యూఏఈ మధ్యవర్తిత్వంతోనే భారత్-పాక్ కాల్పుల విరమణ?

ABN , First Publish Date - 2021-04-16T18:37:21+05:30 IST

భారత్-పాక్ సరిహద్దుల్లో ఫిబ్రవరి నుంచి కాల్పుల మోతలు

యూఏఈ మధ్యవర్తిత్వంతోనే భారత్-పాక్ కాల్పుల విరమణ?

న్యూఢిల్లీ : భారత్-పాక్ సరిహద్దుల్లో ఫిబ్రవరి నుంచి కాల్పుల మోతలు వినిపించడం లేదు. ఇరు దేశాలు తెర వెనుక  చర్చిస్తున్నాయేమోనని చాలా మంది భావించారు. తాజాగా అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం యూఏఈ మధ్యవర్తిత్వంతోనే ఈ పరిణామాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమెరికాలోని యూఏఈ రాయబారి యూసఫ్ అల్ ఒటెయిబా ఈ విషయాన్ని వెల్లడించినట్లు ఈ కథనాలు చెప్తున్నాయి. 


అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, కశ్మీరు అంశంపై భారత్, పాక్ మధ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్యవర్తిత్వం వహించినట్లు యూసఫ్ అల్ ఒటెయిబా చెప్పారు. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ జరగడానికి దోహదపడింది. దీంతో పిబ్రవరి నుంచి నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరగడం లేదు. 


కశ్మీరుపై భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో, కాల్పుల విరమణకు కట్టబడి ఉండేలా చేయడంలో యూఏఈ పాత్ర ఉందని వివరిస్తూ వెలువడిన మీడియా కథనాలను యూసఫ్ స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన హూవర్ ఇన్‌స్టిట్యూషన్ బుధవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో అంగీకరించినట్లు కనిపించింది. అయితే భారత ప్రభుత్వం దీనిపై స్పందించలేదు. భారత్, పాక్ మధ్య సమస్యల పరిష్కారంలో మూడో పక్షం పాత్ర ఏదీ లేదని భారత ప్రభుత్వం తెలిపింది. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి యూఏఈతో సత్సంబంధాలు మరింత బలపడ్డాయి. యూఏఈ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఈ విషయంలో చాలా కృషి చేస్తున్నారు. యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయేద్’ను మోదీకి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఒటెయిబా మాట్లాడుతూ, మోదీ,  షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ ఉత్తమ స్నేహితులు కాకపోయినా, ‘‘వారిద్దరూ (భారత్, పాక్) కలిసి మాట్లాడుకోగలిగిన స్థాయికి తీసుకురావాలని కోరుకుంటున్నాం’’ అన్నారు. 


అంతకుముందు వెలువడిన వార్తా కథనాల ప్రకారం, భారత్, పాక్ దేశాలకు చెందిన అత్యున్నత స్థాయి ఇంటెలిజెన్స్ అధికారులు జనవరిలో దుబాయ్‌లో రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. కశ్మీరుపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో ఈ చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2021-04-16T18:37:21+05:30 IST