చట్టబద్ధ ధరలతో లాభసాటి సాగు

ABN , First Publish Date - 2021-01-08T06:18:12+05:30 IST

వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ సిఫారసు చేసే మద్దతు ధరలను ప్రభుత్వం ఆమోదిస్తున్నా, వాటికి చట్టబద్ధత కల్పించడం లేదు. చట్టబద్ధత ఉంటే ఎవరు కొన్నా ఆయా పంటలకు నిర్దేశిత కనీస మద్దతు...

చట్టబద్ధ ధరలతో లాభసాటి సాగు

వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ సిఫారసు చేసే మద్దతు ధరలను ప్రభుత్వం ఆమోదిస్తున్నా, వాటికి చట్టబద్ధత కల్పించడం లేదు. చట్టబద్ధత ఉంటే ఎవరు కొన్నా ఆయా పంటలకు నిర్దేశిత కనీస మద్దతు ధర చెల్లించవలసి ఉంటుంది. కనీస ఆదాయానికి గ్యారంటీ వస్తుంది. అందుకే ఇప్పుడు కేంద్రప్రభుత్వం ప్రకటిస్తున్న విధంగా కాకుండా, స్వామినాథన్ సిఫారసు ప్రకారం మద్దతు ధరలను ప్రకటించి, వాటికి చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు గట్టిగా కోరుతున్నాయి.


రైతుసంఘాల నాయకులకు, కేంద్రప్రభుత్వ ప్రతినిధులకు మధ్య జనవరి 4న జరిగిన 7వ విడత చర్చలు కూడా విఫలం అయ్యాయి. జనవరి 8న మరోసారి చర్చలు జరగనున్నాయి. కొత్తగా తీసుకువచ్చిన మూడు వ్యవసాయచట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో పాటు, కనీస మద్దతు ధరలకు (ఎమ్‌ఎస్‌పి) చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్‌పై కూడా నేడు చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఈ అంశంపై ఎందుకింత పట్టుదలగా ఉన్నారు అనే విషయం లోతుగా అర్థం చేసుకోవాలి. 


2020–-21 ఆర్థిక సంవత్సరంలో కేంద్రప్రభుత్వం 16 వానాకాలం పంటలకు, 6 యాసంగి పంటలకు ఎమ్ఎస్‌పి ప్రకటించింది. సాధారణంగా జాతీయస్థాయిలో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయశాఖ కింద పని చేసే ‘వ్యవసాయ ఖర్చుల, ధరల కమిషన్’ (కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్-– సిఏసిపి) అన్ని రాష్ట్రాల నుంచి సేకరించిన పంటల ఉత్పత్తి ఖర్చులను సగటు చేసి, కొంత లాభాన్ని కలిపి ఎమ్ఎస్‌పిని సిఫారసు చేస్తుంది. రైతు నేరుగా ఆయా సందర్భాలలో చేసే ఖర్చులను (ఎ2), రైతు కుటుంబ సభ్యుల శ్రమను (ఫ్యామిలీ లేబర్-– ఎఫ్ఎల్) కూడి, దానికి కొంత లాభాన్ని కలిపి (ఎ2+ ఎఫ్‌ఎల్+ లాభం ఫార్ములాతో) కనీస మద్దతు ధరలను సిఫారసు చేయడం ఆనవాయితీగా వస్తోంది. 


రైతుల ఆదాయం పెరగాలంటే పంటల సాగుకు వారు పెట్టే మూలపెట్టుబడి (భూమి విలువ, సాగునీటి వనరులు, పొలంలో షెడ్లు, యంత్రాల కొనుగోలు ఇత్యాదులు)ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని, అప్పుడే అది సమగ్ర ఉత్పత్తి ఖర్చు (సి2) అవుతుందని, దానికి 50 శాతం లాభం కలిపి మద్దతు ధరలు ప్రకటించాలని 2007లో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎమ్‌ఎస్ స్వామినాథన్ నేతృత్వంలోని ‘జాతీయ వ్యవసాయ కమిషన్’ సిఫారసు చేసింది. దీనినే రైతులు ‘స్వామినాథన్ సిఫారసు’ అంటారు. రైతు లోకంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ సిఫారసు అప్పటి నుంచీ రైతుసంఘాల డిమాండ్‌గా మారింది. స్వామినాథన్ చెప్పినదేమీ వాస్తవానికి కొత్తది కాదు. పారిశ్రామిక, సేవా రంగాలలో మొదటి నుంచీ అమలులో ఉన్నదే. ఏ పెట్టుబడిదారు అయినా తాను పెట్టిన పెట్టుబడిని కూడా ఉత్పత్తి ఖర్చులో లెక్కించి ఆయా ఉత్పత్తులకు ధరలను నిర్ణయిస్తాడు కదా. 


