AP: జడ్జీలపై దూషణలు, అనుచిత వ్యాఖ్యల కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం..

ABN , First Publish Date - 2022-02-11T18:59:29+05:30 IST

జడ్జీలపై దూషణలు, అనుచిత వ్యాఖ్యల కేసులో సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది.

AP: జడ్జీలపై దూషణలు, అనుచిత వ్యాఖ్యల కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం..

అమరావతి: జడ్జీలపై దూషణలు, అనుచిత వ్యాఖ్యల కేసులో సీబీఐ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేశారు. కొన్ని పోస్టులకు సంబంధించిన మూలాలను ఆధారంగా వెతుకుతున్న క్రమంలో డిజిటల్‌ కార్పొరేషన్‌లో డొంక కదిలినట్లు తెలుస్తోంది. జడ్జీలపై పోస్టులను అక్కడే తయారు చేయించి, అక్కడి నుంచే సోషల్‌ మీడియాలోకి వదిలినట్లు సీబీఐ అనుమానిస్తోంది. దీనికి సంబంధించి డిజిటల్‌ మీడియాకు చెందిన ఏడుగురు ఉద్యోగులను ప్రశ్నించినట్లు  సమాచారం. 


న్యాయమూర్తులపై సామాజిక మాధ్యమాలలో అనుచిత వ్యాఖ్యల పోస్ట్‌ పెట్టిన అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్‌ వైసీపీ కౌన్సిలర్‌ మారుతీ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించడం సంచలనంగా మారింది.  ఆయన ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు ముఖ్య అనుచరుడు. ఢిల్లీ, బెంగళూరుకు చెందిన ఒక డీఎస్పీ, ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు మారుతీ రెడ్డి ఇంటికి చేరుకుని.. 12 గంటల పాటు విచారణ కొనసాగించారు. మొబైల్‌ఫోన్‌, అధార్‌కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఓటర్‌ ఐడీని సీజ్‌ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే సీబీఐ అధికారులు హిందూపురం రావడం గమనార్హం. ఇక... ఇదే కేసులో ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బుడ్డాయిపల్లికి చెందిన గంజికుంట మల్లికార్జున్‌ అనే వ్యక్తిని కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు.


సోషల్‌ మీడియాలో జడ్జీలపై పెట్టిన అనుచిత వ్యాఖ్యలు అప్‌లోడ్‌ అయిన ఐపీ అడ్రసులను సీబీఐ గుర్తించిందని, వాటిలో ప్రభుత్వానికి చెందిన ఈ-ప్రగతి, డిజిటల్‌ కార్పొరేషన్లకు చెందిన ఐపీ అడ్రసులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్‌ సర్కారు ‘డిజిటల్‌ కార్పొరేషన్‌’ అనే ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసింది. మంగళగిరిలో దీనికి పెద్ద కార్యాలయం ఉంది. డిజిటల్‌ కార్పొరేషన్‌ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. కానీ... అంతకుముందు వైసీపీ సోషల్‌ మీడియాలో పని చేసిన అనేకమందికి డిజిటల్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు ఇచ్చారు. జగన్‌ రాజకీయ సలహాదారు ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ‘ఐ-ప్యాక్‌’ బృందంలోని కొందరు కూడా ఇక్కడ పని చేస్తున్నారు. 


అంతకుముందు వీరి జీతాలను వైసీపీ చెల్లించేది. అధికారంలోకి రాగానే...ప్రభుత్వ ఖాతా నుంచి చెల్లిస్తోంది. ఇక్కడ ప్రభుత్వ కార్పొరేషన్‌లో, ప్రజల సొమ్మును జీతాలుగా తీసుకుంటూ... వైసీపీ కోసం పని చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. జడ్జిలపై సోషల్‌ మీడియా పోస్టుల మూలాలు ‘డిజిటల్‌ కార్పొరేషన్‌’లో ఉన్నట్లు సీబీఐ ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. అది పూర్తిస్థాయిలో నిర్ధారణైతే...సర్కారుకు ఇక్కట్లు ఖాయం.

Updated Date - 2022-02-11T18:59:29+05:30 IST