రూ1.7 లక్షల కోట్లు..కేంద్ర ప్రభుత్వ భారీ ఆర్థిక ప్యాకేజీ

ABN , First Publish Date - 2020-03-27T07:12:23+05:30 IST

కరోనా దెబ్బకు సర్వం కోల్పోతున్న పేద, మధ్య తరగతి ప్రజానీకాన్ని ఆదుకునేందుకు కేంద్రం భారీ ఆర్థిక సహాయాన్ని...

రూ1.7 లక్షల కోట్లు..కేంద్ర ప్రభుత్వ భారీ ఆర్థిక ప్యాకేజీ

  • లాక్‌డౌన్‌లో పేదలు, చిరుద్యోగులకు వరం
  • పారిశుద్ధ్య, వైద్య సిబ్బందికి 50 లక్షల బీమా
  • ఒక్కొక్కరికీ నెలకు 5 కేజీల బియ్యం అదనం
  • కుటుంబానికి కిలో చొప్పున పప్పులు కూడా
  • వృద్ధులు, వితంతు, వికలాంగులకు మరో వెయ్యి
  • జన్‌ధన్‌ ఖాతాదారులైన మహిళలకు రూ.500
  • ‘ఉజ్వల’ కింద ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు
  • మూడు నెలలపాటు నిరుపేదలకు పంపిణీ
  • ఎస్‌హెచ్‌జీల రుణ పరిమితి 10 లక్షలకు పెంపు
  • దేశవ్యాప్తంగా 20 కోట్ల మంది మహిళలకు మేలు
  • ఉపాధి హామీ వేతనం ఇక నుంచి రూ.202
  • రూ.15 వేలలోపు చిరుద్యోగుల ఈపీఎఫ్‌ కేంద్రమే 
  • చెల్లిస్తుంది.. ఉద్యోగి, యజమాని వాటా కూడా
  • 100లోపు ఉద్యోగులున్న సంస్థలకు మాత్రమే
  • ఉద్యోగులకు ఈపీఎఫ్‌ భారీ ఊరట
  • 3 నెలల జీతం లేదా 75శాతం పీఎఫ్‌ ఉపసంహరణ
  • ఆకలి, ఖాళీ జేబులతో దేశంలో ఎవరూ ఉండొద్దు
  • మొత్తంమీద 80 కోట్ల మందికి లబ్ధి: నిర్మల
  • కిసాన్‌ సమ్మాన్‌ నిధులు ఏప్రిల్‌ మొదటి వారంలో


దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో, ఖాళీ జేబులతో ఉండకూడదు. అందుకే, వలస కార్మికులు, పట్టణ, గ్రామీణ పేదలను ఆదుకునేలా ప్యాకేజీ రూపొందించాం. పేద కార్మికులను ఆదుకోవడంపైనే ప్రధానంగా దృష్టిసారించాం. ప్రస్తుత సంక్షోభ సమయంలో సమాజంలోని నిమ్న వర్గాలకు నగదు గానీ, నిత్యావసరాలు గానీ కొరత రాకుండా చేయడమే దీని ఉద్దేశం. ఈ ప్యాకేజీ ద్వారా దేశంలోని 80 కోట్ల మందికి సాయం అందుతుంది’’ 

- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల


న్యూఢిల్లీ, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): కరోనా దెబ్బకు సర్వం కోల్పోతున్న పేద, మధ్య తరగతి ప్రజానీకాన్ని ఆదుకునేందుకు కేంద్రం భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ‘ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన’ (పీఎంజీకేఏవై) పేరిట  1,70,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారంనాడు ప్రకటించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో సమాజంలోని నిమ్నవర్గాలకు నగదు, నిత్యావసరాల కొరత రాకుండా చేయడమే దీని ఉద్దేశమని చెబుతూ.. ఇందులో ప్రత్యక్ష నగదు బదిలీతో పాటు ఆహార భద్రత కూడా ఉంటుందని ఆమె చెప్పారు. ‘వలస కార్మికులు, రోజువారీ కూలీలు ప్రధాన లబ్ధిదారులు. పట్టణ ప్రాంత పేద ప్రజానీకానికీ అన్నీ అందిస్తాం. ఆహారం, రోజువారీ అవసరాలు తీరుస్తాం.


