ముచ్చటగా మూడో రోజు

ABN , First Publish Date - 2020-03-27T06:01:46+05:30 IST

కరోనా కాటుకు విరుగుడుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఉద్దీపన చర్యలు దలాల్‌ స్ట్రీట్‌ వర్గాల్లో జోష్‌ పెంచాయి. ట్రేడర్ల కొనుగోళ్ల జోరుతో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

ముచ్చటగా మూడో రోజు

లాభాల పథంలో స్టాక్‌ మార్కెట్లు 

సెన్సెక్స్‌ మరో 1,410 పాయింట్లు అప్‌ 

ముంబై: కరోనా కాటుకు విరుగుడుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఉద్దీపన చర్యలు దలాల్‌ స్ట్రీట్‌ వర్గాల్లో జోష్‌ పెంచాయి. ట్రేడర్ల కొనుగోళ్ల జోరుతో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా మూడో రోజూ భారీ లాభాలు నమోదు చేసుకున్నాయి. గురువారం బీఎ్‌సఈలో ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ మరో 1,410.99 పాయింట్లు (4.94 శాతం) ఎగబాకి 29,946.77 వద్దకు చేరుకుంది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రామాణిక సూచీ నిఫ్టీ 323.60 పాయింట్లు (3.89) బలపడి 8,641.45 వద్ద స్థిరపడింది. సోమవారం  సూచీలు చరిత్రలో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. ఆ తర్వాత మూడు సెషన్లలో సెన్సెక్స్‌ 3,965.53 పాయింట్లు (15.26 శాతం), నిఫ్టీ 1,031.20 పాయింట్లు (13.55 శాతం) పెరిగాయి. గడిచిన కొన్నేళ్లలో సూచీలకిదే అత్యుత్తమ మూడ్రోజుల ర్యాలీ. ఈ 3 ట్రేడింగ్‌ సెషన్లలో మార్కెట్‌ వర్గాల సంపద రూ.11.12 లక్షల కోట్లు పెరిగింది. దాంతో బీఎ్‌సఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.1,12,99,025.06 కోట్లకు చేరుకుంది. 


కమోడిటీ ట్రేడింగ్‌ ఐదింటి వరకే.. 

కమోడిటీ డెరివేటివ్‌ ట్రేడింగ్‌ సమయాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు కుదించినట్లు బీఎ స్‌ఈ, ఎన్‌ఎ్‌సఈ ప్రకటించాయి. సవరించిన ట్రేడింగ్‌ సమయం ఈనెల 30 నుంచి ఏప్రిల్‌ 14 వరకు అమలులో ఉంటుందని ఎక్స్ఛేంజీలు తెలిపాయి. ఎంసీఎక్స్‌, ఐసీఈఎక్స్‌ కూడా ట్రేడింగ్‌ సమయాన్ని మార్చి 30 నుంచి సాయంత్రం ఐదింటికే ముగించనున్నట్లు తెలిపాయి. 


రూపాయికీ ఊరట 

ఈక్విటీలతో పాటు మన కరెన్సీ కూడా కాస్త బలం పుంజుకుంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు మరో 78 పైసలు బలపడి 75.16గా నమోదైంది. కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పలు చర్యలు ప్రకటించడం రూపాయి బలోపేతానికి దోహదపడింది. 

Updated Date - 2020-03-27T06:01:46+05:30 IST