కరెంటు అమ్ముకుంటారా?

ABN , First Publish Date - 2021-10-13T07:00:26+05:30 IST

దేశంలో బొగ్గు కొరత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కేంద్రం మరిన్ని ఉపశమన చర్యలు చేపట్టింది. కేంద్ర విద్యుదుత్పత్తి ప్లాంట్ల(సీజీఎ్‌స)లో ఎవరికీ కేటాయించని విద్యుత్‌ను రాష్ట్రాలు వినియోగించుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో సూచించింది.

కరెంటు అమ్ముకుంటారా?

  • ప్రజలకు ఇవ్వకుండా కరెంటు అమ్ముకుంటారా?
  • పైగా అధిక ధరలు.. కొన్ని రాష్ట్రాలపై కేంద్రం ఫైర్‌
  • మిగులుంటే చెప్పండి.. అవసరమైన రాష్ట్రాలకిస్తాం
  • వినియోగదారులకు ఇవ్వకుండా అమ్మితే
  • సీజీఎస్‌ విద్యుత్తు వెనక్కి తీసుకుంటాం
  • కొన్ని రాష్ట్రాలు నిల్వలు పెంచుకోలేదు: కేంద్రం
  • బొగ్గు కొరతపై పీఎంవో సమీక్ష


న్యూఢిల్లీ, అక్టోబరు 12: దేశంలో బొగ్గు కొరత తీవ్రతరమవుతున్న నేపథ్యంలో కేంద్రం మరిన్ని ఉపశమన చర్యలు చేపట్టింది. కేంద్ర విద్యుదుత్పత్తి ప్లాంట్ల(సీజీఎ్‌స)లో ఎవరికీ కేటాయించని విద్యుత్‌ను రాష్ట్రాలు వినియోగించుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో సూచించింది. రాష్ట్రాల థర్మల్‌ ప్లాంట్లకు బొగ్గు సరఫరా పెంచాలని కోల్‌ ఇండియా లిమిటెడ్‌ను ఆదేశించింది.కొన్ని రాష్ట్రాలు తమ విద్యుత్‌ వినియోగదారులకు కరెంటు ఇవ్వకుండా.. బయట విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయని కేంద్ర విద్యుత్‌ శాఖ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘పవర్‌ ఎక్స్ఛేంజ్‌లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. నిరంతర కరెంటు సరఫరా పొందడం వినియోగదారుల హక్కు. డిస్కమ్‌లు ముందు వారికి సేవ చేయాలి. విద్యుత్‌ కొరత ఉన్న రాష్ట్రాలు సీజీఎ్‌సలోని వాటాను వినియోగించుకోవాలి. ఒకవేళ రాష్ట్రాల వద్ద మిగులు విద్యుత్‌ ఉంటే వెంటనే కేంద్ర ప్రభుత్వానికి సమాచారమివ్వాలి.


ఏ రాష్ట్రమైనా తన వినియోగదారులకు ఇవ్వకుండా ఇతరలకు విక్రయిస్తోందని తెలిస్తే.. ఆ రాష్ట్రం నుంచి సీజీఎ్‌సలోని ఎవరికీ కేటాయించని విద్యుత్‌ను వెనక్కి తీసుకుంటాం. అత్యవసరం ఉన్న రాష్ట్రాలకు మళ్లిస్తాం’ అని స్పష్టంచేసింది. బొగ్గు కొరతపై కేంద్ర విద్యుత్‌, బొగ్గు శాఖలు పీఎంవో ముఖ్య కార్యదర్శికి సవివర ప్రజెంటేషన్‌ ఇచ్చాయి. సంక్షోభం తలెత్తకుండా చూసేందుకు దేశంలోని విదేశీ బొగ్గు ఆధారిత ప్లాంట్లు పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు తీసుకోవడంపై చర్చలు జరిగాయి. కాగా, దసరా పండుగ వేళ విద్యుత్‌ సంక్షోభం తలెత్తకుండా థర్మల్‌ ప్లాంట్లకు బొగ్గు సరఫరాపెంచాలని కోల్‌ ఇండియాను కేంద్రం ఆదేశించింది.  ‘2020-21 ఆర్థిక సంవత్సరం చివరినాటికి కోల్‌ ఇండియా వద్ద పది కోట్ల టన్నుల బొగ్గునిల్వలు ఉన్నాయి. విద్యుత్‌ ప్లాంట్లు వాటిని తీసుకోలేదు. ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాయి’ అని బొగ్గుశాఖ ఉన్నతాధికారి ఒకరు అన్నారు. 


20 లక్షల టన్నులు సరఫరా చేస్తాం

రాష్ట్రాల జెన్‌కోల డిమాండ్‌కు అనుగుణంగా బొగ్గును సరఫరా చేసేందుకు పూర్తిస్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నామని.. ఇప్పుడు రోజుకు 19.5 లక్షల టన్నులు పంపుతున్నామని.. దానిని 20 లక్షల టన్నులకు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ వెల్లడించారు. ‘సోమవారం 19.5 లక్షల మెట్రిక్‌ టన్నులు సరఫరా చేశాం. ఇందులో కోల్‌ ఇండియా వాటా 16 లక్షలు కాగా.. మిగతాది సింగరేణి కాలరీస్‌ సరఫరా చేసింది. భారతదేశ చరిత్రలో ఇదే అతి భారీ సరఫరా. ఈ సరఫరాలు కొనసాగుతాయి’ అని పేర్కొన్నారు. మంగళవారం బొగ్గు వేలానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

Updated Date - 2021-10-13T07:00:26+05:30 IST