Abn logo
Jul 6 2021 @ 12:36PM

దొంగలు రైలులో.. హైదరాబాద్ పోలీసులు విమానంలో.. ఆ ఒక్క క్లూతోనే...!

  • ఓ నిందితుడి జుట్టు తెలుపు.. ఆ క్లూతోనే వేట 
  • అంతర్రాష్ట్ర సెల్‌ఫోన్‌ దొంగల అరెస్ట్‌  
  • చాకచక్యంగా దొంగలను పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్ సిటీ/కొత్తపేట : నిందితుల్లో ఒకరి తలవెంట్రుకలు తెల్లగా ఉంటాయనేదే పోలీసుల దగ్గరున్న ఆధారం. ఆ ఆధారంతోనే దొంగలు రైలులో పారిపోతున్నారని గుర్తించారు. కదిలిపోతున్న రైలులోకి పరిగెడుతూ ఎక్కారు. చైన్‌ లాగి ఆపి దొంగలను అరెస్ట్‌ చేశారు. ఇలా సినీఫక్కీలో ఎల్బీనగర్‌ లా అండ్‌ ఆర్డర్‌, సీసీఎస్‌ పోలీసులు సంయుక్తంగా సెల్‌ఫోన్‌ దొంగలను పట్టుకున్నారు. రూ 3 లక్షలు విలువ చేసే సెల్‌ఫోన్లను, ఎలకా్ట్రనిక్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌బీనగర్‌ సీపీ క్యాంపు కార్యాలయంలో అదనపు డీజీపీ, రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ విలేకరులకు కేసు వివరాలను వెల్లడించారు.

ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనుల్లో కూలీలుగా చేరి..

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం మాల్దా జిల్లా మదన్‌టోలా గ్రామానికి చెందిన మహ్మద్‌ ముస్లిం షేక్‌ అలియాస్‌ తస్లీమ్‌(23), కుట్టు మండల్‌, తాలా గ్రామానికి చెందిన మహ్మద్‌ జసిముద్దీన్‌ షేక్‌ అలియాస్‌ యూసుఫ్‌(19), అమ్లితోలా గ్రామానికి చెందిన రఫీక్‌ ఉల్‌ షేక్‌ (19) ఎల్‌బీనగర్‌ సాగర్‌ రింగ్‌ రోడ్డు ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనుల్లో కూలీలుగా చేరారు. ముగ్గురూ పశ్చిమ బెంగాల్‌ వారే కాబట్టి కలిసిమెలిసి ఉండే వారు. మద్యానికి బానిసలయ్యారు. తస్లీమ్‌ వ్యసనాలకు, రాబోయే పండుగకు అవసరమైన డబ్బు కోసం దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. మిగతా ఇద్దరూ అందుకు అంగీకరించారు.


షాపు గోడకు కన్నం వేసి.. 

గత నెల 30న అర్ధరాత్రి ముగ్గురూ ఎల్‌బీనగర్‌ ట్రూ వ్యాల్యూ హోల్‌సేల్‌ మొబైల్‌ షాప్‌ వద్దకు చేరుకుని గడ్డపార, సుత్తెలతో షాపు గోడకు కన్నం వేశారు. లోపలికి వెళ్లి 26 మొబైల్‌ ఫోన్లు, 8 చార్జర్లు, 17 కనెక్టర్లు, 23 హెడ్‌ ఫోన్లు, 6 సెల్‌ ఫోన్‌ బ్యాటరీలు, కీ ప్యాడ్లు, 3 బ్లూ టూత్‌లు, ఫోన్ల కవర్లు, ఎలకా్ట్రనిక్‌ పరికరాలు చోరీ చేశారు. సేల్స్‌మన్‌ అఫ్జల్‌ యజమాని మహ్మద్‌ సులేమాన్‌కు మరుసటి రోజు ఉదయం సమాచారం ఇచ్చాడు. సులేమాన్‌ ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. ఫ్లైఓవర్‌ పనివాళ్ల సహాయం కూడా తీసుకున్నారు. గాలింపు వేగంగా జరపాలని నిర్ణయించుకుని సీపీ మహేష్‌ భగవత్‌ ఆదేశాలతో సీసీఎస్‌ పోలీసులు, ఐటీ సెల్‌ నిపుణులు రంగంలోకి దిగారు.

కదులుతున్న రైలులోకి.. 

నిందితులు రైలులో బెంగాల్‌కు వెళ్తున్నారని పోలీసులు గుర్తించారు. సాంకేతికత ఉపయోగిస్తూ ఒక పోలీసు బృందం విమానంలో పశ్చిమ బెంగాల్‌కు చేరుకుంది. నిందితులు మాల్దాకు వెళ్తున్నట్లు తెలుసుకుని, వారి కంటే వేగంగా/ముందుగా పోలీసులు కోల్‌కత్తాకు చేరుకుని, అక్కడి నుంచి వాహనాల్లో ఖరగ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకోగలిగారు. ఒక నిందితుడి తలవెంట్రుకలు తెల్లగా ఉంటాయని సమాచా రం ఉండడంతో మాల్దా వెళ్తున్న రైలులో నిందితులను గుర్తించారు. కదులుతున్న రైలులోకి సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు బృందం ప్రవేశించింది. పోలీసులు చైన్‌ లాగి ట్రెయిన్‌ను ఆపి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ట్రాన్సిట్‌ వారంట్‌తో సోమవారం ఎల్‌బీనగర్‌కు తీసుకొచ్చారు. ఈ కేసు ఛేదనలో సహకరించిన పశ్చిమబెంగాల్‌ ఏడీజీ అజయ్‌ రనాడే, ఎస్‌పీ, జీఆర్‌పీ ఖరగ్‌పూర్‌ పుష్ప రైల్వే పోలీసులకు సీపీ మహేష్‌ భగవత్‌ కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో ఎల్‌బీనగర్‌ క్రైమ్స్‌ డీసీపీ యాదగిరి, ఏసీపీలు శ్రీధర్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి, ఎల్‌బీనగర్‌ ఎస్‌హెచ్‌ఓ అశోక్‌రెడ్డి, డీఐ ఉపేందర్‌రావు పాల్గొన్నారు.