ఇంటింటికీ వ్యాక్సినేషన్ కుదరదు.. హైకోర్టుకు వెల్లడించిన కేంద్రం..

ABN , First Publish Date - 2021-04-22T00:09:18+05:30 IST

కోవిడ్-19 వ్యాక్సీన్ ఇంటింటికీ తీసుకెళ్లి ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం బోంబే హైకోర్టుకు స్పష్టం చేసింది....

ఇంటింటికీ వ్యాక్సినేషన్ కుదరదు.. హైకోర్టుకు వెల్లడించిన కేంద్రం..

ముంబై: కోవిడ్-19 వ్యాక్సీన్ ఇంటింటికీ తీసుకెళ్లి ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం బోంబే హైకోర్టుకు స్పష్టం చేసింది. వ్యాక్సీన్ కలుషితం అయ్యేందుకు అవకాశం ఉండడం, వృధా కావడం సహా పలు కారణాలను ధర్మాసనానికి నివేదించింది. న్యాయవాదులు ధృతి కపాడియా, కునాల్ తివారీలు దాఖలు చేసిన ఓ ప్రజా ప్రాయోజన వ్యాజ్యం (పిల్)‌కు ఇవాళ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తన స్పందన తెలియజేసింది. 75 ఏళ్లు పైబడిన వారికి, వికలాంగులకు, బెడ్ రెస్ట్ లేదా వీల్‌చైర్‌కి పరిమితమైన వారికోసం ఇంటి వద్దనే వ్యాక్సినేషన్ సదుపాయం కల్పించాలంటూ పిటిషనర్లు కోరారు. అయితే దీన్ని అమలు చేయడం సాధ్యం కాదంటూ కేంద్ర ఆరోగ్య శాఖ అండర్ సెక్రటరీ సత్యేంద్ర సింగ్ పలు కారణాలను వెల్లడించారు.


‘‘వ్యాక్సీన్ ఇచ్చిన తర్వాత ఏదైనా ఇబ్బందికర పరిస్థితి తలెత్తితే అప్పటికప్పుడు కేసు నిర్వహణ కష్టంగా మారుతుంది. ఆస్పత్రికి తరలించడానికి కూడా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. వ్యాక్సినేషన్ తర్వాత 30 నిమిషాల పాటు పేషెంట్‌ను వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలన్న ప్రోటోకాల్‌ను పాటించడంలో సవాళ్లు ఎదురవుతాయి..’’ అని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. ఇంటింటికీ వ్యాక్సినేషన్ ప్రక్రియలో వ్యాక్సీన్ కలుషితం కావడంతో పాటు వ్యర్థమయ్యే అవకాశాలు కూడా ఉంటాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యాక్సీన్ కంటైనర్ బయటికి తీసుకెళ్లి ఇంటింటికీ తిప్పడం వల్ల దాని సామర్థ్యంపైనా ప్రభావం పడుతుందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు మరిన్ని వ్యాక్సీన్ కేంద్రాలకు అనుమతి ఇచ్చామనీ.. వృద్ధులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా సూచించామని కూడా కేంద్రం పేర్కొంది. కాగా ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జీఎస్ కులకర్ణిలతో కూడిన ధర్మాసనం రేపు విచారణ చేపట్టే అవకాశం ఉంది. 

Updated Date - 2021-04-22T00:09:18+05:30 IST