2014 సార్వత్రక ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ మానిఫెస్టోలోనూ, ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ ప్రచారంలోనూ, తాము అధికారం లోకి వస్తే స్వామినాథన్ సిఫారసు ప్రకారం వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతుధరలు ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు నమ్మి ఓట్లు వేశారు. కానీ రెండేళ్ళు గడిచేసరికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మాట మార్చింది. ఇచ్చిన హామీకి భిన్నంగా, సమగ్ర ఉత్పత్తి ఖర్చు (సి2)కు 50 శాతం కలిపి కాకుండా ఎ2కు కుటుంబసభ్యుల శ్రమ, కొంత లాభం కలిపి ఎమ్ఎస్‌పి ప్రకటించడం ప్రారంభించింది. పైగా ఈ ప్రకటించిన ఎమ్ఎస్‌పికి చట్టబద్ధత లేకపోవడం వల్ల, ప్రభుత్వాలు ఆయా పంటలను సేకరించిన సందర్భంలో తప్ప, వ్యాపారులు ఎవరూ ఎమ్‌ఎస్‌పిని చెల్లించి రైతుల నుంచి పంటలను కొనడం లేదు. చివరికి ప్రభుత్వ మార్కెట్‌యార్డులలో కూడా రైతులకు, వ్యాపారులు ఎమ్‌ఎస్‌పి చెల్లించకపోయినా, అధికారులు కానీ, మార్కెట్‌యార్డ్ పాలకమండలి గానీ పట్టించుకోవడం లేదు. అందుకే రైతు సంఘాలు అంత పట్టుదలగా ఎమ్ఎస్‌పికి చట్టబద్ధత ఉండాలని కోరుతున్నాయి.


ఉద్యోగులు, కార్మికులకు యాజమాన్యాలు; చట్టసభల సభ్యులకు ప్రభుత్వాలు నిర్దిష్ట వేతనభత్యాలు చెల్లిస్తామని వాగ్దానం చేయడం పరిపాటి. మరి వాగ్దాన భంగం జరిగితే ఉద్యోగులు, కార్మికులు, శాసనసభ్యులకు ఎంత బాధ, కోపం కలుగుతాయో, రైతులకు కూడా ఇచ్చిన హామీ మేరకు మద్దతు ధర కచ్చితంగా అందకపోతే అంతే బాధ, కోపం కలుగుతాయి, కలుగుతున్నాయి కూడా. తత్ఫలితమే ప్రస్తుత ఆందోళన. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు వేతన కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ కమిషన్ కొత్త వేతనభత్యాలు సిఫారసు చేస్తాయి. వాటిని ప్రభుత్వాలు ఆమోదించి అమలు చేయడానికి పూనుకుంటాయి. నిర్దిష్ట కాలపరిమితిలో కార్మికుల కోసం ప్రభుత్వాలు కనీస వేతనాలు నిర్ణయించి జీవోలు విడుదల చేశాక, చివరికి ప్రైవేట్ సంస్థలు వాటిని అమలు చేయకపోతే ఆయా రంగాల కార్మికులు కోర్టుకు, లేబర్ డిపార్ట్‌మెంట్ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. 


అయితే వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ సిఫారసు చేసే మద్దతు ధరలను ప్రభుత్వం ఆమోదిస్తున్నా, వాటికి చట్టబద్ధత కల్పించడం లేదు. ఆ ధరలు అందకపోతే రైతులు కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. ఒక వేళ రైతులు కోరుతున్నట్లుగా చట్టబద్ధత కల్పించడం జరిగితే ప్రభుత్వం కొన్నా, వ్యాపారులు కొన్నా, కంపెనీలు కొన్నా తప్పకుండా ఆయా పంటలకు కనీసమద్దతు ధర చెల్లించవలసి ఉంటుంది. అప్పుడు కోర్టులను ఆశ్రయించే హక్కు రైతులకు లభిస్తుంది. కనీస ఆదాయానికి గ్యారంటీ వస్తుంది. అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్న ఫార్ములా ప్రకారం కాకుండా, స్వామినాథన్ సిఫారసు ప్రకారం మద్దతు ధరలను ప్రకటించి, వాటికి చట్టబద్ధత కల్పించాలని రైతు సంఘాలు గట్టిగా కోరుతున్నాయి. 


వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ సాధారణంగా ఉత్పత్తి ఖర్చులను ఆయా రాష్ట్రాలలో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాల తోడ్పాటుతో సేకరిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 13వేల గ్రామాలు ఉంటే కేవలం 30 గ్రామాలలో మాత్రమే ఉత్పత్తి ఖర్చులను సేకరిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అంతే. తెలంగాణ రాష్ట్రంలో కనీసం 30-–40 పంటలు పండించే రైతులు ‘రైతు బంధు’ లెక్కల ప్రకారం 60,95,134 మంది ఉంటే; కేవలం 10 పంటలకు 300 మంది రైతులనుండి మాత్రమే సమాచారం సేకరిస్తారు. పైగా 2020---–21 ఆర్థిక సంవత్సరానికి మద్దతు ధరలను అంతకు ముందటి మూడు సంవత్సరాల (2015-–18) ఖర్చులకు (వ్యవసాయ ఉపకరణాల ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని) కొంతమొత్తాన్ని కలిపి నిర్ణయిస్తారు. రైతుకు అయ్యే వాస్తవ ఖర్చులను అసలు పట్టించుకోవడం లేదని, సిఏసిపి సేకరించిన ఖర్చులను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. 


