వడ్డీ రేట్ల కోతపై కేంద్రం యూటర్న్‌

ABN , First Publish Date - 2021-04-02T07:17:42+05:30 IST

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ బుధవారం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుంది. వడ్డీ రేట్ల తగ్గింపునకు సంబంధించిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు గురువారం

వడ్డీ రేట్ల కోతపై కేంద్రం యూటర్న్‌

ఉత్తర్వుల ఉపసంహరణ

పొరపాటున జారీ చేశాం 

నిర్మలా సీతారామన్‌ వెల్లడి

ఆర్థిక మంత్రి ప్రకటనపై రాజకీయ దుమారం


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ బుధవారం తీసుకున్న నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్‌ తీసుకుంది. వడ్డీ రేట్ల తగ్గింపునకు సంబంధించిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు గురువారం ప్రకటించింది. వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఉత్తర్వు జారీ చేయడం, దానిపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిన వివరణ పట్ల రాజకీయ దుమారం రేగింది. పీపీఎఫ్‌, టర్మ్‌ డిపాజిట్లు, సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌, కిసాన్‌ వికా్‌సపత్ర, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలపై భారీగా వడ్డీని తగ్గిస్తూ బుధవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ఉదయమే ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. ‘‘చిన్న మొత్తాల పొదుపు పథకాలపై 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఉన్న వడ్డీ రేట్లను కేంద్రం కొనసాగిస్తుంది. అంటే.. మార్చి 31 వరకు ఉన్న వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగుతాయి. పొరపాటున జారీ చేసిన ఉత్తర్వును ఉపసంహరించుకుంటున్నాం’’ అని ఆమె పేర్కొన్నారు. నిర్మలా సీతారామన్‌ ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత చిన్న మొత్తాల పొదుపు పథకాలపై తగ్గించిన వడ్డీ రేట్ల ఉత్తర్వులను ఉపసంహరిస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారిక ఉత్తర్వును జారీ చేసింది. పాత వడ్డీ రేట్లను పునరుద్ధరించింది.


ఎన్నికల తర్వాత వడ్డీ రేట్లు త గ్గిస్తారు.. 

పొరపాటున ఉత్తర్వులు జారీ అయ్యాయని నిర్మలా సీతారామన్‌ ప్రకటించడం రాజకీయ దుమారానికి కారణమైంది. కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాది పార్టీ వంటి పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ స్పందిస్తూ.. ఎన్నికలు ముగిసిన వెంటనే  చిన్న మొత్తాల పొదుపు రేట్లు తగ్గుతాయన్నారు. పెట్రోల్‌, డీజిల్‌పై ఇప్పటికే దోచుకుంటున్నారని, ఎన్నికలు ముగిసిన వెంటనే మధ్యతరగతి పొదుపు మొత్తాలపై దోపిడి ఉంటుందని ట్వీట్‌ చేశారు. ‘‘వడ్డీ రేట్ల తగ్గింపు ఉత్తర్వు నిజంగా పొరపాటా లేదా ఎన్నికల కోసం ఉపసంహరించుకున్నారా..?’’అని కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు.


ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా  తీ వ్రంగా విమర్శించారు. ‘‘కోట్లాది మంది ప్రజలపై ప్రభావం చూపించే ఆ ఉత్తర్వు పొరపాటున జారీ అయిందని అంటే ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్థి క మంత్రిగా కొనసాగే నైతిక హక్కు నిర్మలా సీతారామన్‌కు లేదు’’ అన్నారు. వడ్డీ రేట్లను తగ్గించి మధ్య తరగతి ప్రజలపై మరో దాడికి బీజేపీ ప్రభుత్వం పూనుకుందని కాంగ్రెస్‌ నేత, కేంద్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం ఇది పట్టుబడగానే పొరపాటున ఉత్తర్వులు జారీ అయ్యాయని అంటున్నారని తెలిపారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మొహా మైత్రా ఈ వ్యవహారాన్ని ఏప్రిల్‌ ఫూల్‌గా అభివర్ణించారు. 

Updated Date - 2021-04-02T07:17:42+05:30 IST