భయం వీడి... శరీరాన్ని సిద్ధం చేయండి!

ABN , First Publish Date - 2020-06-28T05:30:00+05:30 IST

కరోనా సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా... ఎవరికైనా, ఎప్పుడైనా సోకవచ్చు! ‘అయితే అవగాహన, అప్రమత్తత కలిగి ఉండడంతో పాటు.... వ్యాధి సోకగానే భయాందోళనలకు లోనవకుండా...

భయం వీడి... శరీరాన్ని సిద్ధం చేయండి!

కరోనా సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా... ఎవరికైనా, ఎప్పుడైనా సోకవచ్చు! ‘అయితే అవగాహన, అప్రమత్తత కలిగి ఉండడంతో పాటు.... వ్యాధి సోకగానే  భయాందోళనలకు లోనవకుండా, ఆత్మబలం సమకూర్చుకోవడం అన్నిటికన్నా ముఖ్యం’ అంటున్నారు హైదరాబాద్‌కు చెందిన సెలబ్రిటీ, ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ శిల్పారెడ్డి! ఆమె కూడా కరోనా బాధితురాలే. తన కరోనా అనుభవాన్ని ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్న శిల్పా ‘నవ్య’తో మరిన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చారు. ఆ విశేషాలు...


‘‘కరోనా వైరస్‌ పట్ల అర్థం లేని భయాలు, అపోహలున్నాయి. ‘కరోనా సోకితే ఇక అంతే...’ అని నమ్మేవాళ్లూ ఉన్నారు. నాకు కరోనా సోకిందని తెలిసిన వెంటనే నా దగ్గర పని చేసేవాళ్లు, ఫోన్‌ చేసి ఏడ్వడం మొదలుపెట్టారు. నేను ఆ వ్యాధితో చనిపోతానని వారి భయం కాబోలు. అంతగా చదువు లేని వాళ్లే కాదు, కొందరు ఉన్నత చదువులు చదువుకున్న వాళ్లూ ఇదే అపోహతో ఉన్నారు. నాకు కరోనా సోకిన తర్వాత, మా ఇంట్లో పని చేసే అమ్మాయిని సెలవు తీసుకోమని చెబితే, మా పొరుగింటి వాళ్లు కూడా వాళ్ల పని అమ్మాయిని మాన్పించేశారు. ఇందుకు కారణం వాళ్లిద్దరూ స్నేహితులు కావడమే! ఆ ఇంట్లో వాళ్లకి వీళ్ల ద్వారా కరోనా సోకుతుందనే భయం. అయితే ఈ భయాలు, కరోనా సోకిన వారిని వెలివేసినట్టు చూసే సామాజిక ధోరణి సరికాదు. ఈ తీరులో మార్పు రావాలి.




కరోనాకు అందరూ సమానమే!

కరోనా సోకిందని తెలిసినప్పుడు నేను భయపడలేదు. వైరస్‌ ఎప్పుడైనా, ఎవరికైనా సోకవచ్చు. ఎంతటి ఆరోగ్యవంతులకైనా సోకుతుంది అని చెప్పడానికి నేనే ఉదాహరణ. నా మటుకు నేను క్రమం తప్పక వ్యాయామం చేస్తాను. సమతులమైన ఆహారం తీసుకుంటాను. యోగా, ధ్యాన సాధనతో మనసుకూ వ్యాయామం అందిస్తాను. అయినా కరోనా సోకిందంటే అర్థం చేసుకోండి. ప్రస్తుతం మనం లాక్‌డౌన్‌లో లేము కాబట్టి ఒకరి నుంచి మరొకరికి ప్రత్యక్షంగా కాకపోయినా, వేర్వేరు వ్యక్తుల నుంచి వేర్వేరు వ్యక్తులకు పరోక్షంగా కరోనా సోకే పరిస్థితి ఇప్పటిది. నాకూ అలాగే సోకింది. 


లక్షణాలు లేకపోయినా...

