వరద నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం

ABN , First Publish Date - 2021-11-29T04:33:34+05:30 IST

బుచ్చిరెడ్డిపాళెం మండలంలో పెన్నా వరద ముంపునకు దెబ్బతిన్న ప్రాంతాలను కేంద్రబృందం సభ్యులు, కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆదివారం పరిశీలించారు

వరద నష్టాన్ని పరిశీలించిన కేంద్ర బృందం
జేజేపేటలో దెబ్బతిన్న అరటి తోటలు పరిశీలిస్తున్న కేంద్ర బృందం సభ్యులు

బుచ్చిరెడ్డిపాళెం, నవంబరు 28: బుచ్చిరెడ్డిపాళెం మండలంలో పెన్నా వరద ముంపునకు దెబ్బతిన్న ప్రాంతాలను కేంద్రబృందం సభ్యులు, కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఆదివారం పరిశీలించారు. తొలుత మండలంలోని పెనుబల్లి వద్ద బుచ్చి-జొన్నవాడ మార్గంలో భారీ కోతకు గురైన రోడ్డును, పెద్దకాలువ కరకట్టలను పరిశీలించారు. ఆర్‌అండ్‌బీ, నీటిపారుదల శాఖ అధికారులతో నష్టంపై అంచనాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హైస్కూలో వరద ప్రవాహానికి కూలిన ప్రహరీ, పలు నిర్మాణాలు, గ్రామంలో దెబ్బతిన్న గిరిజన కాలనీ ఇళ్లను పరిశీలించారు. వరదలకు దెబ్బతిన్న పశువైద్యశాలను పరిశీలించి  జేడీ, డీడీ, ఏడీ మురళికృష్ణ, వీఎల్‌వో శ్రీనివాసులును నష్టంపై అడిగి తెలుసుకున్నారు. మృత్యువాత పడిన మూగ జీవాల రైతులతో మాట్లాడారు.  జొన్నవాడలో మొత్తం 350 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారి సురేంద్రరెడ్డి వివరించారు. జొన్నవాడ, పెనుబల్లి, దామరమడుగుతోపాటు వరద ముంపునకు గురైన  పొలాల్లో ఏర్పడిన ఇసుక మేటలు, పంటల నష్టం గురించి జొన్నవాడ గ్రామ సర్పంచు కందికట్టు పెంచలయ్య, సీపీఎం నాయకులు గండవరపు శ్రీనివాసులు, గుర్నాధంలు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. బృందం వెంట ఇరిగేషన్‌ ఎస్‌ఈ. కృష్ణమోహన్‌, డీఈ మధు, ఆత్మకూరు సీఐ వేణుగోపాల్‌రెడ్డి, ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి, ఏఈ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో నరసింహరావు, వవ్వేరు బ్యాంకు చైర్మన్‌ సూరా శ్రీనివాసులురెడ్డి, పెనుబల్లి సర్పంచు ఊడా పెంచలయ్య, ఎంపీటీసీ వినయ్‌నారాయణ, స్థానిక రైతులు ఉన్నారు.

ఐదు గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటన

ఇందుకూరుపేట : కేంద్ర బృందం ఆదివారం మండలంలోని ఐదు గ్రామాల్లో పర్యటించి వరద నష్టాలను నమోదు చేసింది. జగదేవిపేటలో దెబ్బతిన్న అరటితోటలను, గంగపట్నంలో ఆక్వా గుంటలు, రాముడుపాలెం, కుడితిపాళెం, ముదివర్తిపాలెం, రాజుకాలనీల్లో తెగిపోయిన పెన్నానది కట్టలు, చెరువులగండ్లు, కూలిన ఇళ్లు, కనిపించని రహదారులు, వరి పొలాలు,  వాటిలో ఇసుక మేటలను పరిశీలించింది. బృందం సభ్యులు బాధితులను వివరాలు అడిగి తెలుసు కున్నారు. 8వేల ఎకరాల ఆక్వా గుంటల్లో నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. బృందం సభ్యులు ఎక్కువ సేపు ఆక్వా రంగం నష్టాల వివరాలు సేకరించారు. మోటార్లు, పరిశ్రమలు, జనరేటర్లు, కట్టలు తెగిపోయాయని ఏడాదిపాటు సబ్సిడీపై కరెంటు బిల్లులు, మోటార్లు అందించాలని బాధితులు వేడుకున్నారు. అనంతరం సభ్యులు రాజుకాలనీకి బురదలోను, నీళ్లలోను వెళ్లి పరిశీలించి బాధితులతో మాట్లాడారు. అనంతరం జేసీ హరేందిర ప్రసాద్‌ విలేకర్లతో మాట్లాడుతూ కేంద్రబృందం సభ్యులు అమరావతిలో ముఖ్యమంత్రిని కలిసి అనంతరం నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తారన్నారు. జిల్లాలో 109 గ్రామాల్లో అన్ని రంగాలు దెబ్బతిన్నాయని నివేదిక అందించినట్లు తెలిపారు.


Updated Date - 2021-11-29T04:33:34+05:30 IST