Abn logo
Apr 9 2021 @ 03:25AM

సిమెంట్‌ పైపైకి

  • దిగి రానంటున్న ఐరన్‌ ధరలు
  • 1 నుంచి రాష్ట్రంలో బస్తా సిమెంట్‌పై 
  • మరో రూ.40-60 పెంచిన కంపెనీలు
  • 4 నెలల్లోనే బస్తాపై రూ. వంద భారం
  • ఏప్రిల్‌ నుంచి ఐరన్‌పై 3 వేలు పెంపు
  • కంపెనీలు ఉత్పత్తి తగ్గించి ధరలు
  • పెంచడంతో సిమెంట్‌కు తీవ్ర కొరత
  • పెద్దలాభం చూసుకోకుండా సర్కారీ 
  • నిర్మాణాలకు భారీగా సబ్సిడీకి సరఫరా
  • జనాలకు మాత్రం భగ్గమనేలా ధరలు


కరోనా టైమ్‌లో చుక్కలు తాకిన సిమెంటు ధర ఇంకా దిగిరాలేదు. నాలుగు నెలలుగా ఐరన్‌ పరిస్థితీ ఇంతే! ఇంటి నిర్మాణంలో అతి కీలకమైన రెండూ ఇలా మండిపోతుండగానే.. మరో పిడుగు! ధరలు తగ్గకపోగా ఈ నెల ఒకటో తేదీ నుంచి మరింతగా భగ్గుమంటున్నాయి. సిమెంట్‌ బస్తాకు రూ.40 నుంచి రూ.60, ఐరన్‌ ధర టన్నుకు ఏకంగా రూ. మూడు వేలు పెరిగిపోయాయి. 
(అమరావతి - ఆంధ్రజ్యోతి)

కొవిడ్‌ కాలంలో పైపైకి వెళ్లిన బంగారం ధర కూడా దిగొచ్చింది. వందగ్రాముల బంగారం ధర ఒక దశలో రూ.5లక్షలు దాటేసింది. కానీ ఇప్పుడు రూ.4.2లక్షలకు చేరింది. అంటే దాదాపు 20శాతం తగ్గింది. కానీ కొవిడ్‌ కాలంలో పైకెళ్లిన సిమెంటు ధర మాత్రం తగ్గలేదు. కొవిడ్‌ అనంతరం బ్రాండ్‌ను బట్టి బస్తాకు రూ.40నుంచి 70 వరకు పెరిగిన సిమెంటు మాత్రం దిగిరాలేదు. ఐరన్‌ ధరదీ అదే దారి. టన్ను ధర ఈ నెల ఒకటో తేదీనుంచి రూ.3వేలు పెరిగింది. 8ఎం ఎం ఐరన్‌ ధర టన్నుకు రూ.64వేలకు చేరగా, 12ఎంఎం ఐరన్‌ ధర టన్నుకు రూ.61వేలకు ఎగసింది. ఇంతగా ధరలు పెరిగిపోతున్నా, తగ్గించే చర్యలపై ప్రభుత్వాలు దృష్టిసారించకపోవడంపై పలువురు మండిపడుతున్నారు. 


రూ.400 దాటేసింది 

అల్ర్టాటెక్‌, కేసీపీ లాంటి బ్రాండ్‌ కంపెనీల ధరలు రూ.400 దాటేశాయి. రూ.300 నుంచి ప్రారంభమైన వీటి పెరుగుదల నాలుగు శతకాలు దాటేసింది. అదేవిధంగా ఇతర బ్రాండ్‌ సిమెంటు ధరలు కూడా రూ.350కి చేరుకున్నాయి. ఇవన్నీ రూ.260నుంచి పెరుగుతూ వచ్చేశాయి. అంటే సుమారుగా తాజా పెరుగుదల, గతంలో పెరిగిన ధరలు కలిపి మొత్తంగా బస్తాకు వందకు పైగా పెరిగిపోయాయి. వాస్తవానికి గతంలో 60-70రూపాయలు పెంచినప్పుడే గగ్గోలు పుట్టింది. ఇంత భారీ పెంపు ఏంటనే ప్రశ్న తలెత్తింది. అలాంటిది ఈ నెల నుంచి మరో రూ.40నుంచి 60రూపాయలు పెరగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి! సాధారణంగా సిమెంటు, ఐరన్‌ ధరలు కొంతకాలంపాటు పెరిగి, కొంతకాలం పాటు తగ్గడం అప్పుడప్పుడూ జరుగుతూ ఉండడం చూస్తుంటాం. కానీ ఇప్పుడు అలాంటి సీజనల్‌ ప్రభావం, డిమాండ్‌ ప్రభావం ఏమీ లేదు. ఏదో పూనకం వచ్చినట్లు, రోజురోజుకూ పెరుగుతూనే పోతున్నాయి. నెలలు గడిచినా, సీజన్‌లు మారినా కిందకు మాత్రం దిగిరావడం లేదు. ఒకపక్క సిమెంటు, మరోపక్క ఐరన్‌...ఈ రెండే ఇంటి నిర్మాణంలో కీలకం. ఇంటి ఖర్చులో అత్యధిక శాతం ఈ రెండింటిదే. వీటి ధరలు ఆకాశంలోకి వెళ్లిపోవడంతో సొంత గూడు నిర్మించుకునేవాడు బెంబేలెత్తుతున్నారు. 


