కోట్లు కోల్పోయిన ప్రముఖులు!

ABN , First Publish Date - 2021-11-30T08:36:17+05:30 IST

శిల్పా చౌదరి బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. కిట్టీపార్టీలతో కోట్లు కొల్లగొట్టిన ఆమె బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

కోట్లు కోల్పోయిన ప్రముఖులు!

  • పెరుగుతున్న శిల్పాచౌదరి బాధితులు
  • పోలీస్‌ ఉన్నతాఽధికారి కోడలు 6కోట్లు
  • న్యాయమూర్తి చెల్లెలు రూ.5 కోట్లు
  • రూ.12 కోట్లు మోసపోయిన టాలీవుడ్‌ హీరో కుటుంబ సభ్యులు!
  • పోలీసులను ఆశ్రయించిన బాధితులు
  • పోలీస్‌ కస్టడీ పిటిషన్‌పై రేపు తీర్పు


హైదరాబాద్‌ సిటీ, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): శిల్పా చౌదరి బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. కిట్టీపార్టీలతో కోట్లు కొల్లగొట్టిన ఆమె బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 2.. 5.. 6.. 12.. ఇవి ర్యాంకులు కాదు.. పలువురు బాధితులు పోగొట్టుకొన్న రూ.కోట్లు! శిల్పా చౌదరి మోసాల గురించి పత్రికలు, టీవీల ద్వారా తెలుసుకున్న బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అనేక మంది ప్రముఖుల భార్యలు, కోడళ్లు, చెల్లెళ్లు శిల్పా చౌదరి బాధితులేనని తెలుస్తోంది. వారంతా సైబరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నారు. బాధితులంతా వారు నివాసముంటున్న పరిధిలోని పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉన్నట్లయితే స్థానిక స్టేషన్లలో లేదా మాదాపూర్‌ డీసీపీని కలిసి వివరాలు వెల్లడించొచ్చని ఉన్నతాధికారులు చెప్పినట్లు సమాచారం.

 

12 కోట్లు మోసపోయిన హీరో కుటుంబం

శిల్పాచౌదరి బాధితుల్లో చాలా మంది ప్రముఖులు ఉన్నట్లు తెలిసింది. టాలీవుడ్‌ ప్రముఖ హీరో కుటుం బం రూ.12 కోట్లు మోసపోయినట్లు సమాచారం. మోసపోయిన ఇద్దరూ టాలీవుడ్‌ హీరోకు అత్యంత ఆప్తులుగా తెలిసింది. సినిమా ఇండస్ట్రీ, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడి కోసం ఒక్కొక్కరి వద్ద రూ.6 కోట్ల చొప్పున మొత్తం 12 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. మరో సీనియర్‌ నటుడు రూ.2.4 కోట్లు మోసపోయినట్లు తెలిసింది. బాధితులు బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట తదితర పోలీస్‌ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆ వివరాలేవీ సంబంధిత పోలీసులు వెల్లడించకపోవడం గమనార్హం. మరోవైపు పోలీస్‌ ఉన్నతాధికారి కోడలు రూ.6 కోట్లు, కీలక స్థానంలో ఉన్న న్యాయమూర్తి కుటుంబ సభ్యులు రూ.5 కోట్లు వ్యాపారంలో పెట్టుబడి కోసం శిల్పాచౌదరికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పంజాగుట్ట నవీన్‌నగర్‌కు చెందిన సుమంత్‌.. శిల్పా చౌదరికి ఈ ఏడాది సెప్టెంబరులో రూ.15 లక్షలు ఇచ్చినట్లు తెలిసింది. నెలలో తిరిగి ఇచ్చేస్తానని నమ్మించడంతో డబ్బులు ఇచ్చారు. ఆమె మోసాల గురించి పేపర్లో చదివిన సుమంత్‌ పోలీసులను ఆరశయించారు.


శిల్పా చౌదరి దంపతులను పోలీస్‌ కస్టడీకి తీసుకొని విచారిస్తే అనేక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. వారం రోజుల పాటు కస్టడీకి అనుమతించాలని పోలీసులు ఉప్పర్‌పల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. శిల్పాచౌదరి తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించినట్లు తెలిసింది. శిల్పాచౌదరి ఎలాంటి మోసాలూ చేయలేదని, పోలీసులు కావాలనే ఇదంతా చేస్తున్నారని వాదించినట్లు సమాచారం. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం శిల్పా చౌదరి చంచల్‌గూడ జైల్లో, ఆమె భర్త చర్లపల్లి జైల్లో ఉన్నారు.


విల్లాలో పేకాట దందా.. 

సంపన్న వర్గాలకు చెందిన మహిళలను ఆకట్టుకున్న శిల్పా చౌదరి వారిని సిగ్నేచర్‌ విల్లాకు పిలిపించి కిట్టీపార్టీలతో పాటు పేకాట దందా నిర్వహించినట్లుగా తెలిసింది. ఆ సమయంలో రూ.లక్షల ఖరీదైన మద్యాన్ని సరఫరా చేసేదని సమాచారం. పోలీసులు ఆ దిశగా కూడా విచారణ చేస్తున్నారు. ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. శిల్పా చౌదరి భర్త కృష్ణశ్రీనివాస ప్రసాద్‌ అలెక్సా అనే ఒక ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో రీజినల్‌ డైరెక్టర్‌గా పనిచేసేవాడని పోలీసులు గుర్తించారు. అయితే భార్య చేస్తున్న మోసాల్లో పాలుపంచుకున్న శ్రీనివాస ప్రసాద్‌ ఆ డబ్బుతో ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించి భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. వాటికి సంబంధించి కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

Updated Date - 2021-11-30T08:36:17+05:30 IST