కొద్ది రోజుల క్రితం మా ఇంటికి కుటుంబ స్నేహితులు వచ్చారు. తిరిగి వెళ్లే సమయంలో వాళ్లకు కొద్దిగా తలనొప్పి, తేలికపాటి జ్వరం లాంటి లక్షణాలు మొదలయ్యాయి. రెండు రోజుల తర్వాత ఫోన్‌ చేసి వారి యోగక్షేమాలు వాకబు చేసినప్పుడు, లక్షణాలు తీవ్రమయ్యాయనీ, వైద్యపరీక్షల కోసం వెళ్తున్నామనీ చెప్పారు. ఆ పరీక్షల్లో వాళ్లలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో, వెంటనే మాకు ఫోన్‌ చేసి మమ్మల్ని కూడా పరీక్షలు చేయించుకోమని చెప్పారు. ఆ పరీక్షల్లో నాకూ, మా వారికీ కూడా కరోనా సోకిందని తేలింది. కరోనా సోకిన వ్యక్తుల ఆరోగ్యం క్షీణించే వేగం, వారి వారి శరీర ఫిట్‌నెస్‌, ఊపిరితిత్తుల సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుందని నా అభిప్రాయం. నా విషయంలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోగా, ఆరోగ్యం ఏమాత్రం క్షీణించలేదు. ఇందుకు కారణం నేను ఊపిరితిత్తులు బలపడే కార్డియో వ్యాస్క్యులర్‌ వ్యాయామాలు, ప్రాణాయామం చేయడమే! ఇలాంటి వ్యాయామాలు చేసిన ఫలం, కరోనా సోకడం లాంటి క్లిష్టమైన సందర్భాల్లో అక్కరకొస్తుంది. ఒకవేళ వ్యాధి సోకినా, దాంతో సమర్థంగా పోరాడి, గెలిచే ఆయుధంలా శరీరాన్ని మలుచుకోవాలి. 

ప్రకృతి పట్ల ప్రేమ, మానసిక ఆరోగ్యం పట్ల చైతన్యం, వృత్తిగత జీవితం పట్ల సంతృప్తి నా ప్రధాన నైజాలు. వ్యాయామాలతో శరీరం చైతన్యంగా ఉంటే, మానసిక ఆరోగ్యమూ మెరుగ్గా ఉంటుంది. అయితే ఆలోచనల్లో స్పష్టత, నెమ్మది, ప్రశాంతత, స్వాంతన చేకూరితే పరిపూర్ణ ఆరోగ్యవంతులం కావచ్చు. ఇందుకోసం నాకు జగ్గీ వాసుదేవ్‌ ఈషా సెంటర్‌ తోడ్పడిందని చెప్పాలి. నేను సాధన చేసే యోగా, క్రియలన్నీ ఈషా సెంటర్‌ నుంచి నేర్చుకున్నవే! అక్కడ నేర్చుకున్న శాంభవి మహా ముద్రను ఎనిమిదేళ్ల నుంచి సాధన చేస్తున్నాను. ఈ క్రియల ప్రభావం శరీరం, మనసు మీద సమానంగా ఉంటుంది.


ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోతో...

కరోనా పట్ల అందరిలో భయం ఏర్పడింది. ఆ భయంతో మానవ సంబంధాలు మర్చిపోతున్నారు. కరోనా సోకిన ఓ వ్యక్తిని అతను నివసించే అపార్ట్‌మెంట్‌లోని అందరూ కలిసి, కొట్టి పంపించి వేసిన సంఘటన గురించి నాకు తెలుసు. ఇలాంటి ధోరణి మారాలి. వ్యాధి గురించి అవగాహన పెంచుకోవాలి. అందుకే ఆరోగ్యవంతులకూ కరోనా సోకే వీలు ఉంటుందనీ, సోకినా భయపడవలసిన అవసరం లేదనీ, ఆరోగ్యకరమైన జీవనశైలితో కరోనా మీద విజయం సాధించవచ్చనీ చెప్పడం కోసమే ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్‌ చేశాను. ఎంతోమంది సినీ ప్రముఖులు నన్ను అభినందిస్తూ, వ్యక్తిగత సందేశాలు పంపించారు. వృత్తిపరంగా నేను సెలబ్రిటీలకు, సినీ ప్రముఖులకు దుస్తులను డిజైన్‌ చేస్తూ ఉంటాను. కరోనా సోకిన అనుభవంతో, ఆ వ్యాధి పట్ల అవగాహన ఏర్పరిచి, ప్రజలను చైతన్యవంతులను చేయాలనేదే నా ఇన్‌స్టా వీడియో ఉద్దేశం. ఆ వీడియో చూసి, కొందరికైనా అవగాహన కలిగితే చాలు!’’


కరోనా సోకినా.... వ్యాయామం చేశా!

కరోనా సోకినంత మాత్రాన విశ్రాంతికే పరిమితమైపోలేదు. కరోనా సోకిందనే గానీ, నాలో హుషారు ఏమాత్రం తగ్గలేదు. దాంతో రోజూ లానే వ్యాయామాలు చేశాను. పౌష్ఠికాహారం తీసుకున్నాను. కుటుంబసభ్యులందరం మాస్క్‌, గ్లౌజులు, సాక్స్‌లు ధరించి, భౌతిక దూరం పాటించాం. 15 రోజుల పాటు హోమ్‌ క్వారంటైన్‌లో ఉండిపోయాం. ఆ తర్వాత పరీక్ష చేయించుకుంటే, కరోనా నెగెటివ్‌ ఫలితం వచ్చింది.


-గోగుమళ్ల కవిత

Updated Date - 2020-06-28T05:30:00+05:30 IST