దేశంలో ఎవ్వరూ ఆకలితో, ఖాళీ జేబులతో లేకుండా చూడడమే లక్ష్యం. అందుకే ఈ ఊరట. దీని ద్వారా దేశంలోని 80 కోట్ల మందికి సాయం అందుతుంది’’ అని కరోనాపై ఏర్పాటైన కార్యదళానికి నేతృత్వం వహిస్తున్న నిర్మల వెల్లడించారు. వీరితో పాటు వేతన వర్గాలకు కూడా ఉపశమనం కల్పిస్తూ-- 75 శాతం పీఎ్‌ఫను విత్‌డ్రా చేసుకునేందుకు వెసులుబాటునిచ్చారు. దీని వల్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో పనిచేసే లక్షల మందికి, రోజువారీ కూలీలకు (అసంఘటిత రంగ కార్మికులకు) సహాయం అందుతుందని నిర్మల చెప్పారు.


పీఎంజీకేవై ద్వారా ఏం అందిస్తారు?

  • 3 నెలల పాటు అదనంగా 5 కిలోల బియ్యం లేదా గోధుమలు. ఇది ఇప్పటికే ఇస్తున్న రేషన్‌కు అదనం
  • ప్రతీ పేద ఇంట్లోని వారికీ తలకు 1 కిలో చొప్పున ప్రతీ నెలా పప్పుదినుసులు
  • కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి 3 నెలలపాటు ఒక్కొక్కరికీ 50 లక్షల ఆరోగ్య బీమా. పారిశుద్ధ్య సిబ్బంది, వార్డు బాయ్‌లు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, ల్యాబ్‌ టెక్నీషియన్లు, డాక్టర్లు, స్పెషలిస్టులు, ఇతర వైద్య సిబ్బంది దీని కిందకు వస్తారు. 

నగదు బదిలీ

  • ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద 8.69 కోట్ల రైతులకు ఇచ్చే తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌ రూ 2000 నగదు ను ఏప్రిల్‌ మొదటివారంలోగా వారి ఖాతాల్లో వేసేస్తారు
  • నరేగా కింద ఇచ్చే వేతనానికి అదనంగా ప్రతీ కార్మికుడికీ రూ 2000 నగదు. దీని ద్వారా 5 కోట్ల కుటుంబాలకు లబ్ధి. దీనితో పాటు నరేగా కింద ఇస్తున్న వేతనాన్ని కేంద్రం రూ 182 నుంచి రూ 202కు పెంచింది.
  • వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు 3 నెలల పాటు అదనంగా రూ 1000 నగదు
  • జన ధన్‌ యోజన కింద 20 కోట్ల మంది మహిళలకు 3 నెలల పాటు అదనంగా రూ 500
  • ఉజ్వల కింద 3 నెలల పాటు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు
  • దీన్‌ దయాళ్‌ ఉపాఽధ్యాయ జాతీయ గ్రామీణ పథకం కింద దేశంలోని 63 లక్షల స్వయం సహాయ బృందాలకు రూ 10 లక్షల మేర రుణాలు.. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న రుణ పరిమితి రూ 20 లక్షలకు పెంపు. దీని ద్వారా 7 కోట్ల కుటుంబాలకు లబ్ధి. 
  • దేశంలో ఉన్న 3.5 కోట్ల మంది నిర్మాణ రంగ కూలీలు, కార్మికులకు రూ 31,000 కోట్ల రూపాయల నిధులు, సౌకర్యాలు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి

వేతన జీవులకూ ఊరట

  • 3 నెలల పాటు వేతన ఉద్యోగులు, వారి యాజమాన్యాలు ఇద్దరి భవిష్యనిధి వాటానూ కేంద్రమే భరిస్తుంది. ఈ సౌకర్యం కేవలం 100మంది ఉద్యోగులున్న, అందులో 90 శాతంమంది రూ 15,000 మాత్రమే ఆదాయం పొందుతున్న సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. 4.8 కోట్ల మంది వేతన జీవులు దీని ద్వారా లాభపడతారు.


ఈపీఎఫ్‌

  • భవిష్య నిధి ఖాతాల నుంచి ఉద్యోగులు 75 శాతం నాన్‌-రిఫండబుల్‌ అడ్వాన్స్‌ లేదా 3 నెలల జీతం (ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది) తీసుకునే వీలు.

Updated Date - 2020-03-27T07:12:23+05:30 IST