రైతుల ఆకాంక్షలు ఫలించాలి

ABN , First Publish Date - 2021-01-09T06:11:38+05:30 IST

సంక్షేమాన్ని రైతుల వైపు నుంచి చూడదలచుకున్నారో లేక కార్పొరేట్ల వైపు నుంచి చూడదలచుకున్నారో కేంద్ర పాలకులు స్పష్టం చెయ్యాలి. బలహీనవర్గాల చిన్న రైతుల సాధికారతే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను సమీక్షించుకోవల్సిన...

రైతుల ఆకాంక్షలు ఫలించాలి

సంక్షేమాన్ని రైతుల వైపు నుంచి చూడదలచుకున్నారో లేక కార్పొరేట్ల వైపు నుంచి చూడదలచుకున్నారో కేంద్ర పాలకులు స్పష్టం చెయ్యాలి. బలహీనవర్గాల చిన్న రైతుల సాధికారతే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను సమీక్షించుకోవల్సిన అవసరం ఉంది. భారతదేశ సుక్షేత్రంలో కంకుల వెన్నులై నిలిచిన రైతులను దేశ ఆహార ఉత్పత్తి వ్యవస్థలకు వెన్నెముకగా నిలుపుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఉంది.


ఇప్పటికి 45 రోజులకు (నవంబర్‌ 26, 2020 నుంచి) పైబడి చలిలో ఢిల్లీ చుట్టూతా, ఢిల్లీ శివార్లలోని జాతీయ రహదార్లపై రైతుల నిరవధిక ఆందోళన స్వచ్ఛందంగా కొనసాగుతోంది. గడ్డకట్టే  చలిని లెక్క చెయ్యకుండా, కొవిడ్‌ జాగ్రత్తలతో శాంతియుతంగా రైతుల పోరాటం కొనసాగుతున్నది.


ఆదిమ సమాజంలో ఆకులలములు, కాయకసరులు ఏరుకు తిన్న దశ నుంచి మానవ సమాజం క్రమంగా నాగలి వ్యవసాయం, పోడు వ్యవసాయం, స్థిర వ్యవసాయం, పంటల మార్పిడి వ్యవసాయం దాకా వచ్చింది. పంటల్లో మిగులున్నా, లేకున్నా వస్తుసేవలు, వృత్తి సేవలకు గింజలు మార్పిడి చేసుకుంటూ వచ్చింది. పంటల మిగులు ప్రారంభమయ్యాక పాతర్లలో, గుమ్ముల్లో, వాముల్లో, కుప్పల్లో నిలవ ఉంచుకోవడం, మిగిలితే కోమట్లకు చౌకగా పోసి నిత్యావసర వస్తువులు, సరుకులు తెచ్చుకోవడం జరిగేది. ఇంకా మిగిలివుంటే రైతులు దీర్ఘకాలం మిగులు పంటల్ని నిలవబెట్టుకోలేరు గనక, ఎదురైన (మార్కెట్‌) వ్యాపారులకు ఎంతకో అంతకి తెగనమ్ముకునేవారు! సాంప్రదాయిక వ్యవసాయంలో ఇదొక దశ. భారతదేశంలో ఇది సస్య విప్లవానికి (1965-–70 నాటికి) ముందు దశగా చెప్పుకోవచ్చు. ఈ దశలో ధాన్య వ్యాపారం షావుకార్లని, మిల్లుల్ని దాటి భారీ ఎగుమతుల దశకు పోలేదని చెప్పుకోవచ్చు.


ఆహారధాన్యాల కొరత ఉన్నా, కొన్ని ప్రాకృతికమైన మేళ్ళు కూడా జరిగాయి. జొన్నలు, సజ్జలు, రాగులు, వరిగెలు, కొర్రలు, ఆరిగెలు, సామలు, ఉలవలు, అలసందలు, పిల్లిపెసర్లు మొదలైన దేశవాళీ చిరుధాన్యాలు మన ఆహారంలో చాలా ముఖ్యపాత్ర పోషించాయి. వ్యవసాయంలో పశువుల పాత్ర నిండుగా ఉండేది. మెండుగా పాడి ఉండేది. పశువుల పేడ, మేకల, గొర్రెల పెంటికలు, పంది౅ పెంట కసువులను పొలాలకు ఎరువుగా వాడేవారు. సాంప్రదాయిక పద్ధతుల్లో బలమైన గింజలను నిలవ ఉంచి, పంటలకు నారు గింజలుగా వాడేవారు. 


