సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది కదా..: మంత్రి బొత్స

ABN , First Publish Date - 2020-02-22T20:28:10+05:30 IST

తనకు సంబంధం లేని వోక్స్ వ్యాగన్‌ కేసుపై సీబీఐ ఎంక్వైరీ వేశారని, ఆ కేసులో తనకు సీబీఐ క్లీన్ చిట్ కూడా ఇచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తాను బిసి మంత్రినే కదా? సీబీఐ క్లీన్ చిట్

సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది కదా..: మంత్రి బొత్స

విజయనగరం : తనకు సంబంధం లేని వోక్స్ వ్యాగన్‌ కేసుపై సీబీఐ ఎంక్వైరీ వేశారని, ఆ కేసులో తనకు సీబీఐ క్లీన్ చిట్ కూడా ఇచ్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తాను బిసి మంత్రినే కదా? సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినా పదే పదే తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారని విపక్ష నేతలను బొత్స ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో రూ.2 వేల కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టిన లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు దొరికాయని ఐటీ అధికారులే చెప్పారని అన్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగిపై ఐటీ దాడులు జరగటం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.


ఉగాది రోజున పేదలందరికీ ఇళ్ల పట్టాలు..

ఈనెల 24న విజయనగరంలో జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉగాది రోజున పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. పేదల ఇళ్ల స్థలాల కోసం బలవంతపు భూసేకరణ ఎక్కడా చేయటం లేదని మంత్రి స్పష్టం చేశారు. రైతుల ఇష్ట ప్రకారమే భూములు కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. పేదవారికి ఇల్లు లేకుండా చేయటానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని బొత్స తీవ్ర విమర్శలు చేశారు. 24వ తేదీన విజయనగరంలో జరగనున్న జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. గత ఎనిమిది నెలలుగా అమరావతి ఇన్‌సైడ్ ట్రేడింగ్, దోపిడీపై పదే పదే చెబుతున్నామని, తమపై ఎంక్వైరీ వేయమని ప్రతిపక్షాలు పలుమార్లు అడిగారని, అందుకే దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేశామని మంత్రి బొత్స తెలిపారు. ఒక్క ఆర్కిటెక్చర్ ఫీజ్ కోసమే రూ.842 కోట్లు నిర్ణయించారని, ఇప్పటికే ఆర్కిటెక్చర్ ఫీజు కింద రూ.342 కోట్లు చెల్లింపులు జరిపారని గత ప్రభుత్వ విధానాలను మంత్రి తూర్పారబట్టారు. అమరావతిలో భూకేటాయింపులు శాస్త్రీయ పద్దతిలో జరగలేదని, భారీ అవకతవకలు జరిగాయని బొత్స ఆరోపించారు. రైతుల పేరుతో శుక్రవారం నాడు సీపీఐ నాయకుడు డి. రాజాను కలిసింది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాదా? అని ప్రశ్నించారు. రైతుల ముసుగులో ఏం కుట్రలు చేస్తున్నారు అంటూ విపక్ష పార్టీలపై భగ్గుమన్నారు.

Updated Date - 2020-02-22T20:28:10+05:30 IST