అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనం చేస్తాం : కేంద్రం

ABN , First Publish Date - 2022-01-21T19:43:11+05:30 IST

అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో

అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనం చేస్తాం : కేంద్రం

న్యూఢిల్లీ : అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా శుక్రవారం తెలిపింది. భారత్-పాకిస్థాన్ మధ్య 1971లో జరిగిన యుద్ధంలో అమరులైన సైనికుల స్మారకార్థం ఈ అమర జవాన్ జ్యోతిని ఇండియా గేట్ వద్ద ఏర్పాటు చేశారు. 50 ఏళ్ళ క్రితం  ఏర్పాటు చేసిన ఈ జ్యోతిని  ఆర్పేస్తున్నారని తప్పుడు ప్రచారం జరుగుతోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు మీడియా తెలిపింది. 


‘‘అమర జవాన్ జ్యోతి 1971లో జరిగిన యుద్ధం, ఇతర యుద్ధాల్లో అమరులైనవారికి శ్రద్ధాంజలి ఘటిస్తోంది, కానీ వారి పేర్లు అక్కడ లేకపోవడం విచిత్రం. ఒకటో ప్రపంచ యుద్ధంలోనూ, ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్దంలోనూ బ్రిటిష్ పాలకుల తరపున పోరాడిన కొందరు అమరుల పేర్లు మాత్రమే ఇండియా గేట్‌పై రాసి ఉన్నాయి. ఇది మన వలస పాలనకు ప్రతీక. 1971లో, ఆ తర్వాత, ముందు జరిగిన, అన్ని యుద్ధాల్లోనూ అమరులైన భారతీయ అమర వీరుల పేర్లన్నీ జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉన్నాయి. కాబట్టి అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించే జ్యోతి జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉండటమే నిజమైన శ్రద్ధాంజలి అర్పించడం అవుతుంది’’ అని ప్రభుత్వ వర్గాలు చెప్పినట్లు జాతీయ మీడియా తెలిపింది. 


అమర జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారక జ్యోతిలో విలీనం చేయడాన్ని విమర్శించడం హాస్యాస్పదమని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఏడు దశాబ్దాలపాటు జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించనివారు ఇప్పుడు అమరులకు శాశ్వతంగా, దీటైన శ్రద్ధాంజలి ఘటించే అవకాశాన్ని కల్పిస్తూ ఉంటే విమర్శించడం వింతగా ఉందని పేర్కొన్నాయి. 


ఇదిలావుండగా, జాతీయ యుద్ధ స్మారకం ఇండియా గేట్‌కు సుమారు 500 మీటర్ల దూరంలో ఉంది. ఇండియా గేట్ ఎత్తు 42 మీటర్లు. మొదటి ప్రపంచ యుద్ధం (1914-18), మూడో ఆంగ్లో-ఆఫ్ఘన్ యుద్ధం (1919)లలో అమరులైన వేలాది మంది భారతీయ సైనికుల పేర్లను దీని మీద రాశారు. దీనిని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం నిర్మించింది. 


ఇందిరా గాంధీ ప్రభుత్వంలో...

మొదట్లో దీనివద్ద అమర జవాన్ జ్యోతి ఉండేది కాదు. భారత్-పాకిస్థాన్ యుద్ధంలో అమరులైన 3,843 మంది భారతీయ సైనికుల స్మారకార్థం అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం ఈ జ్యోతిని ఏర్పాటు చేసింది. దీనిని ఇందిరా గాంధీ 1972 జనవరి 26న ఆవిష్కరించారు. భారతీయ దళాల అధిపతులు, విదేశీ నేతలు ఇక్కడ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటారు. గణతంత్ర దినోత్సవాలనాడు ప్రధాన మంత్రి అమర వీరులకు నివాళులర్పిస్తూ ఉంటారు. 


నరేంద్ర మోదీ ప్రభుత్వంలో...

జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్మించింది. భారత దేశ పరిరక్షణలో తమ ప్రాణాలను త్యాగం చేసిన భారతీయ సైనికుల స్మారకార్థం దీనిని నిర్మించింది. 2019 ఫిబ్రవరిలో దీనిని ప్రారంభించారు. అనంతరం అమరులకు శ్రద్ధాంజలి ఘటించే అన్ని కార్యక్రమాలను ఇక్కడే నిర్వహిస్తున్నారు. గణతంత్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా అమరులకు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమాలను కూడా ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఈ స్మారకంపై 25,942 మంది అమర వీరుల పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించారు. 


Updated Date - 2022-01-21T19:43:11+05:30 IST