జ్వర సర్వేకు కేంద్రం ప్రశంస

ABN , First Publish Date - 2022-01-29T07:21:13+05:30 IST

రాష్ట్రంలో నిర్వహించిన జ్వర సర్వే, ప్రభుత్వం చేపట్టిన కరోనా నియంత్రణ చర్యలను కేంద్రం ప్రశంసించిందని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు.

జ్వర సర్వేకు కేంద్రం ప్రశంస

అన్ని రాష్ట్రాల్లో అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు: హరీశ్‌

ఖమ్మం, హైదరాబాద్‌, జనవరి 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిర్వహించిన జ్వర సర్వే, ప్రభుత్వం చేపట్టిన కరోనా నియంత్రణ చర్యలను కేంద్రం ప్రశంసించిందని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. ఇదే పద్ధతిని ఇతర రాష్ట్రాలు కూడా పాటించాలని సూచించిందని అన్నారు. కొవిడ్‌ పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ శుక్రవారం తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, లక్షద్వీప్‌, పుదుచ్చేరి వైద్యారోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖమ్మం పర్యటనలో ఉన్న హరీశ్‌ కలెక్టరేట్‌ నుంచి పాల్గొన్నారు.    అనంతరం విడుదల చేసిన ఓ ప్రకటనలో కలెక్టరేట్‌ వివరాలను వెల్లడించింది. సర్వే సమయంలో లక్షణాలున్న వారికి మందుల కిట్లు అందిస్తున్నామని హరీశ్‌ తెలపగా.. మాండవీయ అభినందించారు. రెండో వేవ్‌ సమయంలో దేశంలోనే తొలిసారి తెలంగాణలో జ్వర సర్వే మొదలు పెట్టి మంచి ఫలితాలు సాధించిందని మంత్రి గుర్తుచేశారు.  18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి ముందుజాగ్రత్త డోసు ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మరోవైపు 60 ఏళ్లు దాటిన అందరికి ముందుజాగ్రత్త డోసు ఇవ్వాలని, ప్రస్తుతం ఉన్న గడువును 6 నెలలకు తగ్గించాలని, కొవిషీల్డ్‌ రెండో డోసు గడువును తగ్గించాలని కోరారు. ఈసీఆర్‌పీ-2 నిధులు రూ.248 కోట్లు విడుదల చేయాలన్నారు. కోటి హోం ఐసొలేషన్‌ కిట్లు, రెండు కోట్ల టెస్టింగ్‌ కిట్లు సమకూర్చుకున్నామని, 77,33,427 ఇళ్లలో సర్వే చేశామని, 3.45 లక్షల కిట్లను అందించామని చెప్పారు. జ్వర సర్వేతో ప్రభుత్వం వైద్యాన్ని ఇంటి వద్దకే చేర్చిందని..ఫలితంగా పాజిటివ్‌ రేటు, ఆస్పత్రుల్లో చేరికలు తగ్గాయని వివరించారు. 


టీకాలున్నా కేంద్రం ఇవ్వడం లేదు

కరోనా వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అవసరమున్నంత మేర ఇవ్వడం లేదని హరీశ్‌ విమర్శించారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో రూ.7.50 కోట్లతో ఏర్పాటు చేసిన క్యాథ్‌ల్యాబ్‌, ట్రామాకేర్‌, ఎమర్జెన్సీ వార్డులు, తల్లి పాల బ్యాంకును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ముందుజాగ్రత్త డోసు వ్యవధిని 9 నెలల నుంచి 3 నెలలకు తగ్గించాలని కోరినా కేంద్రం నుంచి స్పందన లేదన్నారు. 28 జిల్లాల్లో జ్వర సర్వే పూర్తయిందని, మిగిలిన జిల్లాల్లోనూ పూర్తవగానే మరోసారి నిర్వహిస్తామన్నారు. హైదరాబాద్‌ తర్వాత ఖమ్మం ఆస్పత్రిలోనే కార్డియాలజీ సేవలు ప్రారంభించామన్నారు. త్వరలో ఆదిలాబాద్‌ జిల్లాలో క్యాథ్‌ల్యాబ్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. నిలోఫర్‌ తర్వాత ఖమ్మంలోనే తల్లి పాల కేంద్రంను ప్రారంభించామని తెలిపారు. ఖమ్మంలో 100 పడకల ట్రామాకేర్‌ సెంటర్‌ ద్వారా తక్షణ వైద్య సదుపాయాలు అందుతాయన్నారు. జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల కింద గుర్తించాలని మళ్లీ కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. పువ్వాడ అజయ్‌ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా ఆస్పత్రి ఇతర ప్రాంతాలకు సైతం సేవలందిస్తున్నందని, ఇంకా అభివృద్ధి చేసేందుకు మంత్రి హరీశ్‌ సహకారాన్ని అందించాలని కోరారు. కాగా, ఉమ్మడి జిల్లా వైద్యారోగ్యశాఖపై సమీక్ష సందర్భంగా ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో సిజేరియన్లు ఎందుకు అధికంగా జరుగుతున్నాయని హరీశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మధిరలో రూ.34 కోట్లతో నిర్మించనున్న 100 పడకల ఆస్పత్రి భవన సముదాయానికి హరీశ్‌ శంకుస్థాపన చేశారు. 

Updated Date - 2022-01-29T07:21:13+05:30 IST