సరే, సి‌ఏ‌సి‌పి ప్రస్తుతం ఉత్పత్తి ఖర్చుల లెక్కింపులో చేస్తున్న అన్యాయాన్ని మరెప్పుడైనా వివరంగా మాట్లాడు కుందాం. ఇప్పుడు రైతు కుటుంబసభ్యుల శ్రమకు కడుతున్న విలువను చూస్తే ఎవరికైనా గుండె మండిపోతుంది. ఆయా పంటలను బట్టి పంట కాలం సగటున 4 నెలల నుంచి 8 నెలల వరకు ఉంటుంది. ఈ కాలంలో రైతు కుటుంబసభ్యులు ఒకరిద్దరు తప్పకుండా పొలానికి వెళ్ళి పని చేస్తారు. మగవాళ్ళ కూలీ రూ.500, ఆడవాళ్ళ కూలీ రూ.300 ఉన్న ఈ రోజుల్లో రైతు కుటుంబసభ్యుల శ్రమకు సీజన్ మొత్తానికి సి‌ఏ‌సిపి కట్టిన విలువ ఎకరానికి – వరి పంటకు 3728 రూపాయలు, జొన్నకు రూ.3031, మొక్కజొన్నకు రూ.2778, కందికి రూ.2354, పెసరకు రూ.1316, మినుముకు రూ.725, వేరుశనగకు రూ.2969, సోయాబీన్‌కు రూ.1951, నువ్వులకు రూ.1216, పత్తికి రూ.3116 మాత్రమే. దీనిని రోజుల్లోకి భాగించి చూస్తే, అసలు ఈ ప్రభుత్వాలు రైతు కుటుంబాల సభ్యుల శ్రమకు విలువ ఇస్తున్నాయా అనే సందేహం తప్పక కలుగుతుంది. 


మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యవసాయశాఖ ద్వారా, ఉత్పత్తి ఖర్చులను సేకరిస్తాయి. సి‌ఏ‌సి‌పి కోసం వ్యవసాయ విశ్వవిద్యాలయం సేకరించే ఉత్పత్తి ఖర్చులకు, రాష్ట్ర వ్యవసాయశాఖ లెక్కించే ఉత్పత్తి ఖర్చులకు ఎక్కడా పొంతన కనపడదు. పైగా సగటు దిగుబడుల విషయంలో కూడా తీవ్ర వ్యత్యాసాలు ఉంటున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ సేకరించిన ఖర్చులను, మద్దతు ధరలను నిర్ణయించడంలో సిఏసిపి ఏమాత్రం పరిగణనలో తీసుకోదు. అన్ని రాష్ట్రాలలో తాను సేకరించిన ఖర్చులను, జాతీయ సగటు చేసి, మద్దతు ధరలను ప్రకటిస్తుంది. ఫలితంగా అన్ని పంటలలో ఉత్పత్తి ఖర్చులు భారీగా ఉండే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రైతులకు ఏమాత్రం లాభం ఉండడం లేదు. 


భారత రాజ్యాంగం 7వ షెడ్యూల్‌లోని రాష్ట్ర జాబితాలోని అంశాలపై సంపూర్ణ నిర్ణయాధికారం రాష్ట్రాలకే ఉంటుంది. మరి వ్యవసాయరంగం రాష్ట్ర జాబితాలోని అంశమే. ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి వ్యవసాయంతో సహా ఆ జాబితాలోని సకల అంశాలపై నిర్ణయాలు తీసుకునే సంపూర్ణ స్వేచ్ఛ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి కేంద్రం చొరబడి, తనకు లేని అధికారాలను చెలాయించి మూడు కొత్త సాగుచట్టాలను తీసుకువచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, తమ మీద భారం తప్పిపోయినందుకు మనసులో సంతోషిస్తూ, ఆత్మగౌరవం కూడా వదిలేసుకుని కేంద్ర ప్రభుత్వం ముందు సాష్టాంగ పడుతున్నాయి.


రైతుసంఘాల డిమాండ్ మేరకు కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి, ఒక నమూనా చట్టం రూపొందించినా, నిజానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే ఎం‌ఎస్‌పికి చట్ట బద్ధత కల్పిస్తూ తమ శాసనసభల్లో చట్టాలు చేయవలసి ఉంటుంది. ఆ సందర్భంలో తమ రాష్ట్రాలలో ఉండే ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవచ్చు. మద్దతు ధరలు అదనంగా నిర్ణయించవచ్చు. లేదా రైతులకు ఇతర రూపాలలో సహాయం అందించవచ్చు. లేదా పంటల ఉత్పత్తి ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నం చేయవచ్చు. రాష్ట్రంలో పండే అన్ని వ్యవసాయ, అనుబంధ రంగాల ఉత్పత్తులకు శాస్త్రీయంగా ఉత్పత్తి ఖర్చులను లెక్కించి, మద్దతు ధరలను ప్రకటించవచ్చు. అప్పుడే రైతులకు నిజమైన లాభం జరుగుతుంది. 


-కన్నెగంటి రవి

రైతు స్వరాజ్య వేదిక

Updated Date - 2021-01-08T06:18:12+05:30 IST