ఘనంగా సంక్రాంతి సంబరాలు

ABN , First Publish Date - 2022-01-17T05:22:10+05:30 IST

ఘనంగా సంక్రాంతి సంబరాలు

ఘనంగా సంక్రాంతి సంబరాలు
మేడ్చల్‌లోని ఓ కాలనీలో ముగ్గులు వేస్తున్న మహిళలు

వికారాబాద్‌/ధారూరు/బషీరాబాద్‌/కులకచర్ల/దోమ/పరిగి/తాండూరు/కొడంగల్‌/బొంరా్‌సపేట్‌/దౌల్తాబాద్‌/కొడంగల్‌ రూరల్‌: సంక్రాంతి సంబురాలను శుక్ర, శని, ఆదివారాలు మూడు రోజుల పాటు ప్రజలు ఘనంగా జరపుకున్నారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలను ఆనందోత్సాహాలతో నిర్వహించుకున్నారు. పిండి, తీపి వంటకాలు, మాంసాహార పదార్థాలు ఆరగించారు. పిల్లలు, యువత పతంగులు ఎగురవేసి ఉత్సాహంగా గడిపారు. మహిళలు, యువతులు ఇళ్ల ముందర రంగురంగుల ముగ్గులువేసి సంబరాలు చేసుకున్నారు. పల్లెలు, పట్టణాలు పండుగ శోభ సంతరించుకుంది. వికారాబాద్‌ నియోజకవర్గంలో గాలిపటాలతో యువత సందడి చేశారు. ఇళ్లలో పిండి వంటలు చేసుకొని బంధువులు, ఇరుగుపొరుగుతో వేడుక జరుపుకున్నారు. వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ సంక్రాంతి, కనుమ రోజు కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు. శివరాంనగర్‌లో మాలె లక్ష్మణ్‌ గాలి పటాలు ఎగురవేశారు. ధారూరు మండలంలో మహిళలు ఇళ్ల ముందు సాన్పిచల్లి ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టి చెరుకు, జొన్న, కుసుమ, శనగ, అవిసె మొక్క తదితర నవధాన్యాలతో అలంకరించారు. బషీరాబాద్‌ మండలంలో యువతులు ఇళ్ల ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలను ఉంచారు. కులకచర్ల, చౌడాపూర్‌ మండలాల్లో సంక్రాంతిని ఘనంగా జరుపుకున్నారు. మందిపాల్‌, పుట్టపహాడ్‌ గ్రామాల్లో వాలీబాల్‌ క్రీడలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఆదివారం మటన్‌, చికెన్‌ షాపులు కిక్కిరిశాయి. దోమతో పాటు గ్రామాల్లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. పరిగి నియోజకవర్గంలో పండుగ సందర్భంగా మహిళలు ఉదయాన్నే లేచి వాకిళ్లలో ముగ్గులు వేశారు. రేగిపండ్లు, జీడిపండ్ల మధ్యలో గొబ్బెమ్మలను పెట్టి పాలు పొంగించారు. చిన్నారులపై భోగిపండ్లు పోశారు. తాండూరు డివిజన్‌లో మకర సంక్రాంతిని ఉత్సాహంగా జరుపుకున్నారు. తాండూరులోని అయ్యప్ప ఆలయంలో మకర పూజలు నిర్వహించారు. కొడంగల్‌, బొంరా్‌సపేట్‌, దౌల్తాబాద్‌ మండలాల్లో సంక్రాంతి పర్వదినాన్ని చిన్నాపెద్ద జరుపుకున్నారు. ఆదివారం కనుమను పురస్కరించుకొని మటన్‌, చికెన్‌ దుకాణాలు కిటకిటలాడాయి. కొడంగల్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దాము చిన్నారులు, యువకులకు గాలిపటాలను అందజేశారు.

  • మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో...

మేడ్చల్‌/కీసర/ఘట్‌కేసర్‌: తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగను మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో మూడు రోజుల పాటు ఉత్సాహంగా నిర్వహించుకున్నారు. పిల్లలు, యువకులు ఖాళీ స్థలాల్లో, డాబాలపై గాలిపటాలను ఎగురవేశారు. పర్వదినం సందర్భంగా రోడ్లన్నీ బోసిపోయాయి. మేడ్చల్‌ మార్కెట్‌లో గాలిపటాలు, మాంజాల కోసం సందడి నెలకొంది. మేడ్చల్‌ ప్రాంతం నుంచి వివిధ పార్టీల నాయకులు పెద్దఎత్తున ఆంధ్రాకు తరలివెళ్లారు. అక్కడి తమ స్నేహితుల ఇళ్లల్లో సంక్రాంతి సంబరాల్లో పాలుపంచుకున్నారు. కీసర మండలంలో మహిళలు పోటీపడి ముగ్గులు వేశారు. చిన్నారులకు భోగిపళ్లు పోశారు. డీజే పాటలు పెట్టుకొని గాలిపటాలు ఎగురవేశారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీలో ఎవరి ఇళ్ల ముందు వారే ముగ్గులు వేసే పోటీలు నిర్వహించారు. చైర్‌పర్సన్‌ ముల్లి పావని బృందం ఇళ్ల వద్దకు వెళ్లి పరిశీలించి ఉత్తమ ముగ్గులకు బహుమతులు అందజేశారు. అన్నోజిగూడలో గాలిపటాల పోటీలు నిర్వహి ంచారు. మున్సిపల్‌ చైర్మన్‌ బి.కొండల్‌రెడ్డి మాట్లాడుతూ చిన్నాపెద్ద గాలిపటాల ఉత్సవంలో పాల్గొనడం అభినందనీయం అన్నారు. గంగిరెద్దుల విన్యాసాలను ప్రదర్శించారు. వైస్‌చైర్మన్‌ రెడ్డియానాయక్‌, కౌన్సిలర్‌ రాజశేఖర్‌, జగన్మోహన్‌రెడ్డి, కేఎంరెడ్డి, శేఖర్‌, రాజేశ్వర్‌రెడ్డి, ఎ.బాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-17T05:22:10+05:30 IST