విజయనగరం జిల్లాలో.. మరో కేవీకే

ABN , First Publish Date - 2020-09-20T17:56:49+05:30 IST

జిల్లాలో మరో కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఏర్పాటు దిశగా అడుగులు..

విజయనగరం జిల్లాలో.. మరో కేవీకే

ఎం.రాయివలసలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు

స్థలాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తల బృందం

కురుపాం మండలంలో ఇప్పటికే ఒకటి స్థాపన


మెరకముడిదాం(విజయనగరం): జిల్లాలో మరో కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే కురుపాంలో ఒకటుంది. విజయనగరం డివిజన్‌కు సంబంధించి కూడా ఒకటి ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పుడు పట్టాలెక్కించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయానికొచ్చారు. అందులో భాగంగా మెరకముడిదాం మండలం ఎం.రాయివలస గ్రామాన్ని ఎంపిక చేశారు. ఇక్కడైతే ఎక్కువ మండలాలకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. స్థల పరిశీలనకు శాస్త్రవేత్తల బృందం శనివారం గ్రామాన్ని సందర్శించింది. సర్వే నెంబరు 43లోని 50 ఎకరాల స్థలాన్ని కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు గుర్తించి జిల్లా అధికారులకు నివేదించారు. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తలు డాక్టర్‌ చిన్నంనాయుడు, డాక్టర్‌ టీఎస్‌ఎస్‌ పాత్రో, డాక్టర్‌ కె.లక్ష్మణ్‌, సంధ్య, మండల సర్వేయర్‌ శ్రీనువాస్‌తో కలిసి స్థల పరిశీలన చేశారు.


భూసార పరీక్షల కోసం ఆ స్థలం నుంచి మట్టి నమూనాలు సేకరించారు. ఈసందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో రెండో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించామని, సేకరించిన మట్టి నమూనాలను పరీక్షించి పంటల సాగుకు అనుకూలమా? లేదా? అనేది గుర్తిస్తామన్నారు. కేంద్రం ఏర్పాటుకు సంబంధించి రోడ్డు సదుపాయాలు, భూసారం, ఏఏ పంటల సాగుకు భూమి అనువుగా ఉంటుందో గుర్తించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. కేవీకే ఏర్పాటుకు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి నుంచి అనుమతులు రావాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. 


రస్తాకుంటుబాయిలో...

జిల్లాలోని కురుపాం మండలం రస్తాకుంటుబాయి గ్రామంలో ఇప్పటికే కృషి విజ్ఞాన కేంద్రం నడుస్తోంది. విజయనగరం డివిజన్‌లో కూడా కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో మెరకముడిదాం మండలాన్ని ఎంపిక చేశారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఈ మండలంలో కేవీకే ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన ప్రారంభమవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా వ్యవసాయాధారిత ప్రాంతమైన మెరకముడిదాం మండలంలో కేవీకే ఏర్పాటైతే స్థానిక రైతులకు చాలా మేలు చేకూరుతుంది.

Updated Date - 2020-09-20T17:56:49+05:30 IST