వ్యవసాయంలో అసలు విపత్తులు ట్రాక్టర్ల ప్రవేశంతో మొదలయ్యాయి. డెబ్బై నుంచి ఎనభై శాతం పశుసంపదంతా కబేళాలకు తరలిపోయింది! పశుజాతి నిర్మూలన మొదట జరిగింది. వరి, గోధుమ, పత్తి, పొగాకు పంటలు వచ్చాయి. జన్యుపరంగా మార్పుచేసిన అధిక దిగుబడి విత్తనాలు, వంగడాలు వచ్చేశాయి. కల్తీ విత్తనాలూ వచ్చేశాయి. చిరుధాన్యాల సాగు ముతకైపోయింది. కృత్రిమ రసాయనిక ఎరువులు, పురుగు మందులూ ప్రవేశించాయి. సాగులోకి లాభనష్టాలు ప్రవేశించాయి. అప్పటివరకూ కొంత కొంత వ్యాపారంగా ఉన్న వ్యవసాయం, నమ్మకం లేని ఒడిదుడుకుల రెగ్యులర్‌ ‘నష్ట వ్యాపారం’గా పరిణమించింది! రైతులు వాణిజ్యవేత్తలు కాకుండానే, చౌకగా పంటల్ని మాయం చేసే వాణిజ్యమయింది వ్యవసాయం!


మునుపటి రైతులు తమ కడుపుల్ని నింపుకొని, చుట్టూతా ఉన్న గ్రామ సమాజానికి కడుపునింపేవారు. రానురానూ వ్యవసాయ రంగాన్ని వ్యాపారస్తులు/మార్కెటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా శాసించడం మొదలైంది. అత్యాశలకు పోని రైతులు మార్కెట్‌ ప్రేరేపణలతో అత్యాశల్లో చిక్కుకున్నారు. ఈ అత్యాశల్లో మొదట చిక్కుకున్న వారంతా, ఇప్పటికీ లాభపడుతున్న వారంతా అధిక భూములు కలిగివున్న ధనిక రైతులేననేది నిర్వివాదాంశం. ఈ ధనిక రైతులు తమ అత్యాశలను చాలా జాగ్రత్తగా చిన్నకారు, సన్నకారు, కౌలుదారు రైతుల మీద, వ్యవసాయ కూలీల మీద రుద్దారు. దీంతో భారతదేశంలో ఆధిపత్య కులాల ధనిక భూస్వాములు లాభపడగా, బహుజన కులాల కౌలుదారులు, చిన్న రైతులు తీవ్రంగా నష్టాలపాలవుతున్నారు.


వ్యవసాయంలో వచ్చిన ఆధునిక సంస్కరణలన్నీ మానవాభివృద్ధికే అనే విలువల్ని పెద్ద రైతులు అంటుగట్టుకున్నారు. మెల్లగా సమాజం అంతా అంగీకరించేలా చేశారు. ఇలా మన దేశంలో వ్యవసాయం పరిశ్రమగా మారకుండానే, వ్యవసాయ మార్కెటీకరణ జరిగిపోయింది. సబ్సిడీలు, రుణమాఫీలు, వడ్డీ మాఫీలు, బీమాలు, అప్పులు, మారటోరియాలు, నష్టపరిహారాలు, రైతుబంధు పథకాలు, మద్దతుధరలు, రాయితీలు, మినహాయింపులు- ఇలాంటివెన్నో సదుపాయాలు కల్పిస్తున్నా, చిన్న రైతుల వ్యవసాయం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. చిన్న రైతులు, కౌలు రైతులకు లాభాలకు బదులుగా అప్పులు, నష్టాలు, ఆత్మహత్యలను నేటి వ్యవసాయం మిగిల్చింది. అన్ని పరిస్థితుల్లోనూ పాలక కులాలకు చెందిన కొంతమంది ధనిక భూస్వాములే లబ్ధిదారులు అవుతున్నారు.


కేంద్రప్రభుత్వం సంక్షేమాన్ని రైతుల వైపు నుంచి చూడదలచుకున్నదో లేక కార్పొరేట్ల వైపు నుంచి చూడదలచుకున్నదో నేరుగా స్పష్టం చెయ్యాలి. ద్వందార్థ చట్టాలతో ఇది వీలుగాదు. సంక్షేమ రాజ్యంలో రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలవుతున్నా, అవి ధనిక రైతులకు, భూస్వాములకు అందుతున్నట్లుగా చిన్న రైతులు, కౌలు రైతులకు, సామాజికంగా బలహీనవర్గాల రైతులకు అందడం లేదనేది అందరికీ తెలిసిందే. బలహీనవర్గాల చిన్న రైతుల సాధికారతే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను సమీక్షించుకోవల్సిన అవసరం ఉంది. రైతుల డిమాండ్లను సానుకూల దృష్టితో కేంద్రప్రభుత్వం పరిష్కరించవలసిన అవసరం ఉంది. భారతదేశ సుక్షేత్రంలో కంకుల వెన్నులై నిలిచిన రైతులను దేశ ఆహార ఉత్పత్తి వ్యవస్థలకు వెన్నెముకగా నిలుపుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఉంది.


కృపాకర్‌ పొనుగోటి

Updated Date - 2021-01-09T06:11:38+05:30 IST