మా టార్గెట్‌ పూర్తయ్యింది..బియ్యం పంపొద్దు!

ABN , First Publish Date - 2020-09-25T06:25:38+05:30 IST

అకాల వర్షంతో జరిగిన పంట నష్టం అంచనా వేయడానికి కేంద్రం బృందం మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించింది.

మా టార్గెట్‌ పూర్తయ్యింది..బియ్యం పంపొద్దు!

మిల్లర్లకు తేల్చి చెప్పిన ఎఫ్‌సీఐ

10వేల టన్నులు కూడా కొనకనే ఆదేశాలు

120 మిల్లులో 40వేల టన్నుల బియ్యం నిల్వ

తీవ్రంగా నష్టపోనున్న అన్నదాత

జిల్లాలో ముగిసిన కేంద్ర బృందం పర్యటన

వరదతో రూ.8.5 కోట్ల నష్టంపై నివేదిక

బృందం సభ్యుల హామీ నెరవేరుతుందా!?


నెల్లూరు (ఆంధ్రజ్యోతి): అకాల వర్షం పంటను ముంచేసింది. ఊహించని పెన్నా ఉప్పెన వేల ఎకరాల్లో కోతకొచ్చిన వరి పంటను తనలో కలిపేసుకుంది. వేల పుట్ల కొద్ది ధాన్యం తడిసి ముద్దయ్యింది. జిల్లా రైతుకు ఇదోరకం కష్టం. 


జిల్లాలోని మిల్లులో 40వేల టన్నుల బియ్యం నిల్వ ఉండిపోయింది. ‘‘మాకు టార్గెట్‌ లేదు.. మీ బియ్యం మా గోదాముకు తోలద్దు’’ అంటూ ఎఫ్‌సీఐ గురువారం మిల్లర్లకు తెగేసి చెప్పేసింది. బియ్యం ఎఫ్‌సీఐ గోదాముకు చేరితేనే రైతుకు వరి ధాన్యం తాలూకు డబ్బు ఖాతాలో జమ అవుతుంది. బియ్యం మిల్లులోనే ఆగిపోతే ఇక రైతు గతేం కాను. ఇది మరో కష్టం. 


అకాల వర్షంతో జరిగిన పంట నష్టం అంచనా వేయడానికి కేంద్రం బృందం మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించింది. మంగళ, బుధ, గురువారాల్లో నెల్లూరు, నాయుడుపేట, కావలి, ఆత్మకూరు, గూడూరు నియోజకవర్గాల్లో పర్యటించింది. అంతకుముందు కేంద్ర కమిటీకి జిల్లా రైతు కష్టాలను కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఏకరువు పెట్టారు. మూడు రకాలుగా సాయం అందించమని అభ్యర్థించారు. వరద కారణంగా పంట నష్టపోయిన వారికి పంట నష్టపరిహారం కింది, పంట దిగుబడి వచ్చిన రైతులకు పంటల బీమా పథకం కింద, తడిసి రంగు మారిన ధాన్యం ఎఫ్‌సీఐ కొనుగోలు చేసేలా కేంద్రానికి సిఫారసు చేయాలని కలెక్టర్‌ కోరారు. అకాల వర్షం, వరదల కారణంగా జిల్లాలో సుమారు 8.50 కోట్ల రూపాయల పంట నష్టం జరిగిందని  పేర్కొంటూ వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా నివేదికను కేంద్ర కమిటీకి అందజేసింది.


కమిటీ సభ్యులు కూడా జిల్లాలో విస్తృతంగా పర్యటించి 30 చోట్ల  తడిసిన ధాన్యం నమూనాలను సేకరించింది. వీటిని విజయవాడ, న్యూఢిల్లీ ల్యాబ్‌లకు పంపి రిపోర్టు తీసుకుంటామని, అవసరం అయితే నిబంధనలను సడలించి అయినా ఎఫ్‌సీఐ కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని బృంద సభ్యులు రైతులకు హామీ ఇచ్చారు. ల్యాబ్‌ రిపోర్టు వచ్చే వరకు, రంగుమారిన ధాన్యం కొనుగోలుకు కేంద్రం ఎఫ్‌సీఐని ఆదేశించే వరకు ఈ సస్పెన్స్‌ కొనసాగుతూనే ఉంటుంది. 


చేతులెత్తేసిన ఎఫ్‌సీఐ

రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఉప ప్రధాని వెంకయ్య నాయుడు చొరవతో అక్టోబరు 31వరకు మిల్లర్ల నుంచి ఎఫ్‌సీఐ బియ్యాన్ని సేకరించేందుకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మారింది.  ‘‘మాకు ఇచ్చిన కోటా పూర్తయ్యింది. మీరు మా గోదాముకు బియ్యం పంపొద్దు.’’ అంటూ ఎఫ్‌సీఐ అధికారులు గురువారం జిల్లా మిల్లర్లకు తేల్చి చెప్పారు. దీంతో మిల్లర్ల అసోసియేషన్‌ ఎఫ్‌సీఐ గోదాముకు (కాకటూరు) బియ్యం సరఫరా ఆపాలని జిల్లావ్యాప్తంగా మిల్లర్లకు సూచించారు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు సుమారు 50వేల టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐ కొనుగోలు చేస్తుందని జిల్లా మిల్లర్లు అంచనా వేశారు. అయితే పట్టుమని పదివేల టన్నులు కూడా కొనుగోలు చేయకముందే ఈ కోటా పూర్తి అయ్యిందని అధికారులు తెలపడంతో రైతుల నెత్తిన పిడుగుపడినట్లు అయ్యింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 120 మిల్లుల్లో సుమారు 40వేల టన్నుల బియ్యం నిల్వ ఉంది.


ఈ బియ్యం ఎఫ్‌సీఐ గోదాముకు చేరితేనే రైతుల ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. ఉన్నఫళంగా ఎఫ్‌సీఐ సరఫరా నిలిపివేయమనడంతో రైతులకు డబ్బులు అందే అవకాశం లేదు. చేతికందిన పంట నోటికందని విధంగా వరి ధాన్యం మిల్లులకు చేరిందే కానీ, ఆ ధాన్యానికి రావాల్సిన డబ్బులు   చేతికందే అవకాశం లేదు. ఈ పరిస్థితిపై జిల్లా అధికారులు రాష్ట్ర సివిల్‌ సప్లయ్స్‌ కమిషనర్‌కు లేఖ రాసి, ఆయన కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు లేఖ రాసి, వారు ఎఫ్‌సీఐ గోదాము అధికారులను ఆదేశిస్తే తప్ప మిల్లుల్లో ఉన్న బియ్యం గోదాములకు చేరవు. రైతు ఖాతాల్లో డబ్బులు పడవు. సోమశిలలో నీరుంది కదా అని ఎన్నో ఆశలతో ఎడగారు సేద్యానికి పూనుకున్న పాపానికి వరి రైతులు ధాన్యం కొనుగోలు మొదలైన రోజు నుంచి నేటి వరకు కంటికి కడివెడు నీరు కార్చే పరిస్థితి ఎదురయ్యింది. 

Updated Date - 2020-09-25T06:25:38+05:30 IST