Abn logo
Sep 25 2021 @ 23:32PM

ప్రజలను దోచుకుంటున్న కేంద్రం

భారత్‌బంద్‌కు సంఘీభావం తెలుపుతున్న అఖిలపక్ష నాయకులు

భారత్‌ బంద్‌కు పూర్తి సహకారం

పీసీసీ కార్యనిర్వాహక అఽధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌వలీ

గుజరాతీపేట, సెప్టెంబరు 25:  కేంద్రంలోని బీజేపీ ఏడేళ్ల పాలనలో భారతదేశం 20ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందని... ప్రధాని నరేంద్రమోదీ కార్పొరేట్‌ శక్తులకు దేశాన్నితాకట్టుపెట్టి ప్రజలను ఆర్థికంగా దోచుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు షేక్‌ మస్తాన్‌వలీ విమర్శించారు. డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి ఆధ్వర్యంలో నగరంలోని ఇందిరా విజ్ఞాన్‌భవన్‌లో శనివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. ఈ నెల 27న నిర్వహించనున్న భారత్‌ బంద్‌కు కాంగ్రెస్‌ పూర్తి సహాయ సహకారాలు అందించనుందని, అందుకు అన్ని పక్షాలతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. పారిశ్రామికంగా దేశాన్ని ఎదగనీయకుండా కార్పొరేట్‌ శక్తులకు దోచుకుపెట్టే సంస్థగా బీజేపీ ప్రభుత్వం మారిందన్నారు. ఒక్క పెట్రోల్‌పైనే రూ.20లక్షల కోట్లను ప్రజల నుంచి దోచుకుందని ఆరోపించారు. మోదీ నిరంకుశ విధానాలతో యువతకు ఉద్యోగ అవ కాశాలు కరువయ్యాయన్నారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసి రైతును కూలీగా మార్చే ఒక కొత్త వ్యవస్థను తీసుకురావడానికి కేంద్రం ప్రయత్ని  స్తోందని ఆరోపించారు. దీనికోసం 3 వ్యవసాయ చట్టాలను చేశారన్నారు. కాంగ్రెస్‌ హయాంలో ఎంతో అభివృద్ధి చెందిన దేశం... బీజేపీ పాలనలో తిరోగమనంలో పడిందని విమర్శించారు. డీసీసీ అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి మాట్లాడుతూ.. 19 పార్టీల పిలుపు మేరకు సోమవారం చేపట్టే భారత్‌బంద్‌కు  పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సీపీఎం నాయకుడు బవిరి కృష్ణమూర్తి, సీపీఐ నాయకుడు ప్రకాష్‌, టీడీపీ నేత పీఎంజే బాబు, తదితరులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ జిల్లా ఇన్‌చార్జి జీఏ నారాయణరావు, రాష్ట్ర బీసీసెల్‌ కన్వీనర్‌ జమ్ము ఆదినారాయణ, నాయకులు సనపల అన్నాజీరావు, కోత మధు, గోవింద మల్లిబాబు, కేవీఎల్‌ఎస్‌ ఈశ్వరి, వీర్రాజు, బస్వా షణ్ముఖరావు, పి.ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు.