జిల్లాలో ఆరులేన్ల జాతీయ రహదారి

ABN , First Publish Date - 2022-02-24T05:12:07+05:30 IST

జిల్లాలో ఆరులైన్ల జాతీయ రహదారి (భారత్‌మాల) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి తెలిపారు.

జిల్లాలో ఆరులేన్ల జాతీయ రహదారి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి

- రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి కేంద్రం నిధులు

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి

గద్వాల, ఫిబ్రవరి 23 : జిల్లాలో ఆరులైన్ల జాతీయ రహదారి (భారత్‌మాల) నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత్‌మాల పథకం కింద రోడ్డు నిర్మా ణానికి నిధులు మంజూరు చేసిన కేంద్ర ఉపరితల, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్దికి కేంద్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదని చెప్పారు. కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రావడం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటు న్నారని, కానీ ఇప్పటి వరకు కేంద్రం తెలంగాణకు రూ.1.50 లక్షల కోట్లను ఇచ్చిందని చెప్పారు. అదే విధంగా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకోవడానికి అనుమతి ఇచ్చిందని వివరించారు. ఇవేవీ కేసీఆర్‌కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతోందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఎన్ని అబద్దాలు చెప్పిన ప్రజలు వినే పరిస్థితిలో లేరని, ఆయనకు త్వరలోనే బుద్ధి చెప్తారని అన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్ధారెడ్డి, ఎస్సీమోర్చా జిల్లా అధ్యక్షుడు జీఎల్‌ చందు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బండల వెంకట్రాములు, మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ రామాంజనేయులు, కౌన్సిలర్‌ రజక జయశ్రీ, ఐటీ సెల్‌ కన్వీనర్‌ చిత్తారి కిరణ్‌, తరుణ్‌, రజక నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.


అక్రమ కేసులు ఎత్తివేయాలి

గద్వాలక్రైం : అక్రమ కేసులను ఎత్తివేయాలని బీజేపీ నాయకులు, కార్యకర్తలు బుధవారం డీఎస్పీ రంగస్వామికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పోలీసులు అత్యుత్సాహంతో వ్యవహరిస్తూ బీజేపీ నాయకులను టార్గెట్‌ చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే ముందు రోజే నాయకులను అరెస్టు చేస్తున్నారన్నారు. మీ మీద కేసు నమోదయ్యిందని, ఆధార్‌కార్డు తీసుకు రావాలని చెప్తున్నారని, పోలీసులను ఇళ్లకు పంపించి వేధిస్తున్నారని తెలిపారు. టీఆర్‌ఎస్‌ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తే చర్యలు తీసుకోని పోలీసులు, బీజేపీ నాయకులపై మాత్రం కేసులు పెడ్తున్నారని విమర్శించారు. జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాం డ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, రజక జయశ్రీ, చందూ పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-24T05:12:07+05:30 IST