ఆన్‌లైన్‌లో ‘పట్టణ ప్రగతి’

ABN , First Publish Date - 2020-02-28T10:53:18+05:30 IST

పట్టణ ప్రగతి పనులు జిల్లా కేంద్రంలో జోరుగా సాగుతున్నాయి. నాలుగు రోజులుగా కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు వార్డుల్లోని సమస్యలపై పోరుబాట పట్టారు.

ఆన్‌లైన్‌లో ‘పట్టణ ప్రగతి’

రోజువారీగా సీడీఎంఏ సైట్‌లో వివరాల నమోదు


మెదక్‌ మున్సిపాలిటి, ఫిబ్రవరి 27: పట్టణ ప్రగతి పనులు జిల్లా కేంద్రంలో జోరుగా సాగుతున్నాయి. నాలుగు రోజులుగా కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు వార్డుల్లోని సమస్యలపై పోరుబాట పట్టారు. ఇన్‌చార్జి అధికారులతో కలిసి సమస్యలను తెలుసుకుంటున్నారు. పారిశుధ్యం లోపించిన ప్రాంతాలను గుర్తించి అధికారులకు తెలియజేస్తున్నారు.  రోడ్డుపై ఉన్న మట్టికుప్పలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ శ్రీహరి దృష్టికి తీసుకెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వార్డుల్లో పర్యటించి మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌తో సమావేశమై సమస్యలను చర్చిస్తున్నారు. 


సీడీఎంఏ సైట్‌లో వివరాల నమోదు

పట్టణ ప్రగతి వివరాలను ఇన్‌చార్జి అధికారులు కౌన్సిలర్లు సమస్యలను రోజువారీగా నమోదు చేసుకుంటున్నారు. ప్రతి వార్డులో ఎన్ని మురుగు కాల్వలున్నాయి? ఇంకా ఎన్ని కాల్వలు నిర్మించాలి? వివరాలను నమోదు చేస్తున్నారు. సీసీ రోడ్లు ఎన్ని పూర్తయ్యాయి? నిర్మాణం చేపట్టాల్సినవి ఎన్ని? అనే అంశాలను నమోదు చేస్తున్నారు. ఖాళీ స్థలాలు ఎన్ని? వాటిలో పెరిగిన పిచ్చిమొక్కల విస్తీర్ణం, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ స్తంభాల సంఖ్య? వదులుగా ఉన్న విద్యుత్‌ తీగల పూర్తి వివరాలను నివేదిక రూపంలో సిద్ధం చేసుకుంటున్నారు.


ఇవే కాకుండా ఇంటింటి నుంచి తడి, పొడి చెత్త వేరువేరు చేస్తున్నారా? పరిసరాల పరిశుభ్రత కాలనీల వారీగా వివరాలను తెలుసుకుంటున్నారు. నమోదు చేసుకున్న వివరాలను ఇంజనీరింగ్‌, శానిటేషన్‌, విద్యుత్‌ శాఖ అధికారులకు అందజేస్తున్నారు. తదనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీడీఎంఏ వెబ్‌సైట్‌లో వార్డుల వారీగా రూపొందించిన జాబితాను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు.  పట్టణ ప్రగతిలో భాగంగా మున్సిపల్‌ పరిధిలో నాలుగు డోజర్లు, నాలుగు ఎక్స్‌కవేటర్లు, నాలుగు ట్రాక్టర్లను వినియోగిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-02-28T10:53:18+05:30 IST