నెలకు సరిపడా ఔషధాల నిల్వ!

ABN , First Publish Date - 2021-07-20T07:24:46+05:30 IST

కరోనా థర్‌ వేవ్‌ అంచనా నేపథ్యంలో రెమ్‌డెసివిర్‌, ఫావిపిరవిర్‌ ఔషధాలను నెల రోజులకు సరిపడా నిల్వ ఉంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.

నెలకు సరిపడా ఔషధాల నిల్వ!

  • కరోనా థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో కేంద్రం చర్యలు
  • రెమ్‌డెసివిర్‌, పావిపిరవిర్‌ వయల్స్‌ కొనుగోలు

న్యూఢిల్లీ, జూలై 19: కరోనా థర్‌ వేవ్‌ అంచనా నేపథ్యంలో రెమ్‌డెసివిర్‌, ఫావిపిరవిర్‌ ఔషధాలను నెల రోజులకు సరిపడా నిల్వ ఉంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. 50 లక్షల రెమ్‌డెసివిర్‌ వయల్స్‌ కొనుగోలు కోసం ఉత్పత్తి సంస్థలకు ఆడ్వాన్సు చెల్లించింది. దేశంలో టీకా పొందిన వారి సంఖ్య 40.64 కోట్లకు చేరిందని ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. దేశంలో సెకండ్‌ వేవ్‌లో 80ు కొత్త కేసులకు డెల్టా వేరియంటే కారణమని ఆరోగ్య నిపుణులు తెలిపారు. కొత్త లేదా మరింత ప్రమాదకర వేరియంట్‌లు ఉద్భవిస్తే కేసులు పెరిగే అవకాశం ఉందన్నారు. ఎక్కువ మందికి టీకా ఇవ్వడం, కొవిడ్‌ నిబంధనలు పాటించడం ద్వారా మరిన్ని వేవ్‌లు రాకుండా చూడొచ్చన్నారు. మహారాష్ట్రలో వెలుగుచూసిన డెల్టా వేరియం ట్‌ మధ్యప్రదేశ్‌, ఇతర రాష్ట్రాలకు వ్యాపించింది. డెల్టాప్లస్‌ 11 రాష్ట్రాల్లో ఉనికి చాటింది. 500పైగా కేసులు నమోదయ్యాయి. భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ రెండో డోసును 2-6 ఏళ్లలోపు వారికి కూడా వచ్చే వారం అందిస్తామని ఎయిమ్స్‌ అధికార వర్గాలు తెలిపాయి. వచ్చే రెండేళ్ల పాటు ప్రజలంతా కొవిడ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎయిమ్స్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నీరజ్‌ నిశ్చల్‌ సూచించారు. 


కొవిడ్‌ సోకినవారిలో 9 నెలలదాకా యాంటీబాడీలు 

కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ సోకిన వారిలో యాంటీబాడీలు కనీసం 9 నెలల పాటు క్రియాశీలంగా ఉంటాయని ఇటలీలోని పదువా వర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. తేలికపాటి కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ సోకిన వారిపై యాంటీ బయోటిక్‌ ఔషధం అజిత్రోమైసిన్‌ పెద్దగా పనిచేయడం లేదని అమెరికా శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీన్ని బట్టి తేలికపాటి ఇన్ఫెక్షన్‌ సోకిన వారికి అజిత్రోమైసిన్‌ అక్కర్లేదని అభిప్రాయాన్ని పరిశోధకులు వ్యక్తంచేశారు. యాంటీ పారసైటిక్‌, యాంటీ వైరల్‌, మోనోక్లోనల్‌ యాంటీబాడీలు, వ్యాక్సిన్లు, స్టెమ్‌ సెల్‌ థెరపీలు ఇలా ప్రతి విభాగంలోనూ విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనా వైర్‌సపై ఇప్పటిదాకా 265 ఔషధ సమ్మేళనాలను పరీక్షించారు. వాటిలో 115 నేరుగా కరోనా రోగుల్లో వైరల్‌ లోడ్‌ను తగ్గించేందుకు దోహదపడతాయని వెల్లడైంది. హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌(ఎన్‌ఐపీఈఆర్‌)తో పాటు ఢిల్లీ వర్సిటీకి చెందిన డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ సెంటర్‌ ఫర్‌ బయోమెడికల్‌ రిసెర్చ్‌, మొహాలీలోని చండీగఢ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీలకు చెందిన సంయుక్త పరిశోధక బృందం నిర్వహించిన అధ్యయనంలో ఈ వివరాలను గుర్తించారు. విటమిన్‌ సి, డి ఔషధాలతోనూ కొవిడ్‌ ముప్పు కొంతమేర తగ్గుతుందని ట్రయల్స్‌లో తేలిందన్నారు. కాగా, చైనాలో మంకీ బీ వైరస్‌ సోకి 53 ఏళ్ల పశువైద్యుడు మృతి చెందారు. మనుషులకు ఈ వైరస్‌ సోకడం ఇదే మొదటిసారని చైనా అధికారిక వార్తా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడించింది. ఈ వైరస్‌ సోకినవారిలో మరణాల రేటు 70-80% ఉంటుంది. 

Updated Date - 2021-07-20T07:24:46+05:30 IST