Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jun 2 2021 @ 02:59AM

సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు

ప్రధాని మోదీ నేతృత్వంలో కీలక సమావేశం

కరోనా పరిస్థితుల నేపథ్యంలో రద్దు నిర్ణయం

పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు చాన్స్‌

పరిస్థితులు మెరుగయ్యాకే పరీక్షలకు అవకాశం

విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యం: ప్రధాని

దేశవ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

సమావేశంలో చర్చకు రాని జేఈఈ, నీట్‌ పరీక్షలు


న్యూఢిల్లీ, జూన్‌ 1: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎ్‌సఈ) 12వ తరగతి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా సెకండ్‌వేవ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వివిధ భాగస్వాముల నుంచి సేకరించిన సమాచారం కూడా పరీక్షల రద్దుకు ఒక కారణమని వివరించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బోర్డు పరీక్షల నిర్వహణపై చర్చించడానికి ఉన్నత విద్య, పాఠశాల విద్య కార్యదర్శులు, విద్యాశాఖకు చెందిన ఇతర అధికారులతో ప్రధాని మోదీ మంగళవారం సమావేశమయ్యారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి పోఖ్రియాల్‌ కొవిడ్‌ నుంచి కోలుకున్నా.. అనారోగ్య సమస్యలతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో.. ప్రధాని ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.


హోం, రక్షణ, ఆర్థిక, వాణిజ్య, సమాచార ప్రసార, పెట్రోలియం, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రులు, ప్రధాని ముఖ్య కార్యదర్శి, కేబినెట్‌ సెక్రటరీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో సీబీఎ్‌సఈ అధికారులు మార్కుల విధివిధానాలపై నిర్దిష్ట ప్రకటన చేస్తారని పీఎంవో పేర్కొంది. మార్కుల విషయంలో అసంతృప్తిగా ఉండే విద్యార్థులకు పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తామని.. అయితే, కరోనా పరిస్థితులు మెరుగయ్యాకే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఢిల్లీ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలను రద్దు చేయాలని కోరగా, మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కనీసం ఆబ్జెక్టివ్‌ తరహాలో అయినా పరీక్షలను నిర్వహించాలని సూచించాయి. పరీక్షల రద్దుపై కేంద్రం నిర్ణయంతో దేశవ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. కాగా.. పరీక్షల రద్దు అంశాన్ని ప్రధాని మోదీ కూడా ట్విటర్‌లో వెల్లడించారు. ‘‘సీబీఎ్‌సఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.


విస్తృత సంప్రదింపుల తర్వాత, విద్యార్థులకు అనుకూలమైన నిర్ణయాన్ని మేం తీసుకున్నాం. తద్వా రా, ఆరోగ్యంతోపాటు వారి భవిష్యత్తును కూడా పరిరక్షించవచ్చు’’ అని పేర్కొన్నారు. ‘‘కొవిడ్‌ 19తో విద్యా సంవత్సరం తీవ్రంగా ప్రభావితమైంది. బోర్డు పరీక్షల అంశం విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకుల్లో తీవ్ర ఒత్తిడికి కారణమవుతోంది. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, వారి భద్రతే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యం. అందుకే పరీక్షలను రద్దు చేశాం’’ అని మరో ట్వీట్‌లో వివరించారు. సీబీఎ్‌సఈ పరీక్షలపై ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో తాము కూడా 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కౌన్సిల్‌ ఫర్‌ ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్‌(సీఐఎ్‌ససీఈ) ప్రకటించింది. ఈ మేరకు సీఐఎ్‌ససీఈ కార్యదర్శి గ్యారీ ఆర్థూన్‌ మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, ప్రధాని అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేఈఈ, నీట్‌ తదితర పరీక్షలపై చర్చించలేదని సమావేశంలో పాల్గొన్న అధికారి ఒకరు తెలిపారు. ప్రత్యామ్నాయ అసె్‌సమెంట్‌ విధానం ఏమిటనే దానిని సీబీఎ్‌సఈ ప్రకటించాల్సి ఉంది.


కానీ, ఇంటర్నల్‌ అసె్‌సమెంట్‌, ప్రాక్టికల్‌ మార్కుల ఆధారంగానే గ్రేడింగ్‌ ఉండవచ్చని, ఇది ఒక ఆప్షన్‌ అని సీనియర్‌ సీబీఎ్‌సఈ అధికారి ఒకరు తెలిపారు. గత మూడేళ్లలో సదరు స్కూళ్లలో మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. ఇక, విద్యార్థి 9, 10, 11 తరగతుల్లో వార్షిక పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ను నిర్ణయించడం మరో ఆప్షన్‌ అని తెలిపారు. కాగా, పరీక్షలు రద్దు చేయాలని నినదించిన కాంగ్రెస్‌ నేత ప్రియాంకా గాంధీ విద్యార్థులను అభినందించారు.

Advertisement
Advertisement