సీబీఐ స్పీడ్‌

ABN , First Publish Date - 2020-06-01T09:09:12+05:30 IST

రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు డాక్టర్‌ సుధాకర్..

సీబీఐ స్పీడ్‌

డాక్టర్‌ సుధాకర్‌ కేసు విషయంలో దూకుడు పెంచిన కేంద్ర పరిశోధన విభాగం

రెండో రోజూ కేజీహెచ్‌లో విచారణ

ఎంఎల్‌సీ రికార్డు సీజ్‌

సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన

నేడు ఫుటేజీల హార్డ్‌ డిస్క్‌ను అందజేయాలని లేఖ

డాక్టర్‌ సుధాకర్‌కు చికిత్స చేసిన వైద్యులను విచారించిన అధికారులు

ఇద్దరు పీజీల తీరుపై అనుమానం

నేడు విచారణకు అందుబాటులో ఉండాలని ఆదేశం


విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు డాక్టర్‌ సుధాకర్‌ కేసులో నగర పోలీసులపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు, ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. ఎనిమిది వారాల్లో నివేదిక అందజేయాలని కోర్టు ఆదేశించడంతో ఆదివారం సెలవు దినమైనప్పటికీ దర్యాప్తుని కొనసాగించారు. శనివారం ప్రభుత్వ మానసిక ఆస్పత్రి, కేజీహెచ్‌లో విచారణ జరిపిన సీబీఐ అధికారులు, ఆదివారం కూడా కేజీహెచ్‌లోనే దర్యాప్తు నిర్వహించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ అర్జున్‌ అందుబాటులో లేకపోవడంతో ఫోన్‌లో సంప్రదించారు. తమ దర్యాప్తుకు సహకరించాలని కోరడంతో ఆస్పత్రిలోని తమ అధికారులను సహకారం కోసం అప్పగిస్తానని వారికి వివరించారు. దీంతో ఆస్పత్రి ఆర్‌ఎంఓ.... సీబీఐ అధికారుల వద్దకు వెళ్లి తనను పరిచయం చేసుకున్నారు. అనంతరం డాక్టర్‌ సుధాకర్‌కు కేజీహెచ్‌లో వైద్యం అందజేసిన ప్రక్రియకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీలను సూపరింటెండెంట్‌ ఛాంబర్‌లోని టీవీలో పరిశీలించారు.


ఫుటేజీల్లో ఇద్దరు వ్యక్తుల కదలికలు ప్రధానంగా ఉన్నట్టు గుర్తించడంతో వారి గురించి ఆస్పత్రి అధికారులను ఆరా తీశారు. వారిద్దరూ పీజీ విద్యార్థులని చెప్పడంతో వారిని విచారించాల్సి ఉన్నందున సోమవారం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. తర్వాత డాక్టర్‌ సుధాకర్‌కు వైద్యం అందజేసిన క్యాజువాలిటీ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వంశీకృష్ణ, ఫిజీషియన్‌(డీఏపీ) డాక్టర్‌ కనకమహాలక్ష్మిని విచారించారు. డాక్టర్‌ సుధాకర్‌ను ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడకు తీసుకువచ్చారు? ఎలాంటి రిమార్కులు గుర్తించారు? మానసిక వైద్యశాలకు రిఫర్‌ చేయడానికి ఏ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు? అంటూ పలు విషయాల గురించి ప్రశ్నించారు. 


సీసీ కెమెరాల ఫుటేజీలకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌ను సోమవారం తమకు అప్పగించాలని కోరుతూ ఒక నోటీసు అందజేశారు. క్యాజువాలిటీ మెడికో లీగల్‌ కేసులకు సంబంధించిన రికార్డును సీజ్‌ చేసి తమ వెంట తీసుకెళ్లారు. కాగా డాక్టర్‌ సుధాకర్‌ తల్లి కావేరిబాయి విచారించేందుకు సీబీఐ అధికారులు సీతమ్మధారలోని ఆమె ఇంటికి వెళుతున్నారని అంతకుముందు ప్రచారం జరగడంతో మీడియా చాలాసేపు అక్కడ పడిగాపులు కాసింది. అయితే సీబీఐ అధికారులు కేజీహెచ్‌కు వెళ్లారని తెలియడంతో అంతా అక్కడకు పరుగులు తీశారు.

Updated Date - 2020-06-01T09:09:12+05:30 IST