వ్యవసాయోత్పత్తుల రవాణాల్లో.. కేంద్ర మార్గదర్శకాలు అమలు చేస్తున్నారా?

ABN , First Publish Date - 2020-04-08T09:42:42+05:30 IST

లాక్‌డౌన్‌ సందర్భంగా వ్యవసాయోత్పత్తుల తరలింపు, విక్రయాలు, వ్యవసాయ కూలీల పనుల్ని ఆటంకపరచరాదంటూ కేంద్రప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఎలా అమలు చేస్తున్నారో తెలపాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

వ్యవసాయోత్పత్తుల రవాణాల్లో.. కేంద్ర మార్గదర్శకాలు అమలు చేస్తున్నారా?

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న


అమరావతి, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ సందర్భంగా వ్యవసాయోత్పత్తుల తరలింపు, విక్రయాలు, వ్యవసాయ కూలీల పనుల్ని ఆటంకపరచరాదంటూ కేంద్రప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఎలా అమలు చేస్తున్నారో తెలపాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.


పుచ్చ, మామిడి తదితర పంటల ఉత్పత్తులు చేతికొచ్చే కాలమైనందున రైతులు నష్టపోకుండా లాక్‌డౌన్‌ సందర్భంగా కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేలా ఆదేశించాలని అభ్యర్థిస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. మంగళవారం దీనిపై ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపింది.


ఈ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది అంబటి సుధాకర్‌రావు వాదనలు వినిపిస్తూ.. వ్యవసాయోత్పత్తుల్ని వెంటనే విక్రయించని పక్షంలో అవి పాడైపోతాయని, తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. అందువల్ల కేంద్రమార్గదర్శకాల మేరకు రైతులు, కూలీల పనులకు అవాంతరాలు కలుగకుండా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. ఆయన వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. 


Updated Date - 2020-04-08T09:42:42+05:30 IST