ట్రిబ్యునల్ జాప్యానికి కేసీఆరే కారణం: కేంద్ర మంత్రి షెకావత్

ABN , First Publish Date - 2021-11-12T00:05:29+05:30 IST

రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదంపై కేంద్రం స్పందించింది. కొత్త ట్రిబ్యునల్

ట్రిబ్యునల్ జాప్యానికి కేసీఆరే కారణం: కేంద్ర మంత్రి షెకావత్

ఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాల జల వివాదంపై కేంద్రం స్పందించింది. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యానికి కేసీఆరే కారణమని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అన్నారు. ఆలస్యానికి తాము కారణం కాదన్నారు. గత ఏడేళ్లుగా వివాదంలో కొనసాగుతున్న జల వివాదానికి కేంద్రం ఎలా కారణమని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాల పరిధిలోని జల వివాదాల పరిష్కారానికి కేంద్రం సుముఖంగా ఉందన్నారు. ప్రజలకు, దేశానికి వాస్తవ విషయాలు చెప్పాల్సిన ఆవశ్యకత కేంద్రంపై ఉందన్నారు. కేసీఆర్‌ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. సీఎం కేసీఆర్‌ కొత్త ట్రైబ్యునల్ కావాలని అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ట్రైబ్యునల్‌ కోసం తెలంగాణ సుప్రీంకోర్టును ఆశ్రయించిందన్నారు.




జల వివాదాలపై తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించిందని షెకావత్‌ తెలిపారు. రెండు రోజుల్లో సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకుంటానని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చెప్పిన కేసీఆర్‌ ఏడు నెలల తరువాత ఆ పని చేశారన్నారు. కేసు కోర్టు పరిధిలో ఉండగా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ట్రైబ్యునల్ ఏర్పాటులో ఆలస్యానికి తెలంగాణే కారణమని షెకావత్‌ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని నిందించడం విడ్డూరమని షెకావత్‌ పేర్కొన్నారు. ముఖ్యమంత్రులు ఒప్పుకున్న తరువాతే బోర్డుల పరిధులు ఖరారు చేస్తామన్నారు.  

Updated Date - 2021-11-12T00:05:29+05:30 IST