Gazette కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్లు విడుదల

ABN , First Publish Date - 2021-07-16T16:30:44+05:30 IST

తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల జగడంపై కేంద్రం దృష్టి పెట్టింది.

Gazette కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధిపై గెజిట్లు విడుదల

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల జగడంపై కేంద్రం దృష్టి పెట్టింది. కృష్ణా, గోదావరి యాజమాన్య బోర్డుల పరిధులు ఖరారు చేస్తూ కేంద్ర జల్ శక్తిశాఖ గెజిట్లు విడుదల చేసింది. రెండు రాష్ట్రాల్లో విస్తరించిన కృష్ణా, గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నిర్వాహణను కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగించింది. రెండు బేసిన్లలోని ప్రాజెక్టులను బోర్డుల పర్యవేక్షణ కిందికి తీసుకువచ్చింది. అక్టోబర్ 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రానుంది.


కృష్ణా జలాలపై 6 నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో వివాదం నెలకొంది. నదిపై కట్టిన ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలపై సంపూర్ణ అధికారం కోరుకుంటూ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు కేఆర్ఎంబీ తుది ముసాయిదాను ఇదివరకే తెలుగు రాష్ట్రాలకు పంపించి అభిప్రాయాన్ని తీసుకుంది. ఈ ముసాయిదాను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకించింది. ముదురుతున్న జల వివాదం నేపథ్యంలో కేంద్రం ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాజెక్టుల కార్యకలాపాలు, నిర్వహణ, నియమనిబంధనలను ఈ గెజిట్‌లో పొందుపరిచారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయింపులున్న ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డు పరిధిలోకి వస్తాయని కేంద్రం పేర్కొంది.


కృష్ణానదిపై 36, గోదావరిపై 71 ప్రాజెక్టులను కేంద్రం బోర్డుల పరిధిలోకి తెచ్చింది. అనుమతిలేని ప్రాజెక్టులకు 6 నెలల్లోపు అనుమతులు తెచ్చుకోవాలని, అనుమతులు రాకపోతే ప్రాజెక్టులు నిలిపివేయాలని కేంద్రం స్పష్టం చేసింది. బోర్డులకు చైర్మన్లు, సభ్య కార్యదర్శి, చీఫ్‌ ఇంజినీర్లు ఇతర రాష్ట్రాలకు చెందినవారని, అన్ని ప్రాజెక్టుల నిర్వహణ బోర్డులే చూసుకుంటాయని కేంద్రం పేర్కొంది. ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ.200 కోట్ల చొప్పున డిపాజిట్‌ చేయాలని, సీడ్‌ మనీ కింద 60 రోజుల్లో డిపాజిట్‌ చేయాలంది. నిర్వహణ ఖర్చులను అడిగిన 15 రోజుల్లోపు చెల్లించాలని, ప్రాజెక్టుల నుంచి నీళ్లు, విద్యుదుత్పత్తిని బోర్డే పర్యవేక్షిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది.

Updated Date - 2021-07-16T16:30:44+05:30 IST