ప్రభుత్వ ఎజెండాలో జీఎస్‌టీ రేట్ల హేతుబద్ధీకరణ : సీఈఏ సుబ్రహ్మణ్యం

ABN , First Publish Date - 2021-07-30T00:48:53+05:30 IST

వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) రేట్ల హేతుబద్ధీకరణ జరగబోతోందని

ప్రభుత్వ ఎజెండాలో జీఎస్‌టీ రేట్ల హేతుబద్ధీకరణ : సీఈఏ సుబ్రహ్మణ్యం

న్యూఢిల్లీ : వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) రేట్ల హేతుబద్ధీకరణ జరగబోతోందని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రహ్మణ్యం గురువారం చెప్పారు. ప్రభుత్వ ఎజెండాలో ఈ అంశం ఉందన్నారు. మూడు రేట్ల వ్యవస్థ చాలా ముఖ్యమైనదని చెప్పారు. అసోచామ్ నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.


దాదాపు డజనుకుపైగా కేంద్ర, రాష్ట్ర పన్నులను కలిపేసి జీఎస్‌టీగా విధించే విధానాన్ని 2017 జూలై నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రస్తుతం ఐదు రేట్ల విధానం (0.25 శాతం,  5 శాతం, 12 శాతం, 18 శాతం, 25 శాతం) అమలవుతోంది. 


ఈ రేట్ల విధానంలో హేతుబద్ధత రావలసిన అవసరం ఉందా? అని ప్రశ్నించినపుడు సుబ్రహ్మణ్యం స్పందిస్తూ, ‘‘అది కచ్చితంగా జరగబోతోందని నేను అనుకుంటున్నాను. మూడు రేట్ల విధానం ఉండాలనేది ఒరిజినల్ ప్లాన్. అయితే మనం తెలుసుకోవలసినది ఏమిటంటే, విధాన నిర్ణయం వల్ల లోపాలు లేని సమగ్ర విధానం శ్రేష్ఠతకు శత్రువుగా  మారాలని కోరుకోరు’’ అని చెప్పారు. అందరూ సాధారణంగా వినియోగించే అత్యధిక వస్తువులను, సేవలను జీఎస్‌టీ నుంచి మినహాయించారన్నారు. కేవలం విలాసవంతమైన, డీమెరిట్, సిన్ గూడ్స్‌పై మాత్రమే 28 శాతం పన్ను విధిస్తున్నట్లు తెలిపారు. 


ఐదు రేట్లతో ఏర్పడిన జీఎస్‌టీ మౌలికంగా మంచిదేనని చెప్పారు. జీఎస్‌టీ వసూళ్ళపై ఈ ప్రభావాన్ని మనం చూస్తున్నామన్నారు. అప్పటి విధాన రూపకర్తలకు ఆ ఘనతను ఇవ్వాలన్నారు. వారు ఆచరణాత్మకంగా ఆలోచించారని చెప్పారు. మూడు రేట్ల విధానం కచ్చితంగా ముఖ్యమైనదేనని తెలిపారు. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కూడా అంతే ముఖ్యమైనదని తెలిపారు. ప్రభుత్వం ఈ విషయాన్ని కచ్చితంగా గుర్తించిందనే తాను భావిస్తున్నానని చెప్పారు. దీనిపై త్వరలోనే సరైన నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలంటే మన దేశంలో మరింత పెద్ద బ్యాంకులు అవసరమని తెలిపారు. 


Updated Date - 2021-07-30T00:48:53+05:30 IST