Abn logo
Sep 24 2021 @ 14:11PM

మహంత్ నరేంద్ర గిరి మృతిపై సీబీఐ ఎఫ్ఐఆర్

న్యూఢిల్లీ: అఖిల భారతీయ అఖారా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మృతిపై దర్యాప్తును సీబీఐ తన అధీనంలోకి తీసుకుంది. మహంత్ మృతి కేసు దర్యాప్తునకు కేంద్రం ఆమోదం తెలపడంతో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిఫారసు చేసిన అనంతరం డిపార్ట్‌మెంట్ ఆప్ పెర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో యూపీ పోలీసుల నుంచి కేసును సీబీఐ స్వాధీనం చేసుకుని ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. గత సోమవారంనాడు అలహాబాద్‌లోని బాఘంబరి మఠంలో మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్యకు పాల్పడటం సంచలనమైంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు 18 మంది సభ్యులతో 'సిట్' ఏర్పాటు చేసి, మహంత్ శిష్యుడైన ఒకరిని హరిద్వార్‌లో అదుపులోకి తీసుకున్నారు. మహంత్ ఆత్మహత్య చేసుకున్న స్థలంలో దొరికిన సూసైడ్ నోట్‌లో తాను మానసికంగా దెబ్బతిన్నానని, ఇందుకు తన శిష్యులలో ఒకరు బాధ్యలని మహంత్ ఆ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఈ కేసుపై సీబీఐ చేత దర్యాప్తు జరిపించాలని పలువురు డిమాండ్  చేశారు.