Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశం.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘‘విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటినీ పూర్తి చేసేందుకు ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతోపాటు ఏపీ, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో ఇప్పటి వరకు 25 సమీక్షా సమావేశాలు జరిగాయి. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నాం. 14వ ఆర్థిక సంఘం సిఫారసులతో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయింది. అందువల్ల 2015-16 నుంచి 2019-20 మధ్య కేంద్ర ప్రాయోజిత పథకాలను 90:10 నిష్పత్తి కింద వచ్చే మొత్తాన్ని ప్రత్యేక సాయంగా ఏపీకి ఇచ్చేందుకు అంగీకరించాం. 2015-16 నుంచి 2019-20 వరకు కుదుర్చుకున్న విదేశీ రుణాలకు సంబంధించిన అసలు, వడ్డీని కూడా కేంద్రమే చెల్లిస్తుంది.’’ అని నిత్యానందరాయ్‌ పేర్కొన్నారు. 


మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం మరోసారి లోక్‌సభలో స్పష్టం చేసింది. ప్రత్యేక సాయం చేయడానికి అంగీకారం తెలిపినట్లు వెల్లడించింది. విభజన చట్టంలో చాలా అంశాలు అమలయ్యాయని, మిగిలిన వాటికి కొంత సమయం ఉందని కేంద్ర హోం శాఖ పేర్కొంది.

Advertisement
Advertisement