌కు వెళ్లారు. కొంతకాలం రాజ్‌కోట్ లోని ఆశ్రమంలో ఉన్నారు. అల్మోరాలోని వివేకానంద కేంద్రలో గడిపారు. హిమాలయాల్లో తిరిగి రకరకాల వ్యక్తులను కలుసుకున్నారు. సాధువుల ప్రభావంతోనే ఆయన గడ్డం పెంచడం ప్రారంభించారు. అనేక గ్రంథాలు చదివారు. చివరకు మానవ సేవే మాధవ సేవ అంతరార్థం బోధపడి నిత్యజీవితంలో యోగిలా జీవిస్తూనే ప్రజలకు సేవ చేయవచ్చునని అర్థం చేసుకున్నారు. జనసంఘ్‌లో పని చేస్తూనే ఆర్‌ఎస్‌ఎస్‌లో కార్యకలాపాలు నిర్వహించేవారు. కష్టపడి పని చేస్తూ ఏ పని చేపట్టినా సమర్థవంతంగా నిర్వహించడం వల్లే ఆయన క్రమక్రమంగా జీవితంలో ఉన్నత స్థానాలకు అధిగమించారు. అయితే మానసికంగా ఆయనలో సాధువు మనస్తత్వం, ఆధ్యాత్మికత, సేవాభావం వీడలేదు. తనకంటూ ఆయన ఎప్పుడూ ఆస్తులు సమకూర్చుకోలేదు. అధికారిక హోదాల్లో ఉన్నందువల్ల వచ్చిన ఆదాయమంతా ఆయన దానధర్మాలకే కేటాయించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా తన ఆదాయంలో అధికభాగం బాలికల విద్యకే కేటాయించారు. ప్రధానమంత్రి కేర్ నిధికి కూడా ఆయన రూ.50లక్షలు తన స్వంతఖాతాలోంచి కేటాయించారు. ఆయన పిలుపు మేరకే లక్షలాది మంది బిజెపి కార్యకర్తలు కరోనా సమయంలో దేశమంతటా ప్రజలకు రకరకాల సేవలందించారు.


ప్రధానమంత్రి అంటే ప్రధాన సేవకుడని, రాజకీయాల్లో ప్రజాప్రతినిధులు సేవాభావంతో ప్రజలకు సేవ చేయాలని నరేంద్ర మోదీ తరుచూ ఎందుకు అంటుంటారో తెలుసుకోవాలంటే చిన్నప్పటి నుంచీ ఆయన జీవితం, ఆయన ఆలోచనా విధానం తెలుసుకోవాలి. అందుకే అందరు నాయకుల మాదిరి ఆయన తన పుట్టిన రోజును విలాసవంతంగా జరుపుకోరు. కేక్‌లు కట్ చేయడం, సంబరాలు జరుపుకోవడం ఆయనకు ఏ మాత్రం ఇష్టం లేదు. తాను చెప్పకపోయినా తన పార్టీ వారు తన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటారని తెలిసి ప్రధానమంత్రి వారిని కూడా ఆ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అందుకే సెప్టెంబర్ 14 నుంచి సెప్టెంబర్ 20 వరకు సేవా వారోత్సవాలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఈ సెప్టెంబర్‌తో నరేంద్రమోదీకి 70 ఏళ్లు పూర్తవుతున్నందువల్ల వార్డుస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 70 చొప్పున కార్యక్రమాలు పార్టీ చేపడుతోంది. నరేంద్ర మోదీకి వికలాంగులు అన్న పదం నచ్చదు. అందుకే ఆయన వారికి దివ్యాంగులు అని పేరు పెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా ప్రతి మండలంలోనూ కనీసం 70 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ఇతర ఉపకరణాలు, వృద్ధులకు కళ్లద్దాలను పార్టీ ఉచితంగా అందిస్తోంది. ప్రతి మండలంలో కనీసం 70 మంది కరోనా పీడితులకు ప్లాస్మా దానం చేయాలని, 70 రక్తదాన శిబిరాలు నిర్వహించాలని, ప్రతి బూత్‌లోనూ కనీసం 70 మొక్కలు నాటాలని, ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లోను, ప్రతి పట్టణంలోని 70 ప్రాంతాల్లో స్వచ్ఛభారత్ కింద పరిశుభ్రతా కార్యక్రమాలు చేపట్టాలని బిజెపి నిర్ణయించింది. ప్రధానమంత్రి జీవితం, లక్ష్యాలను వివరిస్తూ కనీసం 70 సమావేశాలు ప్రతి జిల్లాలో నిర్వహిస్తోంది.


దేశ రాజకీయాల్లో ప్రజా ప్రతినిధులంటే ప్రజా సేవకులు. ఇప్పటివరకూ రాజకీయాల్లో ప్రవేశించడం అంటే ప్రజలను దోపిడీ చేసేందుకే అని జనం భావించేవారు. మోదీ నాయకత్వంలో రాజకీయాల నిర్వచనమే మారిపోయింది. దోపిడీదారుల వెంటపడడం, అవినీతిని నిర్మూలించడం, పారదర్శకమైన పాలనను అందించడం, ప్రజలకు సేవ చేయడం రాజకీయాల పరమార్థంగా ఆయన నిర్దేశించారు. కుంభమేళాలో అద్భుతంగా సేవలందించిన మునిసిపల్ కార్మికుల పాదాలు ఆయన కడిగారంటేనే మోదీ ఆలోచనా విధానం మనకు అర్థమవుతుంది. మోదీని అర్థం చేసుకుని ఆయన దారిలో నడవడం ద్వారానే దేశం అభివృద్దిలో కొత్తపుంతలు తొక్కుతుందనడంలో సందేహం లేదు.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Updated Date - 2020-09-15T06:11:32+05:30 IST