ఎంత పెరిగితే అంత పన్ను

రాష్ట్ర ప్రభుత్వానికి సిమెంటు సబ్సిడీ ధరలకే లభిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు చేపట్టే పనులకు బస్తా సిమెంటు రూ.240కే వస్తుంది. అది సిమెంటు కంపెనీలకు బ్రేక్‌ ఈవెన్‌ ధర కంటే కొంచెం ఎక్కువ. అంటే సిమెంటు కంపెనీలు ఒక బస్తా తయారీకి పెట్టే ఖర్చు, సిబ్బంది ఖర్చు, దానికయ్యే వడ్డీ ఖర్చు వీటన్నింటినీ కలిపి...దానికి కొంత లాభం జోడిస్తే అది బ్రేక్‌ ఈవెన్‌ ధర. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా లాభం వేసుకోకుండానే సిమెంటును కంపెనీలు సరఫరా చేస్తున్నాయన్నమాట. కానీ అదే ప్రజల విషయానికి వచ్చేసరికి మాత్రం భరించలేనంత భారం మోపుతున్నాయి. ప్రభుత్వానికి రూ.240కి ఇచ్చినప్పుడు ప్రజలకు మరో 15-20శాతం వేసి రూ.280లోపు సిమెంటు సరఫరా చేయవచ్చని పలువురు పేర్కొంటున్నారు. కానీ సిమెంటు కంపెనీలు రూ.40-50అధికంగా అమ్మాల్సిన చోట రూ.100-120వరకు ఎక్కువకు అమ్మేస్తున్నాయని చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా దీనిపై ఎందుకు దృష్టిపెట్టడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి, ప్రభుత్వ కాంట్రాక్టర్లకు తక్కువకు వస్తే సరిపోతుందా?...మధ్యతరగతి ప్రజలు పట్టరా? అన్న ప్రశ్నలూ ఉత్పన్నమవుతున్నాయి. ఇంకోవైపు సిమెంటు ధరలు పెరిగేకొద్దీ ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. సిమెంటు ధరపై 18శాతం జీఎస్టీ వేస్తారు కాబట్టి...ధర ఎంత పెరిగితే అంత మేర ప్రభుత్వానికీ ఆదాయమన్నమాట. ధర పెరుగుదలతో పాటు ప్రభుత్వ ఆదాయమూ పెరుగుతుంది. అంచనాలు తారుమారు 

ఒకపక్క కంపెనీలు, మరోపక్క ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంటే...సొంత గూడు నిర్మించుకునే ప్రజల పరిస్థితి మాత్రం దిగజారిపోతోంది. అప్పో సప్పో చేసి సొంత ఇంటి నిర్మాణం ప్రారంభించినవారు...మధ్యలో  సిమెంటు, ఇనుముతో పాటు ఇతర గృహనిర్మాణ సామగ్రి ధరలు కూడా పెరిగిపోవడంతో భారంగా మారిన ఖర్చులను చూసి బెంబేలెత్తుతున్నారు. ఉదాహరణకు రూ.30లక్షలు అంచనాతో ఒకాయన ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. మూడు నెలల క్రితం ఇంటి నిర్మాణం ప్రారంభించిన ఆయనకు ఈ కాలంలో పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సిమెంటు, ఐరన్‌, హార్డ్‌వేర్‌, ఎలక్ర్టికల్‌, ప్లంబింగ్‌, లేబర్‌...ఇలా ప్రతిదాని ధర పెరిగింది.  దీంతో ఆయన ఇంటి నిర్మాణ వ్యయం 20శాతం పైగా పెరిగిపోయింది. ఒక మధ్యతరగతి మనిషి...అది కూడా 15-20ఏళ్లపాటు సొంతింటికోసం పైసా పైసా కూడబెట్టి...అది కూడా సరిపోక బ్యాంకు అప్పుకు వెళ్లి నిర్మాణంలోకి దిగాక ఇదీ పరిస్థితి. అంచనాలు తారుమారై మరో రూ.6లక్షలు అదనంగా అప్పు తేవాల్సిన పరిస్థితి. అంతకుముందు అప్పు, ఈ అప్పు కలిస్తే...ఇక అతను సొంతింటిలో ఉన్న సుఖం ఎలా పొందగలడు! అప్పుల ఆలోచనతోనే జీవితం గడిపేయాల్సిందే కదా! 

Advertisement
Advertisement
Advertisement