ప్రాజెక్టుల అప్పగింత ఇప్పుడే కాదు!

ABN , First Publish Date - 2021-10-14T07:48:13+05:30 IST

కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ గురువారం అమల్లోకి రానున్నా.. కృష్ణా, గోదావరి నదులపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని..

ప్రాజెక్టుల అప్పగింత ఇప్పుడే కాదు!

  • బోర్డులకు అప్పగించే విషయంపై అధ్యయనం చేయాలని తెలంగాణ నిర్ణయం
  • కమిటీని నియమించిన సీఎం కేసీఆర్‌
  • 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశం
  • నివేదిక అందాకే అప్పగింతపై నిర్ణయం
  • ప్రాజెక్టులు అప్పగించాలంటూ తీర్మానాలు
  • రెండు రాష్ట్రాలకు పంపిన బోర్డులు
  • నేడు ఉత్తర్వులు జారీ చేస్తామన్న ఏపీ
  • తెలంగాణ నిర్ణయంతో ఉత్తర్వులపై అనుమానం
  • జూరాల లేకుండా ప్రాజెక్టులు స్వాధీనమేంటి?
  • జలవనరుల నిపుణుల సందేహాలు

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ గురువారం అమల్లోకి రానున్నా.. కృష్ణా, గోదావరి నదులపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు ఆయా బోర్డుల చేతికి ఇప్పట్లో వెళ్లేలా కనిపించడంలేదు. ప్రాజెక్టులను అప్పగించాలా, వద్దా అనే అంశంపై అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడమే ఇందుకు కారణం. గెజిట్‌ అమల్లో భాగంగా ప్రాజెక్టులను తమకు అప్పగించాలంటూ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ).. రెండు తెలుగు రాష్ట్రాలకు బుధవారమే తీర్మానాలు పంపించింది. తాము స్వాధీనం చేసుకోబోయే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులపై ఉన్న కాంపోనెంట్లు, జలవిద్యుత్‌ కేంద్రాల జాబితాను కృష్ణా బోర్డు పంపించగా, పెద్దవాగు ప్రాజెక్టును అప్పగించాలంటూ గోదావరి బోర్డు పేర్కొంది. కృష్ణా బోర్డు తీర్మానానికి అనుగుణంగా తాము గురువారం ఉత్తర్వులు జారీ చేస్తామని ఏపీ ప్రకటించింది.


అయితే తెలంగాణ అప్పగించాకే చూద్దామనే భావనలో ఏపీ ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈలోగానే.. ప్రాజెక్టులను అప్పగించాలా, వద్దా అనే దానిపై అధ్యయనం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అధ్యయనం కోసం సీఎం కేసీఆర్‌సాంకేతిక, న్యాయనిపుణులతో బుధవారం కమిటీని నియమించారు. నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్‌రావు నేతృత్వంలోని ఈ కమిటీలో ఆ శాఖకు చెందిన నిపుణులతోపాటు న్యాయ నిపుణులు, విద్యుత్‌ అధికారులు ఉంటారు. ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడం వల్ల రాష్ట్రానికి నష్టమేమైనా జరుగుతుందా.. అనే అంశంపై అధ్యయనం చేసి 15 రోజుల్లోగా నివేదిక అందించాలని కమిటీని ముఖ్యమంత్రి ఆదేశించారు. 


జలవిద్యుత్‌ కేంద్రాలపై ప్రధానంగా అభ్యంతరం

కృష్ణా బేసిన్‌లో ప్రధానంగా శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రంతోపాటు నాగార్జునసాగర్‌లోని రెండు జలవిద్యుత్‌ కేంద్రాలను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపైనే తెలంగాణకు ప్రధానంగా అభ్యంతరం ఉంది. జలవిద్యుత్‌ కేంద్రాలు చేజారితే సమస్యలు తప్పవనే భావనతో ఉంది. దీంతోపాటు నీటిపారుదల ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడం వల్ల ప్రస్తుతానికి నష్టాలేవీ లేనప్పటికీ.. భవిష్యతులో సమస్యలు వస్తాయని ఆందోళన చెందుతోంది. గోదావరిలో ఉమ్మడి ప్రాజెక్టు అయిన పెద్దవాగు(గుమ్మడివాగు)ను బోర్డు పరిధిలోకి తేవడానికి తెలంగాణ తొలుత సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి బోర్డు తీర్మానం కూడా అందినప్పటికీ ఉత్తర్వులు మాత్రం విడుదల కాలేదు. ఈ అంశాలపై అధ్యయనం తర్వాతే తెలంగాణ విధాన నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు కృష్టా ప్రాజెక్టులను అప్పగించేందుకు ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధపడ్డ ఏపీ సర్కారు కూడా గోదావరి ప్రాజెక్టులను అప్పగించే విషయంలో సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ప్రాజెక్టుల స్వాధీనానికి సంబంధించి ఇప్పటికే సమావేశాలు నిర్వహించి తీర్మానాలు చేసిన కృష్ణా, గోదావరి బోర్డులు బుధవారం సాయంత్రం రెండు రాష్ట్రాలకు తీర్మానాలను పంపించాయి. ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేస్తే తమ యంత్రాంగం ఆయా ప్రాజెక్టులు, జలవిద్యుత్‌ కేంద్రాల వద్దకు చేరుకుంటుందని పేర్కొన్నాయి. వాటిని అప్పగించాక.. మూడునెలలపాటు యథాతథస్థితి ఉంటుందని, ఆ తర్వాతే క్రమంగా ఒక్కో ప్రాజెక్టును పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకుంటామని ఇప్పటికే కృష్ణా బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ప్రభుత్వాలు అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చేదాకా బోర్డుల పరిధిలోకి ఆయా ప్రాజెక్టులు వెళ్లే అవకాశాల్లేవు. 


Updated Date - 2021-10-14T07:48:13+05:30 IST