జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం దారి మళ్లించింది : కాగ్‌

ABN , First Publish Date - 2020-09-26T07:30:59+05:30 IST

జీఎస్టీ పరిహారం చెల్లింపులో కేంద్రం రాష్ట్రాలకు అన్యాయం చేసిందని కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ పరోక్షంగా ఆక్షేపించారు...

జీఎస్టీ పరిహారాన్ని కేంద్రం దారి మళ్లించింది : కాగ్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: జీఎస్టీ పరిహారం చెల్లింపులో కేంద్రం రాష్ట్రాలకు అన్యాయం చేసిందని కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ పరోక్షంగా ఆక్షేపించారు. సుమారు 47,272 కోట్ల రూపాయల పరిహారాన్ని రాష్ట్రాలకు చెల్లించకుండా ఇతర అవసరాలకు కేంద్రం వాడేసుకుందని, ఇది జీఎస్టీ చట్టానికి విరుద్ధమని తన వార్షిక నివేదికలో కాగ్‌ ఎండగట్టింది. ఈ మొత్తం జీఎస్టీ సెస్‌ కింద వసూలు చేసినదని, రూల్‌ ప్రకారం రాష్ట్రాలకు చెందాలని, నాన్‌-లాప్సబుల్‌ నిధి (జీఎస్టీ పరిహార నిధి) కింద జమ చేయాల్సిన ఈ మొత్తాన్ని వేరే పథకాలకు మళ్లించారని కాగ్‌ వివరించింది. వస్తు సేవల పన్నుల వ్యవస్థ కారణంగా రాష్ట్రాలకు వచ్చే ఆదాయ నష్టాన్ని ఐదేళ్లపాటు తామే భరిస్తామని 2017లో కేంద్రం ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ పరిహారాన్ని పూర్తిస్థాయిలో రాష్ట్రాలకు చెల్లించడంలో విఫలమవుతూ- దశల వారీగా చెల్లిస్తూ- కొన్ని సార్లు అసలే చెల్లించకుండా తాత్సారం చేస్తూ వస్తోంది. ఈ ఏడాది కొవిడ్‌ కారణం చెప్పి అసలే ఇవ్వలేమని చేతులు ఎత్తేసింది. 

Updated Date - 2020-09-26T07:30:59+05:30 IST