కొత్త కోవిడ్ నిబంధనలపై కేంద్రం, మహారాష్ట్ర మధ్య జగడం

ABN , First Publish Date - 2021-12-02T18:34:22+05:30 IST

కోవిడ్-19 కొత్త రూపాంతరం ఒమైక్రాన్ భయం

కొత్త కోవిడ్ నిబంధనలపై కేంద్రం, మహారాష్ట్ర మధ్య జగడం

ముంబై : కోవిడ్-19 కొత్త రూపాంతరం ఒమైక్రాన్ భయం వెంటాడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య జగడం జరుగుతోంది. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా లేవని, ఏకరీతిగా అమలు చేయడానికి వీలుగా ఈ కొత్త నిబంధనలను సవరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 


అయితే మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దేబశిశ్ చక్రవర్తి బుధవారం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను సవరించబోమని, సమీక్షించబోమని చెప్పారు. విపత్తు నిర్వహణ చట్టం, అంటువ్యాధుల నిరోధక చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని అధికారాలు ఉన్నాయన్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అదనపు షరతులను విధించే అధికారం రాష్ట్రానికి ఉందన్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం తాజాగా జారీ చేసిన  మార్గదర్శకాలను సమీక్షించరాదని, సవరించరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కేవలం సూచన మాత్రమే చేసిందని, అది నిర్బంధం కాదని అన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికార వర్గాల కథనం ప్రకారం ఈ మార్గదర్శకాలను గురువారం సవరించే అవకాశం ఉంది. 


కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కేవలం కోవిడ్-19, దాని రూపాంతరాల రిస్క్ ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మాత్రమే ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరి. అయితే మహారాష్ట్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ దీనిని తప్పనిసరి చేసింది. 


ముంబై విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులకు కోవిడ్ నెగెటివ్ రిపోర్టు వచ్చినప్పటికీ 14 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఈ సమయం ఏడు రోజులేనని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 


Updated Date - 2021-12-02T18:34:22+05:30 IST