సొంత మంత్రినే ఒప్పించలేనప్పుడు.. వారినెలా ఒప్పిస్తారు?: పైలట్

ABN , First Publish Date - 2020-09-27T00:59:33+05:30 IST

కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్...

సొంత మంత్రినే ఒప్పించలేనప్పుడు.. వారినెలా ఒప్పిస్తారు?: పైలట్

జైపూర్: కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందని రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆరోపించారు. ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై సొంత మంత్రినే ఒప్పించలేనప్పుడు.. రైతులను ఎలా శాంతింప చేస్తారని ఆయన ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రవేశపెట్టిన మూడు బిల్లులను వెంటనే వెనక్కి తీసుకోవాలని సచిన్ పైలట్ డిమాండ్ చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం తన తప్పును గుర్తించి బిల్లులను వెనక్కి తీసుకోవాలి. ఈ బిల్లులను ఆమోదింపచేసుకున్న తీరు రాజ్యసభపై అప్రజాస్వామిక ముద్ర వేసింది. అందుకే ఇప్పుడు దేశంలో అసమ్మతి గళం చెలరేగుతోంది..’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై కేంద్ర కేబినెట్‌ నుంచి ఓ మంత్రి సైతం రాజీనామా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ‘‘సొంత మంత్రినే ఒప్పించలేని వాళ్లు రైతులను ఎలా ఒప్పించగలుగుతారు. బీజేపీ తమను మోసగించిందన్న విషయం రైతులకు స్పష్టంగా తెలుసు. కాంగ్రెస్ ఎప్పటికీ రైతుల పక్షానే నిలుస్తుంది...’’ అని పైలట్ పేర్కొన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ పక్కకు వెళ్లిపోయిందనీ.. రైతులు ఇప్పుడు మరింత నష్టపోయారని ఆయన అన్నారు. కనీసం రాష్ట్రాలు, రైతులను సంప్రదించకుండా హడావిడిగా వ్యవసాయ బిల్లులను తీసుకు వచ్చారన్నారు. పెట్టుబడులు, సంస్కరణలు అవసరమని తాము కూడా చెబుతున్నామనీ.. అయితే కేంద్రం తీసుకొచ్చిన బిల్లులు రైతు వ్యతిరేక, దేశ వ్యతిరేక బిల్లులని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-27T00:59:33+05:30 IST