విపణిలోకి ‘సెల్‌కాన్‌ హెల్త్‌’ ఉత్పత్తులు

ABN , First Publish Date - 2020-06-07T06:00:53+05:30 IST

మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీ సెల్‌కాన్‌.. మార్కెట్లోకి ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను విడుదల

విపణిలోకి ‘సెల్‌కాన్‌ హెల్త్‌’ ఉత్పత్తులు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): మొబైల్‌ ఫోన్ల తయారీ కంపెనీ సెల్‌కాన్‌.. మార్కెట్లోకి ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను విడుదల చేసింది. ‘సెల్‌కాన్‌ హెల్త్‌’ బ్రాండ్‌తో టెక్నాలజీ ఆధారిత ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను కంపెనీ అభివృద్ధి చేసింది. శనివారం నాడిక్కడ తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ఈ ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేశారు. ఆటోమేటిక్‌ వాల్‌-మౌంటబుల్‌ శానిటైజర్లు, పోర్టబుల్‌ స్ర్పే శానిటైజర్లు, ఇన్‌ఫ్రారెడ్‌, ముఖాన్ని గుర్తించే థర్మోమీటర్లు, మెడ, కంటి మసాజర్లు, అతి నీలలోహిత కిరణాల స్టెరిలైజర్లు, ఎలకో్ట్రస్టాటిక్‌ స్ర్పేగన్స్‌ సహా  10 ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసినట్లు సెల్‌కాన్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ వై గురు తెలిపారు. కొవిడ్‌-19ను కట్టడి చేయడానికి కాంటాక్ట్‌లెస్‌ విధానం చాలా ముఖ్యమని, అందువల్ల సెన్సర్లను అమర్చి తాకకుండానే శానిటైజర్‌ ద్వారా చేతులను శుభ్రం చేసుకునే ఉత్పత్తులను ప్రవేశపెట్టామన్నారు.


కొవిడ్‌ ట్రాక్‌ మిషన్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు గురు చెప్పారు. మొత్తం ఉత్పత్తులను తెలంగాణలోనే డిజైన్‌ చేసి తయారు చేయడం సంతోషంగా ఉందని ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. కాగా  బీ2బీ పద్ధతిలో ఇప్పటికే ఈ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చామని.. సెల్‌కాన్‌ స్టోర్లు, రిటైల్‌ అవుట్‌లెట్లు, మాల్స్‌ మొదలైన చోట్ల సంస్థ హెల్త్‌ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని సెల్‌కాన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మురళి రేతినేని తెలిపారు. ముందుగా దక్షిణాది రాష్ట్రాల్లో సెల్‌కాన్‌ హెల్త్‌ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని.. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రవేశపెడతామన్నారు. 

Updated Date - 2020-06-07T06:00:53+05:30 IST