Abn logo
Sep 29 2021 @ 17:41PM

ఆ బావి దగ్గరకు వెళ్లిన వాళ్లు ప్రాణాలతో తిరిగి రాలేదు.. వందల ఏళ్ల మిస్టరీని తేల్చేద్దామని దిగిన శాస్త్రవేత్తలకు ఏం కనిపించాయంటే..

ఇంటర్నెట్ డెస్క్: భూమిపై నిజంగానే మానవాతీత శక్తులు ఉన్నాయా? వాటి పరిసరాల్లోకి వెళితే.. మనుషులనే కాదు.. ఇతర జీవజాలన్నీ కూడా ఆ శక్తులు వదిలిపెట్టవా? అంటే.. ఒమన్, యెమెన్ సరిహద్దులోని ఓ ప్రాంతం ప్రజలు అవుననే సమాధానం చెబుతారు. దీనికి తమ ప్రాంతంలోని ఓ బావిని ఉదాహరణగా పేర్కొంటారు. మృత్యుకుహరంగా పిలిచే ఆ బావిని తలచుకోవడానికి కూడా భయపడిపోతుంటారు. కొన్ని మిలియన్ ఏళ్ల క్రితం నుంచీ ఉన్న ఆ బావిలో మానవాతీత శక్తులు ఉన్నాయని.. ఆ బావి పరిసర ప్రాంతాలకు వెళ్లిన పక్షులను, జంతువులను, మనుషులను అవి అంతమొందిస్తాయని ఆందోళన చెందుతారు. దాని దగ్గరకు వెళ్లిన వెళ్లిన వాళ్లు బతికి బయటపడ్డట్లు చరిత్రలో లేదని చెబుతుంటారు. అయితే వారి  మాటల్లో నిజమెంత అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వార్తలోకి ఓసారి లుక్కేయండి. 


యెమెన్‌‌, ఒమన్ సరిహద్దు ప్రాంతమైన అల్ మహ్రా రీజియన్‌లోని ఎడారి ప్రాంతంలో భూ ఉపరితలంపై 30 మీటర్ల వెడల్పు, 112 మీటర్ల లోతుతో ఏళ్ల క్రితం నాటి బావి ఉంది. ఈ బావిలో మానవాతీత శక్తులు ఉన్నాయని భావిస్తూ దాన్ని మృత్యుకుహరంగా పిలుస్తుంటారు. ఈ బావి గురించి తలచుకోవాలంటేనే గడగడా వణికిపోతారు. దాని వైపు కన్నెత్తైనా చూడరు. పొరపాటున చూస్తినా.. దాని గురించిన ఆలోచన మదిలో మెలిగినా ఏదో కీడు జరుగుతుందని కొన్నేళ్లుగా ఇక్కడి ప్రజలు నమ్ముతున్నారు. దానిపై నుంచి ఎగురుతున్న పక్షులను, చుట్టుపక్కలకు వెళ్లిన మనుషులను, జంతువులను ఆ బావి ఆకర్షిస్తుందని.. దాని దగ్గరకు వెళ్లిన వారు బతికి బయటపడ్డ దాఖలాలు లేవని బలంగా విశ్వసిస్తుంటారు. ఈ విషయం యెమెన్ ప్రభత్వ దృష్టికి కూడా వెళ్లింది. అయితే అక్కడి ప్రభుత్వం మాత్రం.. ఇది ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ఉన్న విషయం కాబట్టి ప్రభత్వం కూడా ఈ విషయాన్ని చూసిచూడనట్టు వదిలేసింది.


ఈ క్రమంలోనే ఒమన్‌లోని జర్మన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన ఒమన్‌ కేవ్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ టీమ్‌ (ఓసీఈటీ) ఆ బావి గుట్టురట్టు చేయాలని నిర్ణయించుకుంది. బావిలోని మిస్టరీని ఛేదించి.. నిజానిజాలు ఎంటో ప్రజలకు చెప్పేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే కొందరు ఓసీఈటీ సభ్యులు.. మృత్యుకుహరంగా పిలిచే ఆ బావిలోకి తాజాగా దిగారు. అంతేకాకుండా బావిలో వారు గమనించిన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆ బృందానికి నాయకత్వం వహించిన మహ్మద్ అల్ కింది అనే జియాలజిస్ట్ మాట్లాడుతూ.. మిస్టరీ బావిలో కొన్ని జంతు, మనుషులు, పాములకు సంబంధించిన ఎముకలు తమకు కనబడినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆ బావిలో వందల సంఖ్యలో పాములు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు వెల్లడించారు. వాటి జోలికి తాము వెళ్లకపోవడంతో అవి కూడా తమ జోలికి రాలేదని చెప్పారు. 


అయితే బావిలోకి దిగుతున్న సమయంలో.. విపరీతమైన దుర్గంధం వచ్చిందని.. కొన్ని పక్షులు చనిపోయి ఉండటం వల్ల ఆ వాసన వచ్చి ఉండొచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. బావిలోని మట్టి, రాళ్లు, నీళ్లు, జంతువుల కళేబరాలకు  సంబంధించిన శాంసిళ్లను సేకరించినట్లు చెప్పారు. అయితే వాటిని ఇంకా పరీక్షించలేదని వెల్లడించారు. పరీక్షించిన తర్వాత ఫలితాలను బయటపెడుతామని చెప్పారు. అంతేకాకుండా బావిలో తమ బృందం సుమారు 6 గంటలపాటు గడిపినట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో అందులో అతీతశక్తులు ఉన్నాయనే భావన తమకు కలగలేదని చెప్పారు. ఇదిలా ఉంటే.. బావిలోకి దిగిన బృందసభ్యులకు త్వరలోనే అశుభం జరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption

ప్రత్యేకంమరిన్ని...