Jul 24 2021 @ 18:42PM

మీరాబాయి చాను విజయం దేశానికి గర్వకారణం: సెలబ్రిటీలు

టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను శనివారం వీరోచిత ప్రదర్శనతో రజతపతకం సాధించింది. 49 కిలోల వెయిట్ లిప్టింగ్ ఈవెంటులో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా మీరాబాయి చరిత్ర సృష్టించింది. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుని భారతదేశం మొత్తం అభినందిస్తోంది. ఆమె విజయాన్ని పురస్కరించుకుని, మీరాబాయి చాను విజయం దేశానికి గర్వకారణం అంటూ సెలబ్రిటీలు ట్వీట్స్ చేశారు.


‘‘టోక్యో ఒలింపిక్స్‌లో మన దేశానికి తొలి పతకం అందించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుగారికి నా తరపున, జనసేన పక్షాన హృదయపూర్వక అభినందనలు. ఒలింపిక్స్‌లో 20 ఏళ్ల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో కరణం మల్లీశ్వరిగారి తర్వాత మీరాబాయి చానుగారు పతకం సాధించి దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులందరికీ సంతోషాన్ని కలిగించారు. ఈ విజయం మన క్రీడాకారుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది’’ అని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీ తరపున అధికారికంగా ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు.


‘‘టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను రజిత పతకం సాధించిన సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పతకాల ఫైట్ ఇప్పుడే మొదలైంది..’’ అని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు.


‘‘టోక్యో ఒలింపిక్స్‌లో రజిత పతకం సాధించిన మీరాబాయి చానుకు కంగ్రాట్స్. మన దేశం గర్వపడేలా చేశావు..’’ అని విక్టరీ వెంకటేశ్ ట్వీట్ చేశారు. 


‘‘టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియాకు తొలి పతకం. రజిత పతకం సాధించిన మీరాబాయి చానుకు శుభాకాంక్షలు. నీవు మేమంతా గర్వపడేలా చేశావు..’’ అని తమన్నా ట్వీట్ చేసింది.


‘‘సిల్వర్ మెడల్‌తో సూపర్బ్ ఓపెనింగ్.. కంగ్రాట్స్ మీరాబాయి చాను..’’ అని మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

‘‘మొదలైన తొలిరోజే భారత్‌కు పతకం రావడం ఇదే తొలిసారి. అద్భుతమైన ఓపెనింగ్ మీరాబాయి చాను..’’ అని ప్రణీత సుభాష్ ట్వీట్ చేశారు. 


వీరితో పాటు తాప్సీ, ఖుష్బూ, గోపీచంద్ మలినేని వంటి ప్రముఖులందరూ ఆమె విజయాన్ని ట్విట్టర్ వేదికగా కొనియాడారు.