కేంద్రబృందం తీరుపై రైతుల అసంతృప్తి

ABN , First Publish Date - 2020-12-05T06:03:54+05:30 IST

ఇటీవల కురిసిన భారీవర్షాలకు నీటమునిగి కుళ్లిపోయిన వరి పంటను చూసేందుకు కేంద్ర బృందం పొలాలకు రాకపోవడంపై బాధిత రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రబృందం తీరుపై రైతుల అసంతృప్తి
మాకవరపాలెం మండలం తామరంలో తడిసి రంగు మారిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న కేంద్ర బృందం


వరి పొలాలను సందర్శించకపోవడంపై విస్మయం 


విశాఖపట్నం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన భారీవర్షాలకు నీటమునిగి కుళ్లిపోయిన  వరి పంటను చూసేందుకు కేంద్ర బృందం పొలాలకు రాకపోవడంపై బాధిత రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యంతోపాటు నీటమునిగిన వరిపైరుకు ఎంత మేర నష్టం వాటిల్లిందో తెలుసుకోవాలంటే క్షేత్రస్థాయిలో పర్యటించాలని అంటున్నారు. వర్షాలకు తడిసిపోయిన వరిపంటకు సంబంధించి ధాన్యం నాణ్యతను నిర్ధారించడానికి గురు, శుక్రవారాల్లో ముగ్గురు అధికారులతో కూడిన కేంద్ర బృందం జిల్లాలో పది మండలాల్లో పర్యటించింది. గురువారం పాయకరావుపేట మండలంలో ఒక గ్రామంలో మినహా మరెక్కడా వరి పొలాలను సందర్శించలేదు. మిగిలిన ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి, అక్కడ వ్యవసాయ శాఖ సిబ్బంది తీసుకువచ్చిన ధాన్యం నమూనాలను పరిశీలించారు. అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు కొద్దిమంది రైతులు తీసుకువచ్చిన ధాన్యం చూసి వాటిని నమూనాలుగా తీసుకున్నారు. భారీ వర్షాల కారణంగా  వివిధ దశల్లో వున్న వరి పంటకు వాటిల్లిన నష్టం గురించి కేంద్ర బృందానికి వివరిద్దామని ఎదురు చూశామని, కానీ పొలాలకు రాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లడంతో తీవ్ర నిరాశ చెందామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 

కాగా కేంద్రం బృందం వరి పొలాలను సందర్శించకపోవడాన్ని జిల్లా పౌరసరఫరాల సంస్థ డీఎం వెంకటరమణ వద్ద ప్రస్తావించగా.... కోత కోసిన తరువాత కురిసిన వర్షాలకు ధాన్యం తడిసి నాణ్యత కోల్పోవడం, రంగుమారడం, మొలకెత్తడం వంటి అంశాలను గుర్తించడానికి కమిటీ పర్యటించిందన్నారు. కొన్నిచోట్ల రైతులతో మాట్లాడి వారు తీసుకువచ్చిన ధాన్యం నుంచి శాంపిల్స్‌ తీసుకున్నారని, వీటిని శనివారం ఎఫ్‌సీఐ ల్యాబ్‌లో పరీక్షించి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని అన్నారు. పంటనష్టంపై త్వరలో మరో కమిటీ పర్యటిస్తుందని చెప్పారు.


రెండు మండలాల్లో కేంద్ర బృందం పర్యటన

నర్సీపట్నం అర్బన్‌/మాకవరపాలెం: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తడిసిపోయి రంగుమారిన, మొలకెత్తిని ధాన్యాన్ని పరిశీలించేందుకు కేంద్రం బృందం శుక్రవారం నర్సీపట్నం మండలం వేములపూడి, మాకవరపాలెం మండలం తామరం గ్రామాలకు వచ్చింది.  నర్సీటపట్నం మండలం దుగ్గాడ గ్రామానికి చెందిన భీమిరెడ్డి రామ్మూర్తి, ధర్మసాగరం గ్రామానికి చెందిన అనిమిరెడ్డి సురేశ్‌ తీసుకువచ్చిన ధాన్యాన్ని వేములపూడి ఆర్‌బీకే-1లో పరిశీలించారు. చేతికి వచ్చే దశలో పంట పూర్తిగా నీట మునిగి తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు. కాగా మాకవరపాలెం మండలం తామరం పీఏసీఎస్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. కొంతమంది రైతులు తీసుకువచ్చిన వరి పనులు, రంగు మారిన ధాన్యం పరిశీలించి, వాటి నుంచి నమూనాలు సేకరించారు. ఈ బృందంలో ఎం.జడ్‌.ఖాన్‌, నవీన్‌, జి.కిరణ్‌కుమార్‌తోపాటు ఏడీఏ కె.భారతి, మోహనరావు, ఏవో చిరంజీవి, తదితరులు వున్నారు.. 


Updated Date - 2020-12-05T06:03:54+05:30 IST