వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2021-04-24T23:49:14+05:30 IST

దేశవ్యాప్తంగా పద్దెనిమిదేళ్ళ వయసు పైబడినవారందరికీ కోవిడ్-19

వ్యాక్సినేషన్ కోసం రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పద్దెనిమిదేళ్ళ వయసు పైబడినవారందరికీ కోవిడ్-19 నిరోధక వ్యాక్సినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. మే 1 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం కోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు చేపట్టవలసిన చర్యలను వివరించింది. వ్యాక్సినేషన్ చేసేందుకు ఆసుపత్రులు, క్లినికల్ ట్రీట్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్లను సమీక్షించుకోవాలని తెలిపింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, కోవిడ్-19పై పోరాడేందుకు ఏర్పాటు చేసిన సాధికార కమిటీ చైర్‌పర్సన్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు వెల్లడించింది. 


వయోజనులందరూ మే 1 నుంచి కోవిడ్-19 నిరోధక వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి అర్హులేనని తెలిపింది. మే 1 నుంచి వ్యాక్సిన్ డోసులను అమ్మవచ్చునని తెలిపింది. ప్రైవేటు రంగంలో వ్యాక్సిన్ అమ్మకాలు ప్రారంభమైనప్పటికీ 45 సంవత్సరాల కన్నా తక్కువ వయసుగలవారు మాత్రమే వ్యాక్సిన్ డోసును తీసుకోవడానికి అర్హులవుతారని తెలిపింది. 


ప్రైవేటు ఆసుపత్రులు, పరిశ్రమల్లోని ఆసుపత్రులు, పారిశ్రామిక సంఘాలు మొదలైనవాటితో సమన్వయం కుదుర్చుకుని అదనంగా ప్రైవేటు కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలను నమోదు చేయాలని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. వ్యాక్సిన్లను కొనుగోలు చేసి, వాటి నిల్వను, ధరలను కోవిన్ పోర్టల్‌లో ప్రకటించిన ఆసుపత్రులను పర్యవేక్షించాలని తెలిపింది. 


Updated Date - 2021-04-24T23:49:14+05:30 IST