Abn logo
Sep 14 2021 @ 12:20PM

సీబీఐ, ఈడీ అధికారులకు బెంగాల్ స్పీకర్ సమన్లు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ స్పీకర్ బిమన్ బందోపాధ్యాయ్ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు సమన్లు పంపారు. ఈనెల 22న అసెంబ్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. తన అనుమతి లేకుండా ఇటీవల కాలంలో రాష్ట్ర ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం, ఛార్జిషీట్లు దాఖలు చేయడంపై స్పీకర్ వివరణ కోరారు. ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఛార్జిషీట్లు సమర్పించే ముందు స్పీకర్ కార్యాలయం నుంచి ఎందుకు అనుమతి తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. పాంజీ స్కామ్, నారద స్టింగ్ ఆపరేషన్ కేసులో ప్రమేయం ఉన్న ఆరోపణలపై మంత్రులతో సహా పలువురు ఎమ్మెల్యేలపై ఇటీవల కాలంలో సీబీఐ, ఈడీ చార్జిషీట్లు దాఖలు చేయడం, సమన్లు పంపడం జరిగింది.

దీనిపై స్పీకర్ బందోపాధ్యాయ్ మాట్లాడుతూ, ఎమ్మేల్యేలపై చార్జిషీట్లు నమోదు చేసే ముందు స్పీకర్ కార్యాలయానికి తెలియజేయకపోవడంపై సీబీఐ, ఈడీ అధికారులను వివరణ కోరారని చెప్పారు. సిటీలోని ఈ రెండు దర్యాప్తు సంస్థల కార్యాలయాలకు లేఖలు పంపినట్టు తెలిపారు. దీనిపై ఈనెల 22న అసెంబ్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని కోరినట్టు ఆయన చెప్పారు. కాగా, ఎంపీలపై చార్జిషీటు దాఖలు చేసేటప్పుడు లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇస్తాయని, బెంగాల్‌ ఎమ్మెల్యేల విషయంలో మాత్రం స్పీకర్‌కు తెలియజేయాలనే నిబంధనలను దర్యాప్తు సంస్థలు పాటించలేదని టీఎంసీ నేతలు సుఖేందు శేఖర్ రాయ్, కునల్ ఘోష్ విమర్శించారు. ప్రోటోకాల్ ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్టు చేసే ముందు సంబంధిత సభలకు తెలయజేయాలని వారు అన్నారు.