ఏకీకరణ దిశగా బ్రోకింగ్ వ్యాపారం

ABN , First Publish Date - 2020-09-20T06:34:50+05:30 IST

ఏంజెల్‌ బ్రోకింగ్‌ రూ.600 కోట్ల సమీకరణకు పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. కొత్త షేర్ల జారీ ద్వారా రూ.300 కోట్లు.. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా రూ.300 కోట్లు సమీకరించనుంది. ఈ నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు, నిర్వహణ మూలధనానికి వినియోగించనున్నట్లు ఏంజెల్‌ బ్రోకింగ్‌ సీఈఓ వినయ్‌ అగర్వాల్‌ తెలిపారు...

ఏకీకరణ దిశగా బ్రోకింగ్ వ్యాపారం

  • ఆప్షన్లపై రిటైల్‌ ఇన్వెస్టర్లు ఆసక్తి
  • తృతీయ శ్రేణి పట్టణాల్లో ట్రేడింగ్‌ జోరు
  • ఏంజెల్‌ బ్రోకింగ్‌ సీఈఓ వినయ్‌ అగర్వాల్‌


ఏంజెల్‌ బ్రోకింగ్‌ రూ.600 కోట్ల సమీకరణకు పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. కొత్త షేర్ల జారీ ద్వారా రూ.300 కోట్లు.. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా రూ.300 కోట్లు సమీకరించనుంది. ఈ నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు, నిర్వహణ మూలధనానికి వినియోగించనున్నట్లు ఏంజెల్‌ బ్రోకింగ్‌ సీఈఓ వినయ్‌ అగర్వాల్‌  తెలిపారు. ఇష్యూ ఈనెల 22న ప్రారంభమై 24న ముగుస్తుంది. రూ.10 ముఖ విలువ కలిగిన షేరుకు రూ.305-306 ధర శ్రేణిని నిర్ణయించారు.  పబ్లిక్‌ ఇష్యూ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’తో అగర్వాల్‌ మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు..


టెక్నాలజీ కారణంగా బ్రోకింగ్‌ వ్యాపారంలో వస్తున్న మార్పులను వివరిస్తారా?

టెక్నాలజీ కారణంగా డిజిటల్‌ బ్రోకింగ్‌ విధానం పుంజుకుంటోంది. డిజిటల్‌ బ్రోకింగ్‌తో తగ్గిన వ్యయాల ను ఖాతాదారులకు బదిలీ చేస్తూ.. బ్రోకింగ్‌ కంపెనీలు పోటీ పడుతున్నాయి. గతంలో బ్రోకింగ్‌ సేవలకు లావాదేవీపై లభించే పారితోషికం శాతంలో ఉండేది. ఇప్పుడు లావాదేవీకి ఒక స్థిర మొత్తాన్ని మాత్రమే బ్రోకరేజీ కంపెనీలు వసూలు చేస్తున్నాయి. ఏంజెల్‌ బ్రోకింగ్‌ డెలివరీ లావాదేవీకి ఏమీ వసూలు చేయడం లేదు. డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌కు ఒక్కో లావాదేవీకి రూ.20 వసూలు చే స్తోంది. బ్రోకింగ్‌ పరిశ్రమ ఏకీకరణ దిశగా పయనిస్తోంది. మొత్తం అకౌంట్లలో 44 శాతం మొదటి అయిదు బ్రోకింగ్‌ కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. గత త్రైమాసికంలో కొత్తగా డీమ్యాట్‌ ఖాతాను ప్రారంభించిన రిటైల్‌ ఇన్వెస్టర్లలో 68శాతం మందిని ఈ సంస్థలే ఆకర్షించాయి.


తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా మార్కెట్‌లో ట్రేడింగ్‌ చేసేవారు పెరుగుతున్నారు. దీనికి కారణం?

