అర్బన్ ఫారెస్ట్ పార్కుల నిర్వహణలో దేశంలోనే బెస్ట్

ABN , First Publish Date - 2021-10-14T01:57:18+05:30 IST

పట్టణ ప్రాంత అడవుల నిర్వహణ, సమీప నివాస ప్రాంతాలకు పర్యావరణ సమతుల్యత అందేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలాబాగున్నాయని కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ ప్రతినిధి బృందం ప్రశంసించింది.

అర్బన్ ఫారెస్ట్ పార్కుల నిర్వహణలో దేశంలోనే బెస్ట్

హైదరాబాద్: పట్టణ ప్రాంత అడవుల నిర్వహణ, సమీప నివాస ప్రాంతాలకు పర్యావరణ సమతుల్యత అందేలా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలాబాగున్నాయని కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ ప్రతినిధి బృందం ప్రశంసించింది. అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్దిలో తెలంగాణ దేశానికి నాయకత్వం (లీడర్ ఇన్ ద కంట్రీ) వహిస్తుందనటంలో సందేహం లేదని ఈ బృందం అభిప్రాయ పడింది. ఈ దిశగా అటవీ శాఖ చేస్తున్న ప్రయత్నాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించింది. తెలంగాణలో రక్షిత అటవీ ప్రాంతాలు, వాటి రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేసేందుకు కేంద్ర  బృందం ఐదు రోజుల పాటు తెలంగాణలో పర్యటించింది. రిటైర్డ్ ఐ.ఎఫ్.ఎస్ అధికారి, కర్ణాటక మాజీ పీసీసీఎఫ్బీ.కే.సింగ్ నేతృత్వంలో మరో ముగ్గురు డాక్టర్ పీకే మాథుర్, డాక్టర్ పీ.ఎస్. ఈసా, డాక్టర్ సీ. రమేశ్ ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు.  


కమిటీలో ఉన్న నలుగురు సభ్యులు రక్షిత అటవీ ప్రాంతాల నిర్వహణ, అభివృద్దిలో నిపుణులు. సంగారెడ్డి జిల్లా మంజీరా, మహబూబాబాద్ జిల్లా పాకాల అభయారణ్యంలతో పాటు హైదరాబాద్ శివారు మహావీర్ హరిణ వనస్థలి, మరికొన్ని అటవీ ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించింది. క్షేత్ర స్థాయి పర్యటన పూర్తి అయిన తర్వాత అరణ్య భవన్ లో కమిటీ సభ్యులు, అటవీ సంరక్షణ అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభతో పాటు, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. తెలంగాణ అడవులు, ముఖ్యంగా పట్టణాలు, ఆవాసాలకు సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాలను నిర్వహిస్తున్న తీరుపై పీసీసీఎఫ్ వివరించారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ది అద్భుతంగా ఉందని, రానున్న రోజుల్లో ఇవి చక్కని పర్యావరణ కేంద్రాలుగా మారుతాయని కమిటీ సభ్యులు మెచ్చుకున్నారు. రక్షిత అటవీ ప్రాంతాల నిర్వహణ కూడా బాగుందని, క్షేత్ర స్థాయి అటవీ సిబ్బంది ఉత్సాహంతో పనిచేస్తున్నందువల్ల ఫలితాలు మెరుగ్గా ఉన్నాయని అన్నారు. 


ఈ సందర్భంగా అటవీ శాఖకు కమిటీ సభ్యులు కొన్ని సూచనలు చేశారు. అభయారణ్యాలకు సమీపంలో నివసించే వారిలో పర్యావరణ అవగాహన మరింత పెంచాలని, అడవుల రక్షణలో వారిని భాగస్వామ్యం చేయాలన్నారు. మంజీరాలో పక్షుల ఆవాసాలు ఎక్కువగా పెరిగేందుకు అవకాశం ఉందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. చుట్టూ విపరీతంగా పట్టణీకరణ జరిగినా హైదరాబాద్  హరిణ వనస్థలి నిర్వహణ చాలా బాగుందని, గడ్డి మైదానాలను ఎక్కువగా పెంచాలని సూచించారు. అలాగే జంతువులు స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా అన్ని అటవీ బ్లాకులను కలుపుతూ ఎకోబ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలన్నారు. పాకాలలో మరిన్ని బేస్ క్యాంపులను ఏర్పాటు చేసి, మొబైల్ పార్టీల పర్యవేక్షణ పెంచాలని తెలిపారు. అభయారణ్యాల్లో జంతువులు, చెట్ల రకాల డేటా బేస్ ను తయారు చేయాలని, భవిష్యత్ అధ్యయనాలకు ఇవి పనికి వస్తాయని సూచించారు. 

Updated Date - 2021-10-14T01:57:18+05:30 IST