2021 సెన్సస్‌లో ఓబీసీల గణన

ABN , First Publish Date - 2020-09-10T06:19:41+05:30 IST

వచ్చే ఏడాది నిర్వహించనున్న జనాభా గణనలో భాగంగా ఓబీసీ కులాల జనాభాను లెక్కించాలి. ఇది 80కోట్ల మంది ఓబీసీల డిమాండ్ అని ప్రభుత్వం గుర్తించాలి. బ్రిటిష్ వలస...

2021 సెన్సస్‌లో ఓబీసీల గణన

వచ్చే ఏడాది నిర్వహించనున్న జనాభా గణనలో భాగంగా ఓబీసీ కులాల జనాభాను లెక్కించాలి. ఇది 80కోట్ల మంది ఓబీసీల డిమాండ్ అని ప్రభుత్వం గుర్తించాలి. బ్రిటిష్ వలస పాలకులు సమకాలీన జనాభా లెక్కల నుండి కులాల వారీ వివరాలను లెక్కించారు. ఆ డేటాను పరిపాలన కోసం ఉపయోగించారు. వెనుకబడిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని భారత రాజ్యాంగం ఆదేశించింది. ఈ నిర్దేశాన్ని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం గర్హనీయం. ఓబీసీ కులాల జనాభా లెక్కలను సేకరించడానికి ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నించడం లేదో అర్థం కావడం లేదు. కులాల వారీ జనాభా గణనకు సంబంధించి కాకా కాలేకర్ కమిషన్ (1955), ఆంధ్రప్రదేశ్ అనంతరామన్ కమిషన్ (1971), కర్ణాటక హవనూర్ కమిషన్ (1975), మండల్ కమిషన్ (1980) సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాలి. సెన్సస్ రూల్ 1990లోని సెక్షన్ 8, సెన్సస్ రూల్స్ (1990)లోని సెక్షన్ 6 లేదా ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కుల/వర్గ సమాచారాన్ని సేకరించడానికి ఎటువంటి అడ్డంకులు లేవు.


2021లో ఓబిసి కులాల జనాభా గణన కోరుతూ బీహార్, మహారాష్ట్ర, ఒడిషా శాసనసభలు ఆమోదించిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. కుల జనాభా గణనలను సేకరించకపోతే దేశవ్యాప్తంగా 10 వేలకు పైగా గ్రామ పంచాయతీలు 2021 జనాభా లెక్కలను బహి ష్కరిస్తామని తీర్మానం చేశాయి.కుల జనాభా గణన సమాజాన్ని విభజిస్తుందనే తప్పుడు భయాన్ని పాలకులు విడనాడాలి. ఆ భయం నిరాధారమైనది. ఇది డేటా సైన్స్, డేటా మైనింగ్, బిగ్ డేటా, ఎనలిటిక్స్, డీప్ లెర్నింగ్, మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యుగం అన్న వాస్తవాన్ని మనం విస్మరించకూడదు.


పశువుల, పక్షుల గణన జరుగుతున్నప్పుడు ఓబీసీ జనాభా గణన ఎందుకు చేయరు? అలా చేయకపోవడం ఓబీసీ కులాలను కించపరచడం కాదా? మన దేశంలో మూడు సామా జిక తరగతులు ఉన్నాయి. అవి:ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ, ఇతరులు. జనాభా లెక్కల ప్రకారం ఓబీసీ కులాలను మాత్రమే నిర్లక్ష్యం చేయడం మన ప్రజాస్వామిక పాలకులకు తప్పుగా అనిపించడం లేదా? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం హామీ ఇవ్వబడిన ప్రాథమిక హక్కులను కోల్పోవడమే కాకుండా ఆర్టికల్ 16 (4) కింద తగిన ప్రాతినిధ్యం లేక రాజ్యాంగ ప్రాథమిక ఉనికిని ఓబీసీలు కోల్పోతున్నారు. ఆర్టికల్ 243 డి (6), 243 టి (6) కింద స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల పరిమాణాత్మక డేటా లేనందువల్ల రాజ్యాంగ అర్హతను ఓబీసీ కులాలు పొందలేక పోతున్నాయి. 2021 జనాభా లెక్కలు కాగిత రహిత జనాభా గణన కాబట్టి, ప్రశ్న 10లో ఓబీసీ వర్గాలను జోడించడం చాలా సులభం. దీనివల్ల ప్రభుత్వానికి అదనపు ఖర్చులు ఏమీ వుండవు. జనాభా గణన సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అవసరం లేదు. ఓబీసీ కులాల జనాభా గణన సరళమైన పాలన, సమాచార సంపదను ఇస్తుంది. ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలను సమర్థంగా అమలుపరిచేందుకు ఉపయోగపడుతుంది. 


భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లోని 1వ జాబితాలో జనాభా గణన కేంద్ర అంశంగా ఉన్నది. ఈ దృష్ట్యా అవసరమైన కుల/వర్గ సమాచారాన్ని సేకరించకపోవడమనేది రాజ్యాంగ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరచకపోవడమే అవుతుంది. ఇది సహకార సమాఖ్య విధాన స్ఫూర్తికి విరుద్ధం. తాజా జనాభా లెక్కలు లేవని, 1931 జనాభా లెక్కల డేటాను మాత్రమే ఉపయోగించడం కొనసాగించడం వల్లే ‘కేంద్ర విద్యా సంస్థ (ప్రవేశాల్లో రిజర్వేషన్)- 2006’ను సుప్రీం కోర్టు నిలిపివేసింది. ఫలితంగా ఓబీసీ కులాలు రాజ్యాంగ హక్కులకు దూరమవుతున్నాయి. జనాభా గణనలో 17 అంశాల వివరాలను తప్పనిసరిగా సేకరించాలని ఐక్యరాజ్యసమితి నిర్దేశించింది. వీటిలో 13వ అంశం అన్ని వర్గాల గురించి సమగ్ర వివరాల సేకరణకు సంబంధించినది. 2021 జనాభా లెక్కల ప్రారంభానికి ముందు హౌస్‌లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్‌ఎల్‌ఓ), పాపులేషన్ ఎన్యూమరేషన్ (పిఇ)లో కూడా దేశంలోని అన్ని కులాల జనాభా గణన కాలం చేర్చాలి. సుపరిపాలన, సమాజంలోని అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం సమాచార సంపద సమృద్ధ పరచాలి. అప్పుడే శక్తిమంతమైన భారతదేశాన్ని నిర్మించడం సాధ్యమవుతుంది. 

శ్రీనివాస్ తిపిరిశెట్టి

Updated Date - 2020-09-10T06:19:41+05:30 IST