సాధారణంగా తృతీయ శ్రేణి పట్టణాల్లో బ్రోకింగ్‌ కంపెనీల శాఖలుండవు. అయితే ఇప్పుడు 4జీ, స్మార్ట్‌ ఫోన్లు అందరి వద్ద ఉన్నాయి. 30-35 సంవత్సరాల మధ్య  వయస్కులు మార్కెట్‌పై ఆసక్తి చూపుతున్నారు. వడ్డీరేట్లు తక్కువగా ఉండ డం వల్ల మార్కెట్‌లో మదుపు చేయాలనుకుంటున్నారు. డీమ్యాట్‌ ఖాతాను ఆన్‌లైన్‌ లో 10 నిమిషాల్లో ప్రారంభించవచ్చు. డిజిటల్‌ విధానంలో అన్నీ సులభం అయ్యాయి. దీంతో మొబైల్‌ ఫోన్‌పై ట్రేడింగ్‌ చేస్తున్నారు. ఏంజెల్‌ బ్రోకింగ్‌ రిటైల్‌ ఇన్వెస్టర్లలో 53 శాతం మంది తృతీయ శ్రేణి పట్టణాల్లోనే ఉన్నారు. ఏంజెల్‌ బ్రోకింగ్‌ వద్ద 22 లక్షల మంది రిటైల్‌ మదుపర్లున్నారు. వీరిలో 7.7 లక్షల మంది చురుగ్గా ట్రేడింగ్‌ చేస్తున్నారు.


ఏంజెల్‌ బ్రోకింగ్‌ భవిష్యత్‌ ప్రణాళికలు?

బ్రోకింగ్‌ ఆదాయం, ఖాతాదారుల పరంగా దేశంలో అతిపెద్ద బ్రోకింగ్‌ సంస్థగా ఆవిర్భవించడం మా లక్ష్యం. ఏంజెల్‌ బ్రోకింగ్‌కు సాధారణ శాఖలు లేవు. డిజిటల్‌గా నే విస్తరిస్తాం. వ్యాపార, ఖాతాదారుల విస్తరణకు మొబై ల్‌ ప్లాట్‌ఫారమ్‌, కృత్రిమమేధ, కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులు పెడతాం. ఎన్‌ఎ్‌సఈలో 1.2 కోట్ల మంది యాక్టి వ్‌ రిటైల్‌ ట్రేడర్లున్నారు. ఈ ట్రేడర్లలో అత్యధికంగా ట్రేడర్లను కలిగిన బ్రోకింగ్‌ సంస్థల్లో ఏంజెల్‌ బ్రోకింగ్‌ నాలుగో స్థానంలో ఉంది. కొత్త డీమ్యాట్‌ ఖాతాను ప్రారంభిస్తున్న ప్రతి ఏడుగురిలో ఒకరు మా ఖాతాదారుడే. 


మార్కెట్‌పై మీ అంచనాలు?

దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) రేటు ఆశాజనకంగా లేదు. మార్కెట్‌ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కంటే.. భవిష్యత్తులోని పరిస్థితులకు అనుగుణంగా కదులుతుంది. ఆర్థిక వ్యవస్థలు స్థిరపడేందుకు 2022 వరకూ ఆగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. భవిష్యత్తులో మార్కెట్‌ను అంచనా వేసే స్థితి లేదు. 


ఇటీవల రిటైల్‌ ఇన్వెస్టర్ల ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌ ట్రేడింగ్‌పై ఆసక్తి చూపడానికి కారణం?

ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్ల విభాగంలో లావాదేవీల పరిమాణం బాగా పెరుగుతోంది. ముఖ్యంగా రిటైల్‌ ఇన్వెస్టర్లు ఆప్షన్లను ఎంచుకుంటున్నారు. గత ఏడాదిలో డెరివేటివ్స్‌ విభాగంలో రిటైల్‌ ఇన్వెస్టర్ల లావాదేవీల పరిమాణం 30 శాతం పెరిగింది. కాల్‌, పుట్‌ ఆప్షన్లలో రిటైల్‌ మదుపర్లకు రిస్క్‌ తక్కువగా ఉంటుంది. అందువల్లే రిటైల్‌ ఇన్వెస్టర్లు ఆప్షన్లలో ట్రేడింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. ఫ్యూచర్స్‌లో పూర్తి మార్జిన్‌ను చెల్లించాలి. ఆప్షన్‌లో ఒక లాట్‌కు చెల్లించే ప్రీమియం తక్కువగానే ఉంటుంది. రిటైల్‌ ఇన్వెస్టర్‌ దాన్ని భరించి రిస్క్‌ చేసే వెసులుబాటు ఉంటుంది. 

- ఆంధ్రజ్యోతి బిజినెస్‌


Updated Date - 2020-09-20T06:34:50